నెల్లూరు మేయర్‌ సీటు.. టీడీపీలో కుర్చీ కుంపటి! | Nellore TDP Leaders In Internal Fight | Sakshi
Sakshi News home page

నెల్లూరు మేయర్‌ సీటు.. టీడీపీలో కుర్చీ కుంపటి!

Sep 20 2026 2:00 PM | Updated on Sep 20 2026 2:01 PM

Nellore TDP Leaders In Internal Fight

నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల వేడి మొదలవకముందే అధికార టీడీపీలో మేయర్‌ పీఠం చిచ్చు రేపుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే అభ్యర్థిత్వంపై నేతలు తమ వర్గాల బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేయర్‌ పీఠం తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఎవరికి వారు అభ్యర్థిత్వాలపై ప్రతిపాదనలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఆ పీఠంపై తమ మాటే నెగ్గించుకోవాలన్న పట్టుదల కీలక నేతల మధ్య ఆధిపత్య పోరుకు తెర తీస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వర్గం నుంచి డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌యాదవ్‌ పేరు ప్రచారంలో ఉండగా, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన వర్గం నుంచి ప్రత్యామ్నాయ పేర్లను తెరపైకి తీసుకురావడం ఆసక్తి రేపుతోంది. దీంతో మేయర్‌ పీఠం ఎవరికి దక్కుతుందన్న దానికంటే.. పార్టీలో ఎవరి రాజకీయ ఆధిపత్యం నిలుస్తుందన్నదే ఇప్పుడు నెల్లూరులో హాట్‌టాపిక్‌గా మారింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీలో మేయర్‌ పీఠం కుంపటి రగులుతోంది. త్వరలో జరగబోయే నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో మేయర్‌ అభ్యర్థిత్వంపై ఆ పార్టీ కీలక నేతల మధ్య అంతర్గతంగా మంటలు రాజకున్నాయి. ఇటీవల టీడీపీ ముఖ్య నేత లోకేశ్‌ పర్యటన నేతల మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి. మేయర్‌ పీఠంపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డికి చెక్‌ పెట్టేందుకు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి కలిసి ప్రయోగించిన అస్త్రం గురి తప్పలేదు. అధిష్టానం వద్ద కోటంరెడ్డి పరపతి ఇంతేనని ఆఖరి క్షణంలో నెల్లూరు రూరల్‌లో లోకేశ్‌ పర్యటనను రద్దు చేయించడంతో ఘోర పరాభవం తప్పలేదు. ఈ పరిణామాలతో రగిలిపోతున్న కోటంరెడ్డి మేయర్‌ అభ్యర్థిత్వంపై తన మాటే చెల్లుబాటయ్యేలా తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. 

మైనార్టీ మెలిక.. వ్యూహం 
కార్పొరేషన్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కాకముందే మేయర్‌ అభ్యర్థిత్వంపై మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ఆధిపత్యానికి చెక్‌ పెడుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి మెలిక ఆ పార్టీని అంతర్మథనంలో పడేస్తోంది. రోస్టర్‌ ప్రకారం నెల్లూరు కార్పొరేషన్‌ జనరల్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో జనరల్‌ కేటగిరీకి చెందిన వారికే అవకాశం ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీల ఆలోచన. కానీ టీడీపీలో మాత్రం మేయర్‌ అభ్యర్థిత్వంపై నెల రోజులుగా నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మేయర్‌ పీఠం తన గుప్పెట్లో పెట్టుకునేందుకు, రానున్న రోజుల్లో మైనారిటీల్లో తన పట్టును నిలబెట్టుకునేందుకే ముందుగానే నెల్లూరు మేయర్‌ సీటు మైనారిటీలైన ముస్లింలకు ఇవ్వాలని మెలిక పెట్టారు. 

ఒక వేళ పార్టీ ఓకే అంటే ఆ క్రెడిట్‌ తనదిగా చెప్పుకోవచ్చు.. లేదంటే నేను మైనార్టీలకు ఇవ్వాలని చెప్పినా మంత్రి నారాయణ ఒప్పుకోలేదని ఆ నెపం ఆయనపై నెట్టేయొచ్చు అనే రాజకీయ వ్యూహంతో కోటంరెడ్డి తుట్టెను కదిలించారు. నెల్లూరు రూరల్‌పరిధిలో మైనార్టీ ఓట్లను ఆకట్టుకునేందుకు ఈ అస్త్రం ఉపయోగించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కోటంరెడ్డిని ఆయనకు అత్యంత సన్నిహితుడైన కోడూరు కమలాకర్‌రెడ్డి కలిసి తన అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిసింది. 

రూప్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న కోటంరెడ్డి 
డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ అభ్యర్థిత్వాన్ని ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ ఖరారు చేయిస్తున్నారని తెలియగానే ఎమ్మెల్యే కోటంరెడ్డికి మింగుడు పడలేదు. రూప్‌కుమార్‌కు మేయర్‌ అభ్యర్థిత్వం అయితే తన పవర్‌ సెంటర్‌కు చిల్లు పడుతుందని,  ఎలాగైనా రూప్‌ అభ్యర్థిత్వాన్ని అడ్డుకునేందుకు తన రాజకీయ అస్త్రాలు వాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.  జనరల్‌ సీటులో బీసీకి ఎలా ఇస్తారంటూ మెలిక పెట్టి తాజాగా తన సోదరుడు గిరిధర్‌ రెడ్డి పేరు తెరపైకి తెచ్చారు. చాపకింద నీరులా ప్రయత్నాలు తీవ్ర తరం చేస్తున్నారు. ఒక వేళ తన సోదరుడు కాకుంటే తన అనుచరుడు కోడూరు కమలాకర్‌రెడ్డిని పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం.  

రూప్‌ అభ్యర్థిత్వానికి నారాయణ.. వేమిరెడ్డి పావులు 
నెల్లూరు కార్పొరేషన్‌లో విజయావకాశాలు పక్కన పెట్టి.. టీడీపీ అభ్యర్థిత్వంలో తన మాటే నెగ్గాలని మంత్రి నారాయణ తన ఆధిపత్య అ్రస్తాన్ని ప్రయోగిస్తున్నారు. జిల్లా టీడీపీలో కీలకంగా మారిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు సైతం నారాయణ నిర్ణయానికే జైకొడుతున్నారు. బీసీ వర్గానికి చెందిన రూప్‌కుమార్‌ జనరల్‌ సీటులోనైనా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని వేడుకోవడంతో ఈ క్రమంలో మంత్రి, ఎంపీలకు ఇష్టుడుగా ఉన్న డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌యాదవ్‌ పేరు తెరపైకి తెచ్చారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి రూప్‌ పేరు ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల లోకేశ్‌ వద్ద కూడా రూప్‌ పేరునే ఖరారు చేయమని ఎంపీ వేమిరెడ్డి దంపతులు, నారాయణ చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement