సాక్షి,శ్రీకాకుళం: నగర పాలక సంస్థ (కార్పొరేషన్) ఎన్నికల వేళ 30వ డివిజన్ పరిధిలోని కుశాలపురంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమ గ్రామ పంచాయతీని శ్రీకాకుళం కార్పొరేషన్‌లో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు.
విలీన నిర్ణయానికి నిరసనగా కుశాలపురం డివిజన్ నుంచి నామినేషన్లు వేసిన 13 మంది అభ్యర్థులు మూకుమ్మడిగా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 30వ డివిజన్ ఎన్నికల బరిలో ఒక్క అభ్యర్థి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. కార్పొరేటర్ ఎన్నికలతో పాటు మేయర్ ఎన్నికను కూడా తాము పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు స్పష్టం చేశారు.
పోలీసుల చర్యలతో ఉద్రిక్తత
పోలింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కుశాలపురం గ్రామానికి చెందిన 13 మంది ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల చర్యలతో స్థానికంగా మరింత ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడ్డాయి.
కుశాలపురం (30వ డివిజన్): ఇక్కడ మొత్తం 3,220 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం అధికారులు 31, 32, 33, 34 నంబర్లతో నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం కార్పొరేషన్ మొత్తం వివరాలు: నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 60 డివిజన్లు, 1,57,545 మంది ఓటర్లు ఉండగా, ఎన్నికల నిర్వహణ కోసం 180 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఒకవైపు కార్పొరేషన్ పరిధిలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, కుశాలపురం గ్రామస్తుల బహిష్కరణ నిర్ణయం, నాయకుల అరెస్టులు ఇప్పుడు శ్రీకాకుళం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


