స్టాలిన్.. కేంద్రం.. ఓ న్యాయ కమిషన్.. | Tamil Nadu CM MK Stalin Set Up High-level Committee To Strengthen Tamil Nadu Autonomy, More Details Inside | Sakshi
Sakshi News home page

స్టాలిన్.. కేంద్రం.. ఓ న్యాయ కమిషన్..

Apr 16 2025 12:19 PM | Updated on Apr 19 2025 9:06 AM

 Tamil Nadu CM MK Stalin Set up High-level committy

తమిళ సీఎం వ్యూహం ఫలించేనా?

న్యాయ కమిషన్ వల్ల ఒరిగేదేంటి?

సిఫారసులు అమలయ్యేనా?

ఈ మధ్య కాలంలో, కేంద్ర విధానాలపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన.. తాజాగా దక్షిణాది రాష్ట్రాల్లో కాకను పెంచుతోంది. కేంద్రంతో, దక్షిణాది రాష్ట్రాలు తగవు పెట్టుకోవడానికి ఇదొక్కటే కారణం కాదు. కేంద్ర ప్రభుత్వం.. ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈమధ్య తీసుకుంటోన్న కొన్ని కీలక నిర్ణయాలు.. దక్షిణాది రాష్ట్రాల్లోని ఎన్డీయేతర ప్రభుత్వాల అధినేతల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి. అసంతుష్ట సీఎంల జాబితాలో.. తమిళనాడు ప్రభుత్వాధినేత ఎంకే స్టాలిన్ ముందు వరుసలో ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలు, వైఖరికి నిరసనగా స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే పనిలో పడ్డారు. తొలుత, త్రిభాషా విధానంపై.. తమిళనాడులోని అన్ని రాజకీయ పక్షాలనూ.. తన దారిలోకి తెచ్చుకున్నారు. ముందు నుంచీ హిందీ వ్యతిరేక విధానాన్ని ఒంట పట్టించుకున్న తమిళ ప్రజలకు, తాము ఎక్కడ దూరమవుతామోనని, అక్కడి అన్ని పార్టీలూ, త్రిభాషా విధానాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఇదే ఊపులో.. స్టాలిన్, జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలను పునర్విభజించాలన్న అంశంపై, దక్షిణాదిలోని అన్ని రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మధ్యనే చెన్నైలో ఎన్డీయేతర పక్షాలతో భేటీని కూడా నిర్వహించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్ప.. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోని కీలక పార్టీలన్నీ స్టాలిన్‌ ఆందోళనతో ఏకీభవించాయి. కేంద్ర ప్రభుత్వ దూకుడును నిలువరించాలని తీర్మానించాయి.

తొలి తమిళ సీఎంలు.. కీలక కమిషన్లు..
ఎన్డీయేతర పక్షాల భేటీ తర్వాత, మలి అడుగుగా, ఇప్పుడు, స్టాలిన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను తాజాగా నిర్వచించేందుకు, ఈ బంధాలు మెరుగయ్యే అవకాశాలపై అధ్యయనం కోసం ఏకంగా ఓ న్యాయ కమిషన్‌నే నియమించాలని నిర్ణయించారు. తగిన సిఫారసుల కోసం, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు.. మంగళవారం (15-04-2025) నాడు తమిళనాడు అసెంబ్లీలో కీలక ప్రకటన కూడా చేశారు. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యంగా డీఎంకే నేతృత్వంలోని సర్కారు ఇలా కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై కమిషన్‌లను నియమించడం ఇదే తొలిసారి కాదు. 1969 ఫిబ్రవరిలో.. తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఎం.కరుణానిధి, ఎనిమిది నెలల్లోనే ఇదే అంశంపై, రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ రాజమన్నార్ నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా.. తొలిసారిగా సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన స్టాలిన్, తండ్రి చూపిన బాటలోనే.. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై తానూ కమిషన్‌ను నియమించడం విశేషం.

రాష్ట్రాలు నియమించే కమిషన్ల వల్ల ప్రయోజనముందా?
కేంద్ర, రాష్ట్ర సంబంధాల పటిష్టతపై కమిషన్ల ఏర్పాటు అంశం కొత్తదేమీ కాదు. 1969లో డీఎంకే అప్పటి అధినేత కరుణానిధి వేసిన జస్టిస్ రాజమన్నార్ కమిషన్‌తో మొదలు పెడితే, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా, 1983లో, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్‌సింగ్ సర్కారియా కమిషన్, అనంతరం, 2007లో.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్‌మోహన్ పూంచీ వేసిన కమిషన్‌లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై సునిశితంగా అధ్యయనం చేసి సిఫారసులను చేశాయి.

జస్టిస్ రాజమన్నార్ కమిటీ, జస్టిస్ సర్కారియా కమిటీలు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యతకు.. ప్రధాని నేతృత్వంలో, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని సూచించాయి. జస్టిస్ పూంచీ కమిటీ కూడా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీ అంశంలో.. ప్రణాళిక, ఆర్థిక సంఘాల మధ్య సమన్వయానికి ఓ నిపుణుల కమిటీ ఉండాలని సూచించింది. రాష్ట్రాలు ఏర్పాటు చేసిన కమిటీలే కాదు, స్వయంగా కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీల సిఫారసులూ బుట్టదాఖలు కావడం శోచనీయం. ఇప్పుడు తాజాగా స్టాలిన్ నియమించే జస్టిస్ కురియన్ జోసెఫ్  కమిటీ చేసే సిఫారసులను, ఎటూ కేంద్రానికే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ సిఫారసులపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది.. ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.

మరి స్టాలిన్ దూకుడు ఎందుకు?
తమిళనాడు అసెంబ్లీకి ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. గడచిన ఐదేళ్ల కాలంలో, స్టాలిన్ తన పాలనతో రాష్ట్రంపై విశిష్ట ముద్రనేదీ వేయలేదన్న భావన ఉంది. కాబట్టి,  వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే, కచ్చితంగా, స్థానికుల సెంటిమెంట్‌ని రగిలించడమే సరైనదని స్టాలిన్ భావిస్తున్నారని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం, నీట్ విధానాన్ని ప్రవేశ పెట్టినప్పుడు, ఇటీవలే త్రిభాషా విధానాన్ని ప్రతిపాదించినప్పుడు.. వాటిని వ్యతిరేకించడంలో స్టాలిన్ ముందు వరుసలోనే నిలిచారు. ఇప్పుడు, దక్షిణాది విశాల ప్రయోజనాల పేరిట, డీలిమిటేషన్‌ ప్రక్రియను ప్రధాన అస్త్రంగా మలచుకుని, స్టాలిన్, తమిళుల హృదయాల్లో.. తనను తాను, జాతీయ స్థాయి నాయకుడిగా ఎక్స్‌పోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. కేంద్రంపై పోరు, దాని వెనుక మర్మం ఏమైనా, స్టాలిన్ తాజా వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.                                               
- పి.విజయ్‌ కుమార్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement