మిగిలిన రాష్ట్రాలన్నీ పాకిస్తాన్‌లో ఉన్నాయా..?

Shiv Sena Attacks BJP Promise Free Covid Vaccines To Bihar - Sakshi

ముంబై: బిహార్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ ఇవ్వడంపై శివసేన పార్టీ తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యింది. అందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా అందించడంపై బీజేపీ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. వ్యాక్సిన్‌పై బీజేపీ చేస్తున్న రాజకీయాలను గురించి శివసేన అనుబంధ పత్రిక సామ్నాలో ప్రస్తావిస్తూ.. బిహార్లో బీజేపీ గెలిస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందిస్తామంటున్నారు.

మరి మిగిలిన రాష్ట్రాలు భారత్‌లో కాకుండా పాకిస్తాన్‌లో ఏమైనా ఉన్నాయా..?. బిహార్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోంది. దేశం మొత్తం వైరస్‌ బారిన పడుతున్నప్పుడు కేవలం అక్కడకు వెళ్లి వ్యాక్సిన్‌ కోసం బీజేపీని గెలిపించండి అని కరోనా వ్యాక్సిన్‌పై ఎందుకు రాజకీయాలు చేస్తారు..?. టీకాపై ఒక్క బిహార్‌కే కాదు దేశం మొత్తానికి సమాన హక్కులు ఉన్నాయి' అని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు.  (ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్)

గతంలో ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో దేశం మొత్తంగా అందరికీ వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామని.. దీనికి కులం, మతం, రాష్ట్రం ప్రాతిపదిక కాదు అని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు బీజేపీ వైఖరి మార్చుకొని బిహార్‌ ఎన్నికల మ్యానిఫెస్టో సందర్భంగా మరో రకంగా వ్యాఖ్యానించడం విచిత్రమైన విషయం. బీజేపీకి ఈ విషయంలో ఎవరు మార్గనిర్దేశం చేస్తున్నారు' అంటూ సామ్నా సందపాదకీయంలో విమర్శించింది.  ('అభివృద్ధి డబుల్‌ రైల్‌ ఇంజన్‌లా పరిగెడుతోంది')

కాగా, శుక్రవారం రోజున ఇదే విషయంపై శివసేన పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. 'మేం స్కూల్‌లో చదువుకునే రోజుల్లో 'మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను' అనే నినాదాన్ని వినేవాళ్లం. ఇప్పుడు 'మీరు మాకు ఓటేయండి, మేం మీకు వ్యాక్సిన్ ఇస్తాం' అనే నినాదాన్ని వింటున్నాం. ఆ ప్రకారంగా ఎవరైతే బీజేపీకి ఓట్లు వేస్తారో వాళ్లకే వ్యాక్సిన్ అందుతుంది. ఇది ఆ పార్టీ వివక్షతకు అద్దం పడుతోంది అని సంజయ్‌రౌత్ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top