దొంగ ఓట్ల పాపం చంద్రబాబుదే

Peddireddy Ramachandra Reddy Comment on Chandrababu - Sakshi

టీడీపీ హయాంలో 60 లక్షల దొంగ ఓట్లు నమోదు 

వాటిని కాపాడుకోవడానికే చంద్రబాబు డ్రామా 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం 

మడకశిర/హిందూపురం: రాష్ట్రంలో దొంగ ఓట్ల పాపం చంద్రబాబు దేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో స్థానిక మాజీ ఎమ్మెల్యే దివంగత వైసీ తిమ్మారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2018లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల దొంగ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు.

వారి హయాంలో నమోదు చేసిన దొంగ ఓట్లను కాపాడుకోవడానికే చంద్రబాబు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వీటిపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎంపీల బృందంతోపాటు రాష్ట్ర మంత్రుల బృందం కూడా ఢిల్లీకి వెళ్లి దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మడకశిర ప్రాంతంలో వన్యప్రాణుల మృతిపై విచారణ చేయిస్తామని తెలిపారు. వన్యప్రాణుల మృతికి కారకులపై చర్యలు తీసుకుంటామన్నారు.  

కుప్పం, హిందూపురమూ మనవే: పెద్దిరెడ్డి 
‘కలసికట్టుగా పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదు. వచ్చే ఎన్నికల్లో కుప్పం మనదే. హిందూపురమూ మనదే...’ అని పెద్దిరెడ్డి అన్నారు. హిందూపురంలోని బైపాస్‌ రోడ్డులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు.

టీఎన్‌ దీపిక, ఏపీ ఆగ్రోస్‌ చైర్మన్‌ నవీన్‌నిశ్చల్‌ మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు శంకరనారాయణ, సిద్దారెడ్డి, తిప్పేస్వామి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటి సూర్యప్రకాష్ బాబు, వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్‌ రామచంద్ర, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top