రాజ్యాంగ స్ఫూర్తికి దగా | Opposition parties Slams Modi for RSS Mention in Independence Day speech | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ స్ఫూర్తికి దగా

Aug 16 2025 5:17 AM | Updated on Aug 16 2025 6:07 AM

Opposition parties Slams Modi for RSS Mention in Independence Day speech

సంఘ్‌ పెద్దలను మచ్చిక చేసుకోవడానికి మోదీ తంటాలు 

ఆర్‌ఎస్‌ఎస్‌పై ప్రధాని ప్రశంసలను దుయ్యబట్టిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)పై ప్రశంసల వర్షం కురిపించడం పట్ల ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. మోదీ తీరును తీవ్రంగా ఖండించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌పై మోదీ ప్రశంసలు రాజ్యాంగ స్ఫూర్తిని, లౌకిక గణతంత్రాన్ని దగా చేయడమే అవుతాయని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ శుక్రవారం ‘ఎక్స్‌’లో విమర్శించారు. 

ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలను మచ్చిక చేసుకోవడానికి మోదీ తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. 75 ఏళ్లు దాటినవారు పదవుల నుంచి తప్పుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ చెప్పారని గుర్తుచేశారు. మోదీ ఈ రోజు అలసిపోయారని, త్వరలో పదవి నుంచి తప్పుకుంటారని జైరామ్‌ రమేశ్‌ తేల్చిచెప్పారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వానికి సంబంధం లేని సంస్థను పొగడడం ఏమిటని మండిపడ్డారు. 

వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాజకీయ అంశంగా మార్చేశారని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కరాని మోదీపై నిప్పులు చెరిగారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై మోదీ ప్రశంసల పర్వాన్ని సీపీఎం జాతీయ కార్యదర్శి ఎం.ఎ.బేబీ ఖండించారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి పాత్ర లేదని గుర్తుచేశారు. ఆ సంస్థను గతంలో నిషేధించారని వెల్లడించారు.  

అందుకోసం మోదీ నాగపూర్‌ వెళ్లాలి: ఒవైసీ  
సంఘ్‌ను ఆకాశానికి ఎత్తేయడం భారత స్వాతంత్య్ర పోరాటాన్ని తక్కువ చేయడమే అవుతుందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆక్షేపించారు. ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలకు సేవకులుగా పనిచేశాయని దుయ్యబట్టారు. స్వాతంత్య్ర పోరాటానికి అవి దూరంగా ఉన్నాయని, మహాత్మా గాం«దీని వ్యతిరేకించాయని చెప్పారు. 

ఆర్‌ఎస్‌ఎస్‌ను మంచి చేసుకోవాలంటే నాగపూర్‌కు వెళ్లాలి తప్ప ఎర్రకోట నుంచి ప్రశంసించడం ఏమిటని మోదీపై ఒవైసీ ధ్వజమెత్తారు. తప్పుడు చరిత్రను పక్కనపెట్టి ఆసలైన చరిత్ర, అసలైన హీరోల గురించి తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ విమర్శలు గుప్పించారు. 

ఆర్‌ఎస్‌ఎస్‌ త్వరలో 100 ఏళ్లు పూర్తి చేసుకోనుందని, అందుకు ఆ సంస్థ పెద్దలు బ్రిటిష్‌ పాలకులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బ్రిటిషర్ల దయతోనే ఆ సంస్థ ఏర్పాటైందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను మోదీ కీర్తించడాన్ని తప్పుపట్టారు. మత సంస్థ పేరును అధికారిక కార్యక్రమంలో ప్రస్తావించడాన్ని ఆక్షేపించారు. నరేంద్ర మోదీ ఒక ప్రధానమంత్రిగా కాకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా వ్యవహరించారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. 

ఆర్‌ఎస్‌ఎస్‌ అనేది ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ, విద్వేష, విభజన సంస్థ అని తేలి్చచెప్పారు. అది ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ కాలేదని, పన్నులు చెల్లించడం లేదని అన్నారు. అలాంటి సంస్థను ప్రధానమంత్రి ప్రశంసించడం దారుణమని సిద్ధరామయ్య విమర్శించారు. రాజకీయంగా బలహీనపడినప్పుడల్లా ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు కోసం పాకులాడడం మోదీకి అలవాటుగా మారిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు ఘనమైన చరిత్ర ఏమీ లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ స్పష్టంచేశారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement