ఏపీలో రూల్‌ ఆఫ్‌ ఫియర్‌ రాజ్యమేలుతోంది: వైఎస్‌ జగన్‌ | YS Jagan Launches Sharp Attack On TDP Government, Rule Of Law Replaced By Rule Of Fear In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో రూల్‌ ఆఫ్‌ ఫియర్‌ రాజ్యమేలుతోంది: వైఎస్‌ జగన్‌

Jul 1 2026 11:42 AM | Updated on Jul 1 2026 12:20 PM

Rule of Law replaced by Rule of Fear in AP Says YS Jagan

సాక్షి, తాడేపల్లి: తాము ఏం చేసినా ఫర్వాలేదు అనే స్థితిలో కూటమి ప్రభుత్వ పెద్దలు ఉన్నారని.. ఆ పర్యావసనమే ఇప్పుడు ఏపీలో నెలకొన్న దారుణ పరిస్థితులని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా పక్కకుపోయి రూల్‌ ఆఫ్‌ ఫియర్‌ రాజ్యమేలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 

రెండేళ్ల కిందట.. ఏపీ పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి గురించి, విద్యా వైద్యం, వ్యవసాయం.. పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు, మంచి గురించి మాట్లాడుకునేవారు. అదంతా మా హయాంలో జరిగింది. మరి చంద్రబాబు సీఎం అయ్యాక.. ఇవాళ రెడ్‌బుక్‌ అరాచకం, కస్టోడియల్‌ డెత్స్‌, చంపేసి మాయం చేయడం.. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ మోసాలు.. అబద్ధాలు, టాపిక్‌ డైవర్షన్‌ల గురించే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా పక్కకుపోయి రూల్‌ ఆఫ్‌ ఫియర్‌ రాజ్యమేలుతోంది. పోలీసుల దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం సన్నగిల్లింది. పోలీస్‌ స్టేషన్‌ వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. 

ఏపీలో ధర్మం, న్యాయం గాడి తప్పింది.  చంద్రబాబు తాను చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పరిపాలనపై ప్రశ్నించే ఎవరినైనా అణచివేసే క్రమంలో దిగజారిపోతున్నారు. ఎవరూ ఏం చేయలేరన్నట్లు ప్రవర్తిస్తున్నారు. సాయికృష్ణ, క్రాంతికుమార్‌ కేసులే ఇందుకు ఉదాహరణ. విజయవాడ గాదె సాయికృష్ణ కేసు తీసుకున్నా.. దళిత మహిళ గంగమ్మ కేసు, తిరుపతమ్మ, శ్రీకాకుళంలో కళావతి కేసు.. ఇలా దిగజారిపోయిన చట్టం, వ్యవస్థకు అద్దం పడుతున్నాయి. కస్టడీలో చంపి మృతదేహం మాయం చేస్తున్నారు. కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వడం లేదు. చంద్రబాబు ఇంటికి ఆమడ దూరంలోనే.. రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయే ఘటనలు జరుగుతున్నాయి అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

చంద్రబాబుని ఎవరూ ప్రశ్నించకూడదట. పశ్నిస్తే.. ఎల్లో మీడియాతో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. క్రిమినల్స్‌కు మద్దతు ఇస్తారా? అంటూ ఎదురు దాడి చేస్తున్నారు. బాబు తానా అంటే.. ఎల్లో మీడియా తందానా అంటోంది. చంద్రబాబు, ఆయన పార్టనర్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నా.. ఇలాగే అరాచకాలు కొనసాగిస్తామని అధికారిక ప్రకటన చేయగలరా? అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

రౌడీ షీటర్‌కు మద్దతు ఇస్తారా? అంటూ ప్రచారం చేశారు. జనం చీ కొడితే చం‍ద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. ఆ తల్లి చేయి పట్టుకుని మొసలి కన్నీరు కార్చారు. 46 రోజులపాటు సాయికృష్ణ కేసును తొక్కి పెట్టారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?. చెప్పాల్సిన బాధ్యత సీఎంగా చంద్రబాబుకు లేదా?. సాయికృష్ణ రిమాండ్‌ రిపోర్ట్‌చూస్తే అంతా తెలుస్తుంది. పైవాళ్లను ఎలా కాపాడుతున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. 

సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. కృష్ణలంక పీఎస్‌కు అప్పగించినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లోనూ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్‌ పని చేసేది పోలీస్‌ కమిషనర్‌కింద కాదా?. మే 6న సాయికృష్ణను కృష్ణలంక పీఎస్‌లో అప్పగించారు. మే 28న తన కొడుకును అదుపులోకి తీసుకున్నారని కోర్టులో ప్రవేశపెట్టలేదని అడిగినా సీపీ పట్టించుకోలేదు. బంధువులు డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఆ వినతిని కూడా డీజీపీ పట్టించుకోలేదు. నేనే బాధితుడి ఇంటికి వెళ్లాకే.. కేసులో కదలిక తెచ్చి అరెస్టులు చేశారు.. 

.. ఇక దళిత యువకుడు క్రాంతి కుమార్‌ మరణ వాంగ్మూలం ఇచ్చాడు. తన చావుకు సీఐ నాగరాజుకు అని స్పష్టంగా చెప్పాడు. క్రాంతికుమార్‌ వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. సీఐని సీపీ కాపాడతాడు.. సీపీని డీజీపీ కాపాడతాడు.. డీజీపీని చంద్రబాబు కాపాడతాడు. వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అనడానికి ఇదే నిదర్శనం. ఏ రాజకీయ ఉద్దేశంతో చంద్రబాబు ఇదంతా చేస్తున్నారు? అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వైఎస్‌ జగన్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. సాక్ష్యాలను ఎలా మాయం చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసని విమర్శించారు. పోలీస్‌ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని తొలగిస్తే.. కంట్రోల్‌ రూమ్‌, విజయవాడ ప్రధాన కూడళ్లలోని కెమెరాల ఫుటేజీ ఏమైందని ప్రశ్నించారు. మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో సీసీటీవీ ఆధారంగా గుర్తించవచ్చని, క్లౌడ్‌ సర్వర్‌లలో 90 రోజుల పాటు ఫుటేజీ భద్రంగా ఉంటుందని గుర్తుచేశారు. అయినప్పటికీ వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని, సిట్‌ ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయడం లేదని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement