
సాక్షి, ప్రకాశం: పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు ఏనాడూ లేదని.. ఈ పాలనలోనూ పేదపిల్లల చదువుకు మోకాలడ్డుపెడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, అందుకే మ్యానిఫెస్టో రీకాలింగ్ పేరిట అని చంద్రబాబు మోసాన్ని ఎండగడుతున్నాం అని ఆమె అన్నారు.
శుక్రవారం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. ‘‘నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు చెపుతున్నారు. విజన్ ఉంది.. విస్తరాకుల కట్ట ఉంది అని చెప్పి.. స్కాంలలో విజనరీగా చెలామణి అవుతున్నారు. పేద పిల్లల చదువుకు చంద్రబాబు మోకాలు అడ్డు పెడుతున్నారు. పేదవాడిని మద్యం మత్తులో ఉంచి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రతీది కల్తీనే. చివరకు బడి పిల్లకు కూడా కల్తీ భోజనం పెడుతున్నారు.
ఏపీలో మూడు కోతుల్లా బొమ్మల్లా.. కూటమి నాయకులు ముగ్గురు ఉన్నారు. దృతరాష్ట్ర పాలనతో చంద్రబాబు కళ్లు మూసుకున్నారు. విద్యార్దుల జీవితాలు నాశనం అవుతుంటే లోకేష్ చెవులు మూసుకొన్నారు. పవర్ లేని పవన్ కల్యాణ్ ఈ తండ్రీకొడుకుల అరాచకాలను ప్రశ్నించకుండా నోరు మూసుకుని కూర్చున్నారు.
పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకి లేదు. అదే ఉండి ఉంటే.. 2019కి ముందే ఆయన ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి ఉండేవారు. విద్యాశాఖమంత్రి అంటే ఎలా ఉండాలో ఆదిమూలపు సురేష్‌ని చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో నారా లోకేష్‌ని చూసి తెలుసుకోవాలి. 2019-2024 జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి ఇస్తే.. ఇప్పుడు దానిని సిగ్గులేకుండా తమ ఖాతాలో వేసుకున్నారు. చంద్రబాబు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల పేర్లు మార్చుకొని చంద్రబాబు పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యే లు ఇంటింటికి తిరిగే దమ్ము ఉందా? అని రోజా ప్రశ్నించారు.
పోలీసులు ఉన్నది అధికార పార్టీకి ఊడిగం చెయ్యడం కోసం కాదు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల ప్రాణాల కోసం పని చెయ్యాలి. ఆంక్షలు పెడితే భయపడటానికి ఇక్కడ ఉన్నది లోకేష్ కార్యకర్తలు కాదు... జగన్ అనే సింహం కార్యకర్తలు. ఈవీఎంలతో గెలిచి ఎగిరెగిరి పడితే జనం ఎగరేసి కొడతారు జాగ్రత్త’’ అని కూటమి నేతలను ఉద్దేశించి రోజా అన్నారు.