ఉద్ధవ్ థాక్రేపై అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఫైర్ | Ayodhya Ram Temple Chief Priest Reacts On Uddhav Thackeray No Invite Remark, See Details Inside - Sakshi
Sakshi News home page

ఉద్ధవ్ థాక్రేపై అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఫైర్

Published Mon, Jan 1 2024 11:33 AM

Ram Temple Chief Priest On Uddhav Thackeray No Invite Claim - Sakshi

లక్నో: అయోధ్యలో జనవరి 22న జరిగే ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలకు ఆహ్వానం అందలేదన్న శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మండిపడ్డారు. ఆలయ మహా సంప్రోక్షణకు శ్రీరాముని భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందజేశామని తెలిపారు. రాముని పేరు చెప్పుకుని ప్రతిపక్షాలే రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రామున్ని నమ్మినవారే ప్రస్తుతం అధికారంలో ఉన్నారని అన్నారు. 

"రాముని భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందుతాయి. రాముని పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తున్నారని చెప్పడం పూర్తిగా తప్పు. మన ప్రధానిని ప్రతిచోటా గౌరవిస్తారు. ఆయన తన హయాంలో ఎనలేని కృషి చేశారు. రాజకీయాలు కాదు.. ఇది ఆయన భక్తి” అని ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు.

రామ మందిర ప్రారంభ వేడుకలను బీజేపీ రాజకీయం చేస్తుందని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ఇటీవల ఆరోపించారు. తమ పార్టీ ఎన్నికల్లో రాముడిని తమ అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆచార్య సత్యేంద్ర దాస్.. సంజయ్‌ రౌత్, ఉద్ధవ్ థాక్రేపై విరుచుకుపడ్డారు. రాముని పేరు ఎవరు వాడుకుంటున్నారో? తెలుసుకోవాలని ప్రశ్నించారు.

రామ మందిర ప్రతిష్ఠాపనకు తనకు ఆహ్వానం అందకపోవడంపై థాక్రే బీజేపీని విమర్శించారు. మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దని అన్నారు. ఒకే పార్టీ చుట్టూ తిరగకూడదని చెప్పారు. రామాలయం ప్రారంభోత్సవం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. మందిర నిర్మాణం కోసం తన తండ్రి బాల్ థాక్రే చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇటీవల రామాలయ వేడుక ఆహ్వానాన్ని సీపీఐ కార్యదర్శి సీతారాం ఏచూరి తిరస్కరించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపు

Advertisement
 
Advertisement