Munugode By Election: మునుగోడుపై టీఆర్‌ఎస్‌ ఫుల్‌ ఫోకస్‌! రంగంలోకి కేటీఆర్‌, హరీశ్‌ కూడా?

Munugode By Election 2022 TRS Full Focus KTR And Harish To Campaign - Sakshi

ఈ నెల 5న పార్టీ అభ్యర్థి పేరు అధికారికంగా ప్రకటన 

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకే మరోమారు అవకాశం 

సీపీఐ, సీపీఎంలతో సమన్వయానికి ‘స్టీరింగ్‌ కమిటీ’ 

నెలాఖరులో చండూరులో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ 

సాక్షి, హైదరాబాద్‌:  మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడటంతో పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో సర్వశక్తులూ ఒడ్డి అయినా మునుగోడులో విజయం సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించి, ప్రచారాన్ని వేడెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌ ఇప్పటికే మునుగోడు అభ్య ర్థులను ప్రకటించినా టీఆర్‌ఎస్‌ అధికా రికంగా వెల్లడించలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే అవకాశమిస్తారని.. ఈనెల 5న తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొత్త జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం దగ్గర దరఖాస్తు చేసుకున్నాక.. పేరు పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ తదితర ప్రక్రియల కోసం ఈసీ దాదాపు నెలరోజుల సమయం తీసుకుంటుందని.. అందువల్ల టీఆర్‌ఎస్‌ పేరుతోనే ఉప ఎన్నికకు వెళ్లనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

సీపీఎం, సీపీఐలతో ‘స్టీరింగ్‌ కమిటీ’ 
మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం, సీపీఐ రెండూ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. ఆ పార్టీల నేతల సమన్వయంతో ప్రచారాన్ని నిర్వహించేందుకు ‘స్టీరింగ్‌ కమిటీ’ఏర్పాటు చేయనున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గాన్ని 90 యూనిట్లుగా విభజించి 70 మంది ఎమ్మెల్యేలు, మరో 20 మంది ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర ము ఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించేలా టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. ఇన్‌చార్జులుగా నియమితులైన నేతలు ఈ నెల 7నుంచి తమకు నిర్దేశించిన యూనిట్‌ (ఎంపీటీసీస్థానం) పరిధిలో ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ప్రచారంలో భాగంగా చివరి దశలో అంటే అక్టోబర్‌ చివరి వారంలో సీఎం కేసీఆర్‌ చండూరులో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

ప్రతి ఓటర్‌ను చేరేలా ప్రణాళిక 
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన నాటి నుంచి ఇప్పటివరకు బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి 35 మందికిపైగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నేతలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఇక ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఇప్పటికే 75 వేల మంది ఓటర్లను ప్రత్యక్షంగా కలిసినట్టు టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గానికి చెందిన ఏడున్నర వేల మంది గిరిజనులను ప్రత్యేక బస్సుల ద్వారా హైదరాబాద్‌ బంజారా భవన్‌కు తీసుకొచ్చి పది శాతం గిరిజన రిజర్వేషన్లు, గిరిజన బంధు పథకాలపై అవగాహన కల్పించారు. ఇలా ప్రభుత్వ పథకాలపై ప్రతీ ఓటరుకు అవగాహన కల్పిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని పార్టీ నేతలు పేర్కొన్నారు. 

అక్కడక్కడా సద్దుమణగని అసమ్మతి 
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ సర్వశక్తులూ ఒడ్డుతుండగా.. పార్టీలో అంతర్గత అసమ్మతి పూర్తిస్థాయిలో సద్దుమణగడం లేదు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దంటూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన అసంతృప్తులు.. తర్వాత కొంతమేర స్వరాన్ని తగ్గించారు. మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు సమన్వయం చేస్తున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి తమను కలుపుకొనిపోవడం లేదంటూ బీసీ సామాజికవర్గానికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కొందరు నేతలు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. 

మునుగోడుకు కేటీఆర్, హరీశ్‌ కూడా? 
మునుగోడు టీఆర్‌ఎస్‌ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు మంత్రి హరీశ్‌రావును కూడా కేసీఆర్‌ రంగంలోకి దింపనున్నట్టు తెలిసింది. వారు తమకు కేటాయించిన యూనిట్లలో బాధ్యతలు చూసుకుంటూనే.. సమన్వయ బృందా నికి మార్గనిర్దేశం చేస్తారని సమాచారం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top