
ఢిల్లీ: దేశంలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారని ఘాటు విమర్శలు చేశారు బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ అభియోగపత్రం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిరసనలకు బీజేపీ కౌంటరిచ్చింది. తాజాగా బీజేపీ సీనియర్ నాయకులు రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ..‘కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ.. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసి నేషనల్ హెరాల్డ్‌కు ఇచ్చే హక్కు లేదు. స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ప్రజల గొంతును బలోపేతం చేయడానికి ఏర్పాటుచేసిన ఈ వార్తా పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారు. ఈ కేసును కొట్టివేయించడానికి సోనియాగాంధీ, రాహుల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అక్రమాలకు పాల్పడినవారు తప్పించుకోవడానికి ఇది కాంగ్రెస్ పాలన కాదు. ఇక్కడ రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదు. దేశ రాజధానిలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ నుంచి ముంబై, లక్నో, భోపాల్, పట్నా వరకు దేశవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రజాఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా గాంధీ కుటుంబం చేతుల్లోకి బదిలీ చేయడానికి ఈ కార్పొరేట్ కుట్ర పన్నారు. ‘అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్’ (ఏజేఎల్)కు సంబంధించిన 99% షేర్లను కేవలం రూ.50 లక్షలకు బదలాయించుకొని, రూ.రెండు వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని గాంధీ కుటుంబం తప్పుడు మార్గాన కైవసం చేసుకుంది’ అంటూ ఆరోపణలు చేశారు.
మరోవైపు.. రవిశంకర్ ప్రసాద్ ఆరోపణలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా మాట్లాడుతూ..%స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారు నేషనల్ హెరాల్డ్, గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌ను ద్వేషించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆర్‌ఎస్‌ఎస్ ఆక్రమించింది. లాభాపేక్షలేని సంస్థపై మనీలాండరింగ్ కేసు, అక్కడ నిధుల మార్పిడి జరగలేదు. ఆస్తి హక్కులు బదిలీ చేయబడలేదు. ఇది నరేంద్ర మోదీ భయాన్ని చూపిస్తుంది. ఈ కేసు రాజకీయ ప్రేరేపితం మాత్రమే. మేము న్యాయ వ్యవస్థను విశ్వసిస్తాము. దీనిపై మేము చట్టబద్ధంగా పోరాడి న్యాయం పొందుతాము. ప్రతిపక్షాల గొంతును అణిచివేసేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకున్నారు. మోదీ ప్రభుత్వానికి ఎటువంటి ఆధారాలు లేవు. వారు ప్రతిపక్షాల ప్రతిష్టను దిగజార్చాలని మాత్రమే కోరుకుంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.