పచ్చ దళం.. ధిక్కార ‘గళం’  | Sakshi
Sakshi News home page

పచ్చ దళం.. ధిక్కార ‘గళం’ 

Published Thu, Mar 28 2024 5:34 AM

TDP Leaders Angry Over Chandrababu - Sakshi

టీడీపీలో ఆరని ఆగ్రహ జ్వాలలు    

అవనిగడ్డలో బుద్ధప్రసాద్‌కు మద్దతుగా రాజీనామాలకు సిద్ధమైన నేతలు, సర్పంచ్‌లు 

చీరాలలో కొండయ్యకు చేనేత నాయకుల నుంచి వ్యతిరేకత 

తంబళ్లపల్లెలో నిరసన సెగలు  

ఆదోనిలో మీనాక్షినాయుడు నిర్వేదం.. ఇండిపెండెంట్‌గా బరిలోకి! 

అవనిగడ్డ/చీరాల/బి.కొత్తకోట/సాక్షి అమలాపురం: ప్రజాగళం అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి సొంత పార్టీలోనే ధిక్కార గళం వినిపిస్తోంది. పార్టీలో చెలరేగిన టికెట్ల రగడ ఇంకా చల్లారలేదు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అధినేతకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు సీటివ్వకుంటే పార్టీ సభ్యత్వాలకు, సర్పంచ్‌ పదవులకు రాజీనామా చేస్తామని పలువురు టీడీపీ నే­తలు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం టీడీపీ మద్దతుదారులైన సర్పంచ్‌లు సమావేశమయ్యారు. బుద్ధప్రసాద్‌కు అన్యాయం చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.   

► చీరాల టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీలోని చేనేత నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు ఓటెయ్యొద్దని ఇంటింటికీ తిరిగి ప్రచారమూ చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పొన్నలూరు ప్రాంతానికి చెందిన కొండయ్య చీరాలకు వచ్చి చేనేత నాయకులను బహిరంగంగా దూషించి అవమానించడమే దీనికి కారణమని చేనేత నాయకులు ఆరోపిస్తున్నారు.  పొన్నూరు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ సజ్జా హేమలత, టీడీపీ నేత చాట్‌రాసి రాజేష్‌ వేర్వేరుగా కొండయ్యకు ఓటెయ్యొద్దంటూ ప్రచారం చేస్తున్నారు.

స్థానికేతరుడికి టికెట్‌ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అభ్యర్థిని మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. చేనేతలకు ఎక్కడా సీటు ఇవ్వకుండా చంద్రబాబు తమను మోసం చేశారని చేనేత ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు అన్నగుండ ఆదినారాయణ మరి కొందరు రాష్ట్ర నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేతల ఓట్లు 40 లక్షలు ఉన్నాయని, తమ సత్తా టీడీపీకి చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.   

► తంబళ్లపల్లె టీడీపీ టికెట్‌ వ్యవహారం మళ్లీ మొదటికొచి్చంది. గతనెల 24న టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించినా రాజకీయాలకు సంబంధం లేని ఆయనను అభ్యర్థిగా ఎలా పెడతారంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్, పార్టీ నేతలు కొండా నరేంద్ర తదితరుల నుంచి వ్యతి­రేకత వ్యక్తమవుతుండడంతో రాజకీయ సమీకరణా­లు మారాయి.

దీంతో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, శంకరయాదవ్, మధుసూదన్‌రెడ్డి తదితరుల పేర్లతో ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఫలితంగా క్యా­డర్‌లో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే బీజేపీ కొత్తగా  రాజంపేట, తంబళ్లపల్లెలో ఒకదానిని బీ­జేపీ­కి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న దృష్ట్యా తంబళ్లపల్లెను ఆ పార్టీకి ఇచ్చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.  

► అమలాపురం అసెంబ్లీ స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు గెలుపు సాధ్యం కాదనే వాదన సొంత పార్టీలోనే వ్యక్తమవుతోంది. గత ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు క్యాడర్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.   

టీడీపీ ఆఫీసులో జనసేన చేరికలు  
విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో జనసేన పార్టీ చేరికల కార్యక్రమం నిర్వహిస్తున్న దక్షిణ అభ్యర్థి వంశీకృష్ణ  

సాక్షి, విశాఖపట్నం: విశాఖ దక్షిణం నియోజకవర్గంలో బుధవారం ఓ విచిత్రం చోటు చే­సుకుంది. ఇక్కడ జనసేనకు సొంత కార్యాలయం లేకపోవడంతో చేరికల కార్యక్ర­మా­న్ని నగర టీడీపీ కార్యాలయంలో జనసేన అభ్యర్థి చేపట్టారు. ఈ సీటును జనసేన నుంచి ఇద్దరు కార్పొరేటర్లు, మరో నాయకుడు ఆశించారు. అయితే వారిని కాదని వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన వంశీకృష్ణ శ్రీనివాస్‌కు పవన్‌ సీటు ఇచ్చారు. దీంతో జనసేన నేతలు రోడ్డెక్కి ఆందోళనలు చేశా­రు. ఈ గందరగోళంలో పార్టీ కార్యాల­య ఏర్పాటును నేతలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం జనసేనలో ఓ నలుగురు చేరడానికి రావడంతో అభ్యర్థి వంశీకృష్ణ నగరంలోని టీడీపీ కార్యాలయంలో చేరి­కల కా­ర్య­క్రమాన్ని నిర్వహించారు. ఈ పరిణా­మానికి విస్తుపోయిన టీడీపీ శ్రేణులు త­మ కా­ర్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు.    

Advertisement
Advertisement