సాక్షి, నెల్లూరు: మీరు ఆజ్ఞ ఇవ్వండి.. నేను చేస్తా.. ఇలా అధికార పార్టీ సేవలో గూడూరు రూరల్ ఎస్సై తిరుపతయ్య తరిస్తున్నారు. ఇక్కడ విధుల్లో చేరిన నాటి నుంచి ఇదే పోకడను అవలంబిస్తున్నారు. రూరల్ పరిధిలోని రామలింగాపురం పంచాయతీలో నామినేషన్ల ఉపసంహరణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు వినోద్‌పై అక్రమ కేసును నమోదు చేశారు. గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు యాటగిరి వెంకటరమణయ్య పోటీ నుంచి తప్పుకొంటున్నానని ప్రకటించి, ఆర్వో వద్ద విత్‌డ్రా చేసుకున్నారు.
అయితే ఇదంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే చేయించారంటూ వినోద్‌పై కేసును బనాయించారు. పరిషత్ ఎన్నికల సమయంలోనూ ఇదే సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన పార్టీ అభ్యర్థి ఇంట్లో 57 మద్యం బాటిళ్లను సిబ్బంది ద్వారా పెట్టించి, అక్రమంగా దాచి ఉంచారనే అభియోగాన్ని మోపారు. మంగళపూరులో పార్టీ నేత యద్దల నరేంద్రరెడ్డి గెస్ట్ హౌస్‌లో మద్యం, గంజాయి నిల్వలున్నాయని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి, వారితో గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే అక్కడేమీ దొరక్కపోవడంతో వెనుదిరిగారు. గూడూరు సమన్వయకర్త బూదూరు గురవయ్య ఇంటిపై గూండాలు దాడికి యతి్నంచిన సమయంలోనూ అక్కడే విధుల్లో ఉన్న ఈయన తనకేమీ పట్టదనే రీతిలో వ్యవహరించారు. వెడిచెర్లలో భూ సమస్యలు గతంలో ఉండగా, దీన్ని అధికార పార్టీకి అనుకూలంగా మలిచేందుకు గ్రామంలోని దళితులపైనే అక్రమ కేసులను బనాయించిన చరిత్రా ఈయనకుంది. ఇంత చేస్తున్నా, ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు.


