చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏముంది? 

Sajjala Ramakrishna Reddy comments over tdp manifesto  - Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో 2014–15 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశాను.. మళ్లీ అవకాశం ఇస్తే ఫలానా చేస్తానని చెప్పలేని దుస్థితి చంద్రబాబుది. అప్పట్లో ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టే.. మహానాడులో చంద్రబాబు చెప్పే మాటలు చాలా దరిద్రంగా ఉన్నాయి’ అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విడుదల చేసిన మేనిఫెస్టో అమలుపై చర్చకు సిద్ధమా?’ అని సవాల్‌ విసిరారు.

అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 98.5 శాతం హామీలను అమలు చేశారని, కావాలంటే క్షేత్ర స్థాయిలో సరి చూసుకోవాలని  సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని.. బ్యాంకులో తనఖా పెట్టిన బంగారాన్ని విడిపించి ఇస్తామని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని చంద్రబాబును నిలదీశారు.

‘నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం.. ఆ రోజున వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలంటే రూ.87 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు అవసరం. ఆ రుణాలను మాఫీ చేయకుండా రైతులను మోసం చేసింది వాస్తవం కాదా? నిజంగా రుణమాఫీ చేసి ఉంటే.. ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పగలవా?’ అని నిలదీశారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి.. దాన్ని అమలు చేయకుండా మహిళలను మోసం చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

మహానాడులో కొత్త బిచ్చగాడిలా.. మొదటిసారి మేకప్‌ వేసుకున్న నటుడిలా మూస డైలాగులతో అధికారంలోకి వస్తే బ్రహ్మండంగా చేస్తానని చెప్పాడు తప్ప.. 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు తాను ఇది చేశానని చెప్పలేకపోయారన్నారు. ఈ సమావేశంలో సజ్జల ఇంకా ఏమన్నారంటే.. 

అమ్మ ఒడి పేరు మార్చి తీసుకొస్తావా? 
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు నాలుగేళ్లలో డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.2.11 లక్షల కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ జమ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. వాటి ఫలితాలు రాబోయే ఐదేళ్లలో కనిపిస్తాయి. ‘సీఎం వైఎస్‌ జగన్‌  చెప్పింది చేస్తారు.. చేసిందే చెబుతారు.. మన కోసమే నిలబడ్డారు’ అని ప్రజలు విశ్వసిస్తున్నారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకాన్నే తల్లికి వందనం పేరుతో తీసుకొస్తానని చెబుతున్నారు. అమలవుతున్న పథకాన్నే మళ్లీ తీసుకొస్తా అంటున్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తానని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలు ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఎన్ని నెలలు ఎంత మంది నిరుద్యోగులకు ఎంత భృతి ఇచ్చారు? ప్రజలు నిలదీస్తారనే భయంతోనే టీడీపీ వెబ్‌ సైట్‌ నుంచి మేనిఫెస్టోను మాయం చేసింది వాస్తవం కాదా? 

అబద్ధాలు చెప్పడంలో దిట్ట  
అధికారంలో ఉన్నప్పుడు సామాజికంగా అన్నింటినీ దెబ్బతీయడం, అసమానతలు పెంచడం, తుపాన్లు, వరదలు, కరువు.. ప్రతీది తన సొంత ఆదాయ వనరుగా చంద్రబాబు మార్చుకున్నారు. అందుకే పోతూపోతూ రూ.2 లక్షల కోట్ల అప్పు చేసి.. వచ్చే ప్రభుత్వంపై భారం పడేసి వెళ్లారు.  

చంద్రబాబు కొత్తగా సృష్టించింది ఏమీ లేకపోగా.. జన్మభూమి కమిటీలు పెట్టి వ్యవస్థలను నిర్విర్యం చేశారు. ప్రజలకు ఇచ్చిన సెంటు స్థలం సమాధులకు కూడా సరిపోదంటూ పేదలను అవమానించారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే పోటీ పెడితే గిన్నీస్‌ బుక్‌ రికార్డు చంద్రబాబుకే వస్తుంది. చంద్రబాబు నాయకుడు కానే కాదు... మ్యానిప్యులేటర్‌. అందుకే ప్రజలు నమ్మరు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top