డామిట్‌!.. కథ అడ్డం తిరిగింది.. టీడీపీకి పెద్ద షాకే తగిలింది..

Tdp Has Lost Its Reputation In Prakasam District - Sakshi

ఏపీలో ఉనికి కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఎంతకీ ప్రజలు గుర్తించడం లేదని దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. అధికార పార్టీ మీద బురద జల్లి లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తోంది. ఒంగోలులో లోకేష్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైఎస్సార్‌సీపీపై నెట్టే ప్రయత్నం చేసింది. విషయం తెలిసి ప్రజలు అసహ్యించుకోవడంతో సైలెంట్‌గా వాటిని తొలగించింది. ఇంతకీ ఒంగోలులో జరిగిందేంటి?

ప్రకాశం జిల్లాలో రాజకీయ భవిష్యత్ వెతుక్కుంటున్న తెలుగుదేశం, జనసేన నానా రకాల పాట్లు పడుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికార పార్టీ మీద విషం చిమ్మడం, ప్రజలతో చీవాట్లు తినడంతో తాజాగా ఫ్లెక్సీల వివాదానికి తెర తీశాయి. వైఎస్సార్‌సీపీ మీద విషం చిమ్ముతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు టీడీపీ, జనసేనలు సాగిస్తున్న కుట్ర రాజకీయాలను తెలియచేస్తున్నాయి.

ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం, దర్శి, కొండెపి పట్టణాల్లో నరకాసుర వధ అంటూ కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కించరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పైశాచికానందం పొందారు. ఈ ఫ్లెక్సీలపై అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్న పోలీసులపై కూడా దాడికి ప్రయత్నం చేసారు జనసేన కార్యకర్తలు. ఆ గొడవతో మైలేజ్ పొందుదామనుకున్నవారికి ప్రజల్లో అవమానాలు తప్పలేదు. 

ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న నారా లోకేష్ పాదయాత్రకు ప్రజల నుండి స్పందనే కనిపించడంలేదు. పాదయాత్ర వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ ఫ్లెక్సీల వివాదంను తెరపైకి తెచ్చింది. ఒంగోలు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతుగా రాత్రికి రాత్రే  ఫ్లెక్సీలు వెలిశాయి. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్‌.. అసలోడు వచ్చేవరకే.. కొసరోడుకి పండగ అనే కామెంట్స్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తెల్లవారు జాము నుండే ఎల్లో మీడియాకు లీకులిస్తూ.. వైఎస్సార్‌సీపీ నేతలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ ప్రచారం ప్రారంభించారు. అయితే తాము ఒకటి అనుకుంటే మరొకటి జరగడంతో ఉదయం 8 గంటలకల్లా టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను తొలగించేశారు.
చదవండి: ‘పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి పనిచేస్తున్నారా?’

జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు ద్వారా లబ్దిపొందుదామనుకున్న తెలుగు తమ్ముళ్లకు పెద్ద షాకే తగిలింది. నారా లోకేష్‌ను కొసరోడు అంటూ తెలుగు తమ్ముళ్లే ప్రచారం చేస్తున్నారనే ప్రచారం జిల్లాలో మొదలైంది. తమ నాయకుడిని తామే ఎగతాళి చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలు పెట్టారని టీడీపీ ఆఫీసుల్లోనే చర్చ జరిగింది. పార్టీకి జరిగిన డ్యామేజ్ గురించి అర్థం చేసుకునేలోగా.. చంద్రబాబు నుంచి చీవాట్లు రావడంతో సైలెంట్ అయిపోయారు. కొందరు వాలంటీర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ మీడియాకు చెప్పి మిన్నకుండిపోయారు. తర్వాత వాటిని తొలగించేశారు. తమ పార్టీని పైకి లేపుతూ...అధికార పార్టీ పరువు తీయాలని టీడీపీ వాళ్లు చేసే ప్రతి పనీ వారికే ఎదురుకొడుతోంది. ఎప్పటికప్పుడు తమ పరువును తామే తీసుకుంటున్నారంటూ టీడీపీ దీనస్థితిపై టాక్ నడుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top