విజయనగరం: కూటమిలో పదవుల పంపకం చిచ్చురేపింది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని ముందురోజు సాయంత్రం జనసేనకు కేటాయించి, రాత్రికిరాత్రే టీడీపీకి కట్టబెట్టడంతో జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే జెడ్పీ వైస్ చైర్మన్ పదవి కూడా దక్కలేదని, ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి కూడా లాగేసుకున్నారని జనజేన నాయకులు మండిపడుతున్నారు. సోమవా రం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం సాక్షిగా కూటమిలో విభేదాలు బహిర్గతమయ్యాయి.
డిప్యూటీ మేయర్ పదవికి జనసేన కార్పొరేషటర్ గురాన రాధికకు ఆదివారం సాయంత్రం పార్టీ బి–ఫారం అందింది. అయితే, రాత్రికిరాత్రే నిర్ణయం మారిపోయింది. 25వ వార్డు టీడీపీ కార్పొరేటర్ ప్రసాదుల రజనీ పేరు ఖరారైంది. ఈ పరిణామాన్ని జనసేన జీర్ణించుకోలేకపోతోంది. దీనికి నిరసనగా సోమవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియకు రాధిక గైర్హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి తమ ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీకి జరుగుతున్న అన్యాయాన్ని మీడియా సాక్షిగా వివరించారు.
పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఓట్లు వేయడమే తప్ప పదవులు మాత్రం జనసేన నాయకులకు దక్కడంలేదని వాపోయారు. పదవి తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుందన్నచోట కావాలనే రెబల్ అభ్యర్థిని బరిలో దించి ఓడిస్తున్నారన్నారు. కార్పొరేషన్ పరిధిలో జనసేన పార్టీకి 10 సీట్లు కేటాయిస్తే 6 సీట్లు గెలిచామని, మిగతా నాలుగుచోట్ల టీడీపీ వారే ఓడించారన్నారు. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించి అందజేసిన బి–ఫారంను మీడియాకు చూపించారు. అలాగే, తన మామ గురాన సాదూరావు హయాం నుంచి తమను రాజకీయంగా ఉపయోగించుకుని, పదవులు వచ్చే సమయానికి తొక్కేయడానికి చూస్తున్నారన్నారు. ఇక నుంచి అలా జరగనీయబోమని అన్నారు.

మేయర్‌గా అవనాపు భార్గవితో ప్రమాణం చేయిస్తున్న కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
జనసేన పార్టీకి పదవులేవీ?
జిల్లాలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన జనసేన పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీ పదవులు ఏ ఒక్కటీ కేటాయించకుండా తెలుగుదేశం పార్టీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ జిల్లాలో జనసేన పార్టీకి జరుగుతున్న అన్యాయంపై దృషి సారించాలన్నారు. సమావేశంలో జనసేన నాయకులు వి.వి.రమణమూర్తి, నడిపేన శ్రీనివాసరావు పాల్గొన్నారు.

డిప్యూటీ మేయర్‌గా ఎంపికైన ప్రసాదుల రజినీకి ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తున్న కలెక్టర్
కూటమి అంటే ఓట్లకోసమేనా?
ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు జనసేన బలం కావాలి కానీ, పదవులు పంచుకునేటప్పుడు మాత్రం జనసేన గుర్తుకు రాదా అని ఆ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కూటమి అంటే కేవలం ఓట్ల కోసమే కాదని, గెలిచిన తర్వాత పదవుల్లోనూ న్యాయమైన భాగాస్వామ్యం ఉండాలని వారు అంటున్నారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేసి గెలిచి ఉంటే అన్ని పదవులు తీసుకున్నా అభ్యంతరం ఉండేది కాదని, ఒంటరిగా గెలిచే బలంలేకనే జనసేన మద్దతు తీసుకుని ఇప్పుడు పక్కన పెడుతున్నారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
62 మందిలో 43 మందితోనే ఎన్నిక..
మొత్తం 62 మంది సభ్యులకు గాను 43 మంది మాత్రమే సభలో ఉన్నారు. కోరం సరిపోయిందని ప్రకటించిన కలెక్టర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. రజని పేరును 11వ వార్డు సభ్యురాలు మంజు రవ్వ ప్రతిపాదించగా 54వ వార్డు కార్పొరేటర్ మైలపల్లి పైడిరాజు బలపరిచారు. మరెవ్వరూ పోటీలో లేకపోవడంతో రజని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. కూటమి భాగస్వామ్యపక్షమైన జనసేన సభ్యులు ఒకరు లేకుండానే ఈ ఎన్నిక ముగియడం గమనార్హం. మేయర్, డిప్యూటీ మేయర్, సభ్యులను కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి, విజయనరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కమిషనర్ బి.బాలస్వామి అభినందించారు.
ప్రమాణ స్వీకారం అయిపోగానే బయటకు..
విజయనగరం కార్పొరేషన్ కార్యాలయంలో కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడు తేజ్ భరత్ పర్యవేక్షణలో సోమవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్‌గా ఎన్నికైన అవనాపు భార్గవి తొలుత ప్రమాణ స్వీకారం చేయగా, మిగిలిన సభ్యులు అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు 16 మంది సభ్యులతో పాటు ఇద్దరు స్వతంత్ర సభ్యులు, ఒకరు జనసేన కార్పొరేటర్ రాధిక సభ నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.


