కేసీఆర్‌ వ్యతిరేకులను కూడగడతా 

Revanth Reddy Comments On KCR opponents - Sakshi

దేవేందర్‌గౌడ్‌తో భేటీలో రేవంత్‌ 

తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలిస్తాం 

హైదరాబాద్‌ ఆదాయం, వనరులు తెలంగాణకే ఇవ్వాలని కొట్లాడిన వ్యక్తి దేవేందర్‌గౌడ్‌  

మహేశ్వరం, తుక్కుగూడ: రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించేందుకు కేసీఆర్‌ వ్యతిరేక పునరేకీకరణలో కలిసొచ్చే వారిని కలుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఆదివారం మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్, ఆయన కుమారులతో కాం గ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్, రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించిన దేవేందర్‌ గౌడ్‌ అనుభవాలు సలహాలు, సూచనలు తెలంగాణ ప్రజలకు అవసరమని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ ఆదాయ వనరులు తెలంగాణకే దక్కాలని కొట్లాడిన వ్యక్తి దేవేందర్‌గౌడ్‌ అని చెప్పారు. దేవేందర్‌గౌడ్‌ ఆనాడు ఆదిలాబాద్‌ నుంచి రంగారెడ్డి జిల్లా వరకు పాదయాత్ర చేయడంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కారు దారి తప్పిందని, దివాలా తీసిన తెలంగాణను పట్టాలెక్కించేందుకు అందరి ఆలోచనలు, అనుభవాలను స్వీకరిస్తామన్నారు. ప్రాజెక్టుల పేరిట కల్వకుంట్ల కుటుంబం కోట్లు దండుకుందని ఆరోపించారు. 

తెలంగాణ ఏర్పాటులో దేవేందర్‌ పాత్ర కీలకం: మధుయాష్కీ 
70 ఏళ్లుగా సాగుతున్న ఉద్యమాన్ని గౌరవించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ అధినేత్రి, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఏర్పాటు చేశారని, రాష్ట్ర ఏర్పాటు సమయంలో దేవేందర్‌ గౌడ్‌ రాజ్యసభ సభ్యుడిగా ఉండి తెలంగాణకు రావాల్సిన వనరుల గురించి పార్లమెంటులో కొట్లాడారని మధుయాష్కీగౌడ్‌ గుర్తు చేశారు. అంతకుముందు దేవేందర్‌ గౌడ్, ఆయన కుమారులు పుష్పగుచ్ఛం అందజేసి రేవంత్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మల్‌రెడ్డి రాంరెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top