వైభవంగా ముక్కోటి ఏకాదశి
గరుగుబిల్లి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా పవిత్ర నాగావళి నదీ తీరంలో వెలసిన తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి వారిని, కోదండరామ స్వామివారిని దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి ఉదయం సుప్రభాతసేవ, నిత్యారాధన, విశేష హోమములు, పాశుర విన్నపం, మంగళాశాసనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం హన్‌మత్ వాహనంపై సీతారామ లక్ష్మణస్వామి వారి ఉత్సవమూర్తులకు శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి శ్రీకోదండ రామాలయం వరకు ఉత్తర ద్వారం గుండా తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించి, హన్‌మత్ వాహనంపై వున్న స్వామివారి దర్శనం భక్తులకు కల్పించారు. అనంతరం కోదండరామస్వామి ఆలయంలో ఉత్తరద్వారం గుండా భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. ఆలయ అర్చకులు అప్పలాచార్యులు ఆధ్వర్యంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, ఈవో శ్రీనివాస్, సిబ్బంది, గ్రామ పెద్దలు, పలువురు భక్తులు, టీటీడీ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. తిరువీధి కార్యక్రమంలో మహిళా భక్తులు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్య శిబిరం నిర్వహించారు.
● స్వామివారిని దర్శించుకున్న భక్తులు
● కిటకిటలాడిన దేవాలయ ప్రాంగణం
వైభవంగా ముక్కోటి ఏకాదశి


