ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి

Published Thu, May 30 2024 5:12 AM

Sajjala Ramakrishna Reddy Says Agents should be vigilant in counting votes

ఎన్నికల నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి

ప్రత్యర్ధి పార్టీల ఏజెంట్ల పట్ల అత్యంత అప్రమత్తతతో ఉండాలి

వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది

జూన్‌ 9న సీఎంగా జగన్‌ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: అసెంబ్లీ, లోక్‌సభ నియోజక­వర్గాల ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్‌ ఏజెంట్లు అప్రమత్తతతో వ్యవహరించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పా­రు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండా­ల­న్నారు. బుధవారం వైఎ­స్సార్‌­సీపీ కేంద్ర కార్యాల­యంలో కౌంటింగ్‌ ఏజెంట్ల వర్క్‌షాప్, జూమ్‌ మీటింగ్‌లో ఆయన ముఖ్య అతిధి­గా పాల్గొన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్ల సందేహాల నివృత్తికి కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఎటువంటి సమస్య ఉన్నా కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. 

నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో గుంటూరులో వేల ఓట్లు మన పార్టీ నష్టపోవాల్సి వచ్చిందని గుర్తుచే­శారు. ప్రతి ఓటూ విలువైనదేనని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్లపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, దానికి సంబంధించి ఆదేశాలు రాగానే తెలియజేస్తా­మని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వ్యవస్ధలను మేనేజ్‌ చేస్తూ వారికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చేస్తున్నారని అన్నారు. ఇటీవలి కాలంలో ఈసీ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నందున, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నియమ నిబంధనల పట్ల పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు. 

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని, మళ్లీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అవుతారని, ఇందులో ఎటువంటి అనుమానమూ లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విస్పష్టంగా చెప్పారు. వచ్చే నెల 9వ తేదీన వైఎస్‌ జగన్‌ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. సమావేశానికి హాజరైన వారికి విశ్రాంత ఆర్డీవో ముదిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పలు సూచనలు చేశారు. ఏజెంట్ల సందేహాలు నివృత్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్‌చార్జి, శాసన మండలి విప్‌ లేళ్ళ అప్పిరెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించే విధానం
⇒ ఎన్నికల అధికారి నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో మొదట విధిగా పోస్టల్‌ బ్యాలెట్లని లెక్కించాలి
⇒ మొదటి కవరు–బి పైన నియోజకవర్గం పేరు, ఎన్నికల అధికారి అడ్రెస్సు, ఓటరు సంతకం ఉండాలి. (ఓటరు సంతకం తప్పనిసరికాదు).

⇒ మొదటి కవరు–బి (ఫారం – 13సి) తెరిచి చూసినప్పుడు అందులో 13 – ఏ డిక్లరేషన్, ఫారం 13–బి (కవరు – ఏ) విడివిడిగా ఉండాలి. లేకపోతే అది చెల్లుబాబు కాదు. అందులో కవరు – ఏ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్‌ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్‌ మీద ఓటరు సంతకం లేకపో­యినా, 13–ఏ డిక్లరేషన్‌ మీద పోస్టల్‌ బ్యాలెట్‌ క్రమ సంఖ్య నమోదు చేయకపోయినా, నమోదు చేసినట్లయితే అది 13–బి (పోస్టల్‌ బ్యాలెట్‌ కవరు) మీద ఉన్న క్రమ సంఖ్యతో సరిపోలక పోయినా, 13 – ఏ డిక్లరేషన్‌ మీద గజిటెడ్‌ అధికారి సంతకం లేకపోయినా, ఒకవేళ సంతకం ఉండి హోదా తెలియజేసే స్టాంప్‌ లేదా హోదా తెలియజేసే విధంగా చేతితో రాసి కాని లేకపోతే ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లనిదిగా పరిగణించాలి.

⇒ 13– ఏ డిక్లరేషన్లో అన్ని అంశాలు సరిగా ఉన్నట్లయితే, ఫారం 13 – బి పోస్టల్‌ బ్యాలెట్‌ కలిగి ఉన్న కవరు(కవరు – ఏ)ను పరిశీలించాలి. 13– ఏ డిక్లరేషన్లో పేర్కొన్న బ్యాలెట్‌ పేపర్‌ క్రమసంఖ్య, 13 – బి పోస్టల్‌ బ్యాలెట్‌లో ఉన్న క్రమసంఖ్య ఒకటి కాకపోయినా, ఓటరు ఎవ్వరికీ ఓటు వేయక­పోయినా, ఓటరు తమ ఓటుని ఒకరికంటే ఎక్కువ మందికి వేసినా, బ్యాలెట్‌ పేపరు చిరిగిపోయి పూర్తిగా సమాచారం కనిపించకపోయినా, ఓటరు ఓటుని ఎవరికి వేశారో పూర్తి సందిగ్ధంగా ఉన్నప్పుడు, ఓటరు తనే ఓటు వేసినట్లుగా గుర్తించి­నప్పుడు (ఉదాహరణకు ఓటరు పేరు రాసినా, సంతకం చేసినా) దానిని చెల్లని ఓటుగా పరిగణించాలి. ప్రతి బ్యాలెట్‌ పేపర్‌లో నమోదు చేసిన అంశాలను పోటీ చేసే అభ్యర్థుల ప్రతినిధిగా ఉన్న ఏజెంట్‌/అభ్యర్థికి విధిగా సంబంధిత ఎన్నికల అధికారి చూపించి నిర్ణయం తీసుకోవాలి. బ్యాలెట్‌ పేపరు లెక్కించిన తరువాత రిజల్ట్‌ షీట్‌ (ఫారం–20)లో నమోదు చేయాలి.  

Advertisement
 
Advertisement
 
Advertisement