
భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఆరోపణ
పదేళ్ల కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ధ్వజం
మంత్రి కోమటిరెడ్డితో కలిసి నల్లగొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నల్లగొండ: పదేళ్లు దోచుకున్న డబ్బుతో బీఆర్‌ఎస్.. వరంగల్‌లో సభ నిర్వహించిందని భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నల్లగొండ నియోజకవర్గంలో మూడు లిఫ్టులకు, కలెక్టరేట్‌లో అదనపు బ్లాక్ నిర్మాణ పనులకు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎంపీలు కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, మందుల సామేల్, వేముల వీరేశం, బాలునాయక్, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాలా తీయించారని ధ్వజమెత్తారు.
రైతులను ప్రోత్సహిస్తున్నాం..
రాష్ట్రంలో ఏడాది కాలంలో 2.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని.. సన్నాలకు బోనస్ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. దేశంలో పేదలకు సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. అలాగే అర్హులకు రేషన్‌కార్డులు ఇవ్వడంలో బీఆర్‌ఎస్ విఫలమవగా తాము అర్హులందరికీ కార్డులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో కృష్ణా జలాలను ఆంధ్రాకు అప్పగించారని.. 512 టీఎంసీలు ఏపీ తీసుకుంటే, తెలంగాణకు 299 టీఎంసీలే వచ్చేలా ఒప్పందం చేసుకున్నారని ఉత్తమ్ విమర్శించారు. కానీ తామిప్పుడు 500 టీఎంసీలను తెలంగాణకు ఇవ్వాలని కొట్లాడుతున్నామని చెప్పారు. తమ పాలనలోనే ఎస్‌ఎల్‌బీసీ పనులు పూర్తి చేస్తామని చెప్పారు.
నాడు సోనియా కాళ్లు మొక్కి.. నేడు కాంగ్రెస్ విలన్ అంటావా: కోమటిరెడ్డి
తెలంగాణ ఇచ్చిన తల్లి అంటూ కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కిన కేసీఆర్ నేడు కాంగ్రెస్ పారీ్టనే విలన్ అనడం ఎంత వరకు సమంజసమని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా చెప్పి నేడు అదే నోటితో కాంగ్రెస్‌ను విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. దళితుడిని సీఎం చేస్తాన ని చెప్పి కేసీఆర్ మాటమార్చి మోసం చేశారని దుయ్యబట్టారు. అవినీతి డబ్బుతో మీటింగ్ పెట్టి కాంగ్రెస్‌ను విమర్శిస్తే సహించేది లేదన్నారు.
ఉత్తమ్, వెంకట్‌రెడ్డిలది సీఎం స్థాయి: రాజగోపాల్‌రెడ్డి
కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని.. పదేళ్లు ఆయన ఏం చేశారో సమాధానం చెబుతామని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మంత్రులైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం స్థాయిలో ఉన్నవారన్నారు. కోమటిరెడ్డి పదవు ల కోసం పాకులాడలేదని.. తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు.