
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదివారం(మార్చి 9న) తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్బంగా ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ కానున్నారు.
తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు అనే సస్పెన్స్ కాంగ్రెస్ పార్టీ నేతలు నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అదే రోజున ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ కానున్నారు. ఇక, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్ఠానం ఖరారు చేయనుంది. కాంగ్రెస్ నేతల భేటీ సందర్భంగానే మంత్రి వర్గ విస్తరణ, పార్టీలో కీలక పదవులు కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అన్ని పదవులు భర్తీ చేసి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు.. ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్ ఉన్నారు. ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్ , బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. తెలంగాణ ఎమ్మెల్సీల నామినేషన్లు దాఖలుకు ఈ నెల 10 చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే వడపోత ప్రక్రియ ప్రారంభించారు. పలువురి పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 20న ఎమ్మెల్సీ ఎన్నికల జరుగుతున్న క్రమంలో ఖాళీ అయిన ఐదు స్థానాలలో నాలుగు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. ఇక, నాలుగు సీట్లలో ఒకటి సీపీఐకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.