ఐదు రోజుల బ్యాంకింగ్ విధులు అమలు చేయాలి
● ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద
యూఎఫ్‌బీయూ ధర్నా
విజయనగరం అర్బన్: బ్యాంకింగ్ రంగంలో ఐదురోజుల విధుల విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ కార్యాయలం ఎదుట బ్యాంకు ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో విజయనగరం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వివిధ బ్యాంకు శాఖలకు చెందిన ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా బ్యాంకు ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు బీవీప్రసాద్ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయడం న్యాయమైన డిమాండ్ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ మురళీశ్రీనివాస్, స్టేట్ బ్యాంక్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రమేష్, రాజశేఖర్ గుప్తా, కమిటీ సభ్యులు నాగభూషణరావు, రవికుమార్, శ్రావణకుమార్, మురళి, భానోజీరావు, హరీష్, మనోజ్ వర్మ, హర్ష, శర్మ తదితరులు పాల్గొన్నారు.


