ప్రాణాలూ వేలాడాల్సిందేనా..!
● ఆటోల్లో కుక్కి.. బస్సుల్లో తొక్కి..
● వెక్కిరిస్తున్న నిబంధనలు
పార్వతీపురం రూరల్: బడికి వెళ్లే బాట.. మృత్యువుతో ఆటగా మారుతోంది. విద్యార్థుల ప్రయాణం నిత్యం కత్తిమీద సాములా సాగుతోంది. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన ప్రాంతాల్లో విద్యా సంస్థల వేళల్లో కనిపిస్తున్న దృశ్యాలు వాహనదారులను, బాటసారులను కలచి వేస్తున్నాయి.
నిబంధనలు గాలికి.. పసిప్రాణాలు వేలాడుతూ..
ఆటోల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను కుక్కుతున్నారు. వెనుక సీటుపై ప్రమాదకరంగా కూర్చోబెట్టడంతో ప్రమాదవశాత్తు ఆటో వెనుక భాగంలో విద్యార్థులు కూర్చున్న ఆ డోర్‌కు ఉన్న చైన్ తెగితే అంతే ఒక్కసారిగా చిన్నారులు బలంగా రోడ్డు ఢీకొని వెనుక వస్తున్న వాహనాలకు బలికాక తప్పని దుస్థితి. అలాగే ఆర్టీసీ బస్సుల్లో కొందరు విద్యార్థులు బయటకు వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. కిక్కిరిసిన రద్దీతో ప్రవేశ ద్వారం వద్ద ఫుట్‌బోర్డుపై నిలబడి, గాలిలో వేలాడుతూ విద్యార్థులు చేసే ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరు? అని తోటి వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ద్విచక్ర వాహనాలపైనే దృష్టి.. వీటిపై ఏది నిఘా?
పోలీసు, రవాణా శాఖాధికారులు కేవలం ద్విచక్ర వాహనాల తనిఖీలపైనే దృష్టి సారిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెల్మెట్లు, ఫైన్ బకాయిలు, పత్రాల వేటలో పడి.. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాల వాహనాలు, ఓవర్ లోడ్ ఆటోలను పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, పసిప్రాణాల ప్రయాణానికి భద్రత కల్పించాలని కోరుతున్నారు.
ప్రాణాలూ వేలాడాల్సిందేనా..!


