ఉపాధ్యాయుడి అవతారమెత్తిన ఏపీఓ
సీతంపేట: ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు మంగళవారం ఉపాధ్యాయుడి అవతారమెత్తారు. మండలంలోని బుడగరాయి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు గణితంలో కొన్ని సమస్యల సాధన చేశారు. ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షల మార్కులు ఏ విధంగా ఒక్కో విద్యార్థికి వచ్చాయో పరిశీలించారు. ఇంకా బాగా చదువుకోవాలన్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. పాఠశాల వాతావరణం బాగా ఉండేలా చూసుకోవాలన్నారు. డ్రైనేజీ శుభ్రం చేయించాలన్నారు. అనంతరం మెనూ పరిశీలించారు. రుచికరమైన భోజనం విద్యార్థులకు పెట్టాలన్నారు. ఉపాధ్యాయ సిబ్బందితో మాట్లాడారు.
అర్ధరాత్రి దాటితే
రోడ్లపైకి రావొద్దు
● మత్తులో బండి తీస్తే కటకటాలే : ఎస్పీ
పార్వతీపురం రూరల్: నూతన సంవత్సర వేడుకలు నవ్వుల పూలు పూయించాలే తప్ప.. కన్నీటి గాథలకు తావివ్వకూడదని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలో యువత ఉత్సాహం ఉరకలెత్తి ఉన్మాదంగా మారకూడదని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వేడుకలు జరుపుకోవాలని మంగళవారం విడుల చేసిన ఒక ప్రకటనలో ఆయన కోరారు. డిసెంబరు 31 అర్ధరాత్రి తర్వాత రహదారులపై ఎవరూ సంచరించకూడదని, ఈ నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపనుంది. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించామని, మద్యం మత్తులో స్టీరింగ్ పడితే వాహనాలను అక్కడికక్కడే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. మితిమీరిన వేగం, ప్రమాదకరమైన బైక్ రేసులు, ట్రిపుల్ రైడింగ్ వంటి విన్యాసాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మైనర్ల చేతికి వాహనాలు ఇస్తే వారి కంటే ఎక్కువగా తల్లిదండ్రులనే బాధ్యులను చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్‌లు కట్ చేయడం, పెద్ద ధ్వనులతో డీజేలు ఏర్పాటు చేయడం, బాణసంచా కాల్చడం వంటి పనులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయని, ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ తెలిపారు. మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే అల్లరి మూకల ఆట కట్టించేందుకు ముఖ్య కూడళ్లలో పోలీసు పికెట్లను, నిరంతర పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. నిర్ణీత సమయం మించి మద్యం విక్రయించే దుకాణాలపై కూడా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ తమ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య నూతన వసంతానికి స్వాగతం పలకాలని, పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
ఉపాధ్యాయుడి అవతారమెత్తిన ఏపీఓ


