
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇచ్చిన వాగ్మూలం అసత్యమంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్‌కు ఈటల అసత్యాలు చెప్పారు. శనివారం ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ఈటల ప్రస్తావించిన సబ్ కమిటీ కాళేశ్వరం కోసం వేసింది కాదని.. మేడిగడ్డకు అనుమతులు ఇచ్చిన తర్వాత కమిటీ వేశారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు, సబ్ కమిటీకి సంబంధం లేదని తుమ్మల స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులపై మాత్రమే సబ్ కమిటీ వేశారు. నేనే సుమోటోగా కమిషనర్ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నా. సబ్ కమిటీ నిర్ణయాలను కమిషన్ ముందు ఉంచుతా’’ అని తుమ్మల తెలిపారు.
‘‘చాలా రోజులు అయింది కాబట్టి అనాలోచితంగా ఇచ్చారో తెలీదు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సంబంధం లేని, పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. కాళేశ్వరం నిర్మాణం కోసం ఏర్పాటు కోసం వేసిన సబ్ కమిటీ కాదు. మేడిగడ్డ, ప్రాణహిత, కడ్కో పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ వేశారు. కాళేశ్వరంపై సబ్ కమిటీ లేదు.. రిపోర్ట్ ఇవ్వలేదు. సబ్ కమిటీకి.. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం పొందినట్లు ఈటల రాజేందర్ చెప్పారు.. అది వాస్తవం కాదు. కేబినెట్ ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడూ రాలేదు. కేబినెట్ ఆమోదానికి కాళేశ్వరం ఏ రోజూ రాలేదు’’ అని తుమ్మల పేర్కొన్నారు.
ఈటలకు తప్పుడు ఆలోచన ఎందుకు వచ్చిందో తెలీదు. 43 ఏళ్లుగా పద్ధతితో, నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్నాను. నా వ్యక్తిత్వం ఈటల రాజేందర్‌కు తెలుసు. ఈటల రాజేందర్ స్టేట్‌మెంట్ చూశాక కొంత బాధేసింది. ఈటల రాజేందర్ ఇలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏం వచ్చిందో తెలీదు. సబ్ కమిటీ రిపోర్ట్‌ను కమిషన్‌కు ఇస్తాను. నాకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదు. ఈటల రాజేందర్ వాంగ్మూలం చాలా బాధాకరం’’ అని తుమ్మల వ్యాఖ్యానించారు.