RaHul Gandhi: సెకండ్‌వేవ్‌కు మోదీనే కారణం

PM Narendra Modi responsible for second COVID-19 wave - Sakshi

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజం

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆడుతున్న నాటకాల వల్లే దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. వైరస్‌ ఉధృతికి ప్రధానమంత్రే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. వ్యాక్సినేషన్‌ ఇలాగే నెమ్మదిగా కొనసాగితే మరిన్ని కరోనా వేవ్‌ రావడం తథ్యమని చెప్పారు. ఆయన శుక్రవారం ఆన్‌లైన్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు.

దేశంలో ప్రజలందరికీ సాధ్యమైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్‌ అందజేయడానికి పటిష్టమైన వ్యూహం ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దేశంలో ప్రజలకు వేగంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడం సాధ్యమేనని అన్నారు. ప్రధాని మోదీ కేవలం ఒక ఈవెంట్‌ మేనేజర్‌లాగా పని చేస్తున్నారని రాహుల్‌ తప్పుపట్టారు. ఆయన ఒక నాయకుడిగా ప్రజల కోసం పని చేయాల్సిన సమయం వచ్చిందని హితవు పలికారు. ఇప్రజలందరికీ కరోనా టీకా ఇవ్వగలనని ఇప్పటికైనా ప్రజలకు భరోసా కల్పించాలని సూచించారు.

ఇతరులపై నిందలు వేయడం మానుకోని, తనను తాను నిరూపించుకోవాలని మోదీని కోరారు. దేశంలో ఇప్పటిదాకా కేవలం 3 శాతం జనాభాకే టీకా అందజేశారని, మరో 97 శాతం మందికి వైరస్‌ ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కరోనా థర్డ్‌ వేర్‌ రావడంలో ఆశ్చర్యం లేదని చెప్పారు. 50–60 శాతం జనాభాకు వ్యాక్సిన్‌ అందజేస్తే మూడో వేవ్‌ కాదు, నాలుగో వేవ్, ఐదో వేవ్‌ కూడా రాదని వ్యాఖ్యానించారు.

‘వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వానికి ఒక వ్యహం లేదు. వ్యూహంపై ప్రధాని ఆలోచించడం లేదు. ఆయనొక ఈవెంట్‌ మేనేజర్‌. ఒక సమయంలో ఒక ఈవెంట్‌ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పుడు కావాల్సింది ఈవెంట్లు కాదు. ఒక పటిష్ట వ్యూహం’అని రాహుల్‌ పేర్కొన్నారు.  వైరస్‌ తీవ్రతను ప్రధాని, కేంద్రం ఇప్పటికీ అర్థం చేసుకోలేదని, అందుకే దీనిపై ఒక కార్యాచరణ, వ్యూహం రూపొందించలేదని విమర్శించారు. దేశంలో ప్రభుత్వం చెబుతున్న కరోనా మరణాల రేటు కూడా ఒక అబద్ధమేనని ఆరోపించారు. 

టూల్‌కిట్‌ స్క్రిప్ట్‌లో భాగమే ఇది
కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌   
దేశంలో ఈ ఏడాది డిసెంబర్‌కల్లా కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చెప్పారు. ప్రధాని మోదీపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఆయన ఉపయోగించిన భాష, ప్రజల్లో భయాందోళనలను పెంచుతున్న తీరును గమనిస్తే ‘టూల్‌కిట్‌’వెనుక కాంగ్రెస్‌ ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. ‘టూల్‌కిట్‌’స్క్రిప్టులో భాగంగానే రాహుల్‌ మోదీపై ఆరోపణలు చేస్తున్నారని జవదేకర్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి ఉపయోగిస్తున్న టూల్‌కిట్‌ను కాంగ్రెస్‌ పార్టీయే సృష్టించిందని, దీనికి సాక్ష్యాలతో పనిలేదన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని రాహుల్‌కు హితబోధ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top