కూటమిలో కుంపట్లు రాజేస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు.. టీడీపీ శ్రేణులపై కేసులు | Police Case File Against Tdp Followers In Pithapuram Constituency | Sakshi
Sakshi News home page

పిఠాపురం కూటమిలో కుంపట్లు రాజేస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన.. టీడీపీ శ్రేణులపై కేసులు

Apr 6 2025 9:27 AM | Updated on Apr 6 2025 9:36 AM

Police Case File Against Tdp Followers In Pithapuram Constituency

కాకినాడ జిల్లా,సాక్షి: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమెల్సీ నాగబాబు పర్యటన కూటమిలో కుంపట్లు రాజేస్తోంది.  పిఠాపురంలో వరుస పర్యటనలు చేస్తున్న నాగబాబును టీడీపీ శ్రేణులు అడుగడునా అడ్డుకుంటున్నారు. ఈ తరుణంలో పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

శనివారం  ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో భాగంగా గొల్లప్రోలు మండలం, చిన్న జగ్గంపేటలో టీడీపీ కార్యకర్తలు జనసేనకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఆహ్వానించడం లేదంటూ ఆయన అభిమానులు,టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఈ తరుణంలో  తనను అడ్డుకుని మోటార్ సైకిల్ అద్దాలు పగలగొట్టారని టీడీపీ కార్యకర్తలపై జనసేన నేత మొయిళ్ళ నాగబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సంఘటనలో తమ విధులకు ఆటంకం కల్పించారని టీడీపీ కార్యకర్తలపై  పిఠాపురం అడిషనల్ ఎస్సై జానీ భాష మరో ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై గొల్లప్రోలు పోలీసులు వేరు వేరుగా కేసులు నమోదు చేశారు.

అంతకుముందు పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుమారపురంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్సీ నాగబాబు రాగా..  టీడీపీ, జనసేన కార్యకర్తలు బలాబలాలు ప్రదర్శించుకున్నారు. జై వర్మ, జై టీడీపీ అంటూ తెలుగుదేశం కార్యకర్తలు నినాదాలు చేయగా..  ప్రతిగా జై జనసేన, జై పవన్ అంటూ జనసైనికులు నినాదాలు చేశారు. సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం లేదంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ తరుణంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతో పిఠాపురం కూటమిలో నాగబాబు పర్యటన కుంపట్లు రాజేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement