రాయ్‌బరేలీలో పోటీ చేయకపోడంపై ప్రియాంక తొలి స్పందన | Sakshi
Sakshi News home page

రాయ్‌బరేలీలో పోటీ చేయకపోడంపై ప్రియాంక తొలి స్పందన

Published Sat, May 18 2024 6:58 PM

Priyanka Gandhi on why she is not contesting Lok Sabha polls

ఉత్తరప్రదేశ్‌లోని  అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలు కాంగ్రెస్‌కు ఎంతో కీలకం. గాంధీ కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ స్థానాల్లో గెలుపు ప్రస్తుతం ఆ పార్టీకి అత్యంత అవసరం. రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తుండగా.. అమేథీ నుంచి పార్టీకి విధేయుడు కిషోరిలాల్‌ శర్మ బరిలో నిలిచారు. లోక్‌సభ అయిదో విడతలో భాగంగా ఈ రెండు స్థానాలతోపాటు యూపీలో 14 సీట్లకు మే 20న పోలింగ్‌ జరగనుంది.

కాంగ్రెస్‌ కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీలో సోనియా గాంధీ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆమె రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆమె తనయురాలు ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఆమె పోటీ నుంచి తప్పుకొని అందరినీ షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం ప్రియాంక ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను తన భూజాన వేసుకున్నారు. గత ఎన్నికల్లో కోల్పోయిన అమేథీని తిరిగి దక్కించుకోవడం.. సోదరుడు పోటీ చేస్తున్న రాయ్‌బరేలీలో మరోసారి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.

తాజాగా లోక్‌సభలో పోటీ చేయడకపోవడంపై ప్రియాంక గాంధీ స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ తరపున దేశ వ్యాప్తంగా ప్రచారంపై దృష్టి సారించేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. తాను, రాహుల్‌ ఈ ఎన్నికల్ల పోటీ చేస్తే.. ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని చెప్పారు.

‘నేను గత 15 రోజులుగా రాయ్‌బరేలిలో ప్రచారం చేస్తున్నాను. గాంధీ కుటుంబానికి రాయబరేలీతో విడదీయరాని బంధం ఉంది. కాబట్టి, మేము ఇక్కడికి వచ్చి వారిని కలిసి వారితో సంభాషిస్తారని ప్రజలు భావిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడ ఎన్నికలను గెలవలేం’ అని అన్నారు.

తోబుట్టువులిద్దరూ(రాహుల్‌, ప్రియాంక) ఎన్నికల్లో పోటీ చేస్తే.. కనీసం 15 రోజులు తమ నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. ఆ సమయంలో దేశమంతా ప్రచారం చేయడం కూదరదని తెలిపారు. అయితే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రియాంక సమాధానం దాటవేశారు.

పార్ల‌మెంట్‌ సభ్యురాలు కావాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనీ తానెప్పుడూ అనుకోలేదని అన్నారు. ఏ బాధ్యతలు అప్పజెప్పిన పార్టీ కోసం నిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నేను ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు భావిస్తే పోటీ చేస్తానని తెలిపారు.

ఓడిపోతామనే భయంతో ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదిన్న బీజేపీ ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. బీజేపీ వ్యూహంతో కాంగ్రెస్‌ పార్టీ నడవడం లేదని ఆమె అన్నారు. తాను, సోదరుడు పోటీ చేస్తే అది బీజేపీకి లాభదాయకంగా మారుతుందని, ప్రచారానికి ఎవరూ అందుబాటులో ఉండరని తెలిపారు. 

అదే విధంగా అమేథీ నుంచి రాహుల్‌ ఓటమి భయంతో పారిపోయారంటూ  ప్రధాని మోదీ సహా బీజేపీ చేస్తున్న ప్రచారంపై ప్రియాంక మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ అమేథీ, రాయ్‌బరేలీలను ఎప్పటికీ వదిలిపెట్టదు. కాంగ్రెస్‌కు, ఈ రెండు నియోజకవర్గాల మధ్య అపూ ర్వ బంధం ఉంది. గుజరాత్‌లోని వడోదర ఎన్నికల్లో ప్రధాని మోదీ ఎందుకు పోటీ చేయడం లేదు? ప్రధాని భయపడుతున్నారా? 2014 తర్వాత వడోదర ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? గుజరాత్ నుంచి పారిపోయారా?’ అని ప్రియాంక ప్రశ్నించారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement