
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కనబడుట లేదని బోర్డు పెట్టే పరిస్థితి వచి్చందని.. వీరిద్దరూ హైదరాబాద్‌లో కాపురం పెట్టి ఏపీపై పెత్తనం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 8 నెలలుగా కనిపించని తండ్రీ కొడుకుల్లో లోకేష్ ఇప్పుడొచ్చి కొత్త బిచ్చగాడి మాదిరి హడావుడి చేస్తున్నారన్నారు. ఆయనకు చంద్రబాబు కొడుకు అన్న హోదా తప్ప ఏముందని మంత్రి ప్రశ్నించారు. లోకేష్ మొదటిసారి వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టున్నాడని, అందుకే ఆయనకు వర్షాలకు, వరదలకూ తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ చేత చెప్పించుకునే దుస్థితిలో తమ ప్రభుత్వం లేదన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిరోజూ సమీక్షిస్తూ.. వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. 20 రోజులుగా మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు. అమరావతి ఏ ఒక్కరికో నోటిఫై చేసిన ప్రాంతం కాదని.. అక్కడ పేదలు, దళితులకు ఇళ్ల స్థలాలు పొందే హక్కు ఉందని అన్నారు. దానిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని.. అక్కడా మాదే పెత్తనం అని ఎవరైనా విర్రవీగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీసీలకు కార్పొరేషన్లు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ముందే ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో చెప్పారని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు. తమ ప్రభుత్వం కార్పొరేషన్లకు పాలకవర్గాలను ప్రకటించగానే చంద్రబాబు బీసీలకు అధ్యక్ష పదవి, పొలిట్ బ్యూరో సభ్యుల పదవులు ఇచ్చారన్నారు. దీన్ని బట్టి ఎవరు ఎవరిని అనుసరిస్తున్నారో అర్థమవుతోందన్నారు.