సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ నుంచి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు బయలుదేరారు. కేటీఆర్, భర్త అనిత్, కుటుంబ సభ్యులతో కలిసి కవిత విమానాశ్రయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. నా పోరాటం కొనసాగుతుంది. నిజం కచ్చితంగా గెలుస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకోవాల్సి ఉంది. సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యావాదాలు. జై తెలంగాణ’ అంటూ కామెంట్స్ చేశారు.
#WATCH | BRS leader K Kavitha along with party leader and her brother KT Rama Rao in Delhi
(Video source: BRS) pic.twitter.com/xYedikX7Ee— ANI (@ANI) August 28, 2024
నేడు 500 కార్లతో భారీ ర్యాలీ
కవిత జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు బీఆర్‌ఎస్ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో సందడి నెలకొంది.
జైలు నుంచి విడుదల..
ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ 166 రోజులపాటు ఢిల్లీ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరుచేసింది. ఈ క్రమంలో తీహార్ జైలు నుంచి విడుదల అనంతరం కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..‘నేను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. ఐదున్నర నెలల తర్వాత కుటుంబ సభ్యులను, కార్యకర్తల్ని, మీడియాను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఒక తల్లిగా పిల్లల్ని వదిలేసి ఐదున్నర నెలలు ఏనాడూ ఉండలేదు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, సరైన సమయానికి సరైన సమాధానం చెబుతాను. కష్టకాలంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకూ నా కృతజ్ఞతలు. ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కేసీఆర్ బిడ్డను. తెలంగాణ బిడ్డను. కమిట్‌మెంట్‌తో పనిచేస్తాను, న్యాయపరంగా ఎదుర్కొంటాను, రాజకీయంగా కొట్లాడతాను. నేను మాములుగా కాస్త మొండిదానిని, మంచిదానిని, నన్ను అనవసరంగా జైలుకు పంపి ఇప్పుడు జగమొండిని చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు. తనను అక్రమంగా జైలుకు పంపారని, బీఆర్‌ఎస్, కేసీఆర్‌ను విచ్ఛిన్నం చేయడానికే ఇలా చేశారు’ అంటూ కామెంట్స్ చేశారు.

నా తప్పు లేకున్నా.. కేవలం రాజకీయాల కోసం నన్ను జైల్లో పెట్టారు. ఈ విషయం దేశం మొత్తానికి తెలుసు.
నేను తెలంగాణ బిడ్డను.. కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు.
రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతా.. తప్పకుండా నిర్దోషిగా నిరూపించుకుంటా.
- ఎమ్మెల్సీ @RaoKavitha pic.twitter.com/3RTl9uPaFS— BRS Party (@BRSparty) August 27, 2024


