ఏంటిది? పార్టీలో ఏం జరుగుతోంది? 'మహా' కాంగ్రెస్‌పై రాహుల్ గరం గరం!

Rahul Gandhi Unhappy with Maharashtra Congress - Sakshi

'మహా' కాంగ్రెస్‌పై రాహుల్ అసంతృప్తి! రాష్ట్రానికి పరిశీలకుడు

ముంబై: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలో పార్టీ పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఓ పరిశీలకుడిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.  

మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సోనియా గాంధీతో సమావేశమైన రోజే పార్టీ అదిష్ఠానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత పటోలే సోనియాను కలవడం ఇదే తొలిసారి. ఈ భేటీలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా పాల్గొన్నారు.

గురువారం జరిగిన ఈ సమావేశం అనంతరం నానా పటోలే ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి, దళిత నేత చంద్రకాంత్ హండోరే ఓడిపోవడంపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉందని పేర్కొన్నారు. ఆయన ఓటమికి కారణమైన నేతలు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

క్రాస్ ఓటింగ్‌ అనుమానాలు
చంద్రకాంత్‌ పాటిల్ ఓటమిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్‌ హెచ్‌కే పాటిల్‌ను మాజీ సీఎం పృథ్విరాజ్ చవాన్‌ బుధవారం అడిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. ఈ వ్యవహరంపై మాజీ మంత్రి అసీం ఖాన్‌.. రాహుల్ గాంధీని కలిసి వివరించారు. పార్టీలో ఈ పరిణామాలపై రాహుల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఎమ్మెల్యేల డుమ్మాపై ఆగ్రహం
సీఎం ఏక్‍నాథ్‌ షిండే మహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న సోమవారం రోజు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు గైర్హాజరు కావడంపై ఏఐసీసీ షాక్ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ విప్ జారీ చేసినా వీరంతా రాకపోవడంపై అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రోజు సభకు హాజరుకాని వారిలో మాజీ సీఎం అశోక్ చవాన్, మాజీ మంత్రి విజయ్‌ వడెట్టీవార్ వంటి ముఖ్య నేతలు ఉన్నారు. ముంబైలో ఉండి కూడా విశ్వాస పరీక్ష జరిగే కీలక సమయంలో వీరు సభకు రాకపోవడం తీవ్రమైన విషయమని పార్టీ సీనియర్ నేత ఒకరు అన్నారు.

అంతేకాదు ఉద్ధవ్ థాక్రే  చివరి క్యాబినెట్ సమావేశంలో ఔరంగాబాద్, ఒస్మానాబాద్ జిల్లాల పేర్లు మార్చాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కాంగ్రెస్ మంత్రులు అభ్యంతరం చెప్పకపోవడంపైనా పార్టీ అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్సీపీతోనే
మహావికాస్ అఘాడీ(శివసేన-కాంగ్రెస్-ఎన్‌సీపీ) ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నానా పటోలే సోనియాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.  సీఎం షిండే తిరుగుబాటుతో శివసేనలో చీలిక ఏర్పడి ఉద్ధవ్ థాక్రే వర్గం బలహీనపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2014 ముందు నుంచి మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీతోనే ముందుకు సాగాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: అన్నాడీఎంకేలో వర్గపోరు.. నేనే అధినేత్రిని, మీడియాతో శశికళ వ్యాఖ్యలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top