
పార్వతీపురం మన్యం జిల్లా: దళారి, మధ్యవర్తి వ్యవస్థలు లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం తమదని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో సామాజిక సాధికార సన్నాహ సమీక్ష సభలో బొత్స మాట్లాడుతూ.. ‘నాలుగున్నర ఎనిమిది నెలల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారు. జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలకు మరింత వివరంగా చెప్పాల్సిన బాధ్యత నాయకులపై ఉంది. ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో దళారి, మధ్యవర్తి వ్యవస్థలు లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని పనులు చేసేవి.
ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు ఇచ్చి లాయర్లను తెచ్చిన చంద్రబాబు బయటకు ఎందుకు రావడం లేదు. చంద్రబాబు అనే వ్యక్తి అధికారం దుర్వినియోగం చేశారు. అధికారులను వాడుకుని అవినీతి చేసినట్లు రుజువు అయింది కాబట్టి ఆయన బయటకు రావడం లేదు. నేటికి కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు కాలం గడిపారు. చంద్రబాబు హయాంలో చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం అయినా ఉందా?, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ నాయకత్వంలో అన్ని పదవుల్లో బలహీన వర్గాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు’ అని తెలిపారు.