సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బొగ్గ గనుల వ్యవహారంలో తనపై తప్పుడు రాతలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసింది పిట్టకథ, కట్టుకథలు అని ఆరోపించారు. ఆంధ్రజ్యోతివి అభూత కల్పనలు.. ఈ వార్త విషయంలో తాను, రాధాకృష్ణ తేల్చుకుంటాం అని భట్టి సీరియస్ కామెంట్స్ చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజల ఆస్తులను కాపాడటమే నా లక్ష్యం.. నా పని. ఆస్తులను సంపాదించడం కోసం.. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలను పీక్కు తింటున్న గద్దల నుంచి ప్రజలను రక్షించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నా లక్ష్యం ప్రజలకు సేవ చేయడం. సమాజంలో ఉన్న వనరులను ప్రజలకు సమానంగా పంచడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఈరోజు ఆంధ్రజ్యోతి చైర్మన్ రాధాకృష్ణ తొలిపలుకు అని వార్త రాశారు. రాష్ట్రంలో బొగ్గు గనుల కోసమే వార్త కథనాలు అని రాసుకొచ్చారు. ఆంధ్రజ్యోతి కథనంలో నా పేరు ప్రస్తావించారు. సింగరేణి అనేది తెలంగాణ ప్రజల ఆస్తులు.. బొగ్గు గనులు ప్రజల ఆత్మ. టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థ.. సంస్థ బోర్డు.
పిట్టకథలతో తప్పుడు వార్తలు..
టెండర్ల నిబంధనలను చేసేది సంస్థ.. మంత్రి కాదు. క్లిష్టతరమైన ప్రాంతాల్లో గనులుంటాయి కాబట్టి.. ఫీల్డ్ విజిట్ అనేది పెడతారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇటువంటి నిబంధనలు పెడతారు.. రాయడం కాదు.. ముందుగా తెలుసుకోవాలి. రాష్ట్రంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అల్లింది పిట్టకథ. కట్టు కథలు అల్లి రాశారు. ఆంధ్రజ్యోతివి అభూత కల్పనలు. రాసిన ఆయనకు ఎవరి మీదో ప్రేమ ఉండొచ్చు. నేను, రాధాకృష్ణ తేల్చుకుంటాం. ప్రజలకు నిజాలు తెలియాలి. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఇది అంటూ మండిపడ్డారు. నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిని. వైఎస్సార్ మీద కోపంతో నా మీద రాసి ఉండవచ్చు. ప్రజలకు నిజానిజాలు తెలియాలి.
జ్ఞానం లేకుండా ఇలాంటి వార్తలా?..
నేను ఈ బాధ్యతలో ఉన్నంత వరకు ఏ గద్దలను రానివ్వను. మీకు ఇతర మీడియా సంస్థలకు ఏముందో తెలియదు. మీ మధ్యలో ప్రజాప్రతినిధులను లాగొద్దు. వ్యక్తుల వ్యక్తిగత విషయాల జోలికి ఎవరు వెళ్లొద్దు. వెనకాల ఎవరు ఉండి రాయించారో తర్వాత మాట్లాడతాను. మంత్రుల మధ్య పంచాయితీ పెడతాం అంటే కుదరదు. ఆత్మ గౌరవంతో పనిచేస్తున్నాం. ఏ ఛానల్ అయినా ఎవరి ఇమేజ్ దెబ్బతీయొద్దు. మా సీఎం, మంత్రులు రాష్ట్ర విస్త్రృత ప్రయోజనాల కోసం పనిచేస్తాం. మీ అవసరాల కోసం అల్లే కట్టుకథలు మమ్మల్ని ఏం చేయలేవు. నాది అంత వీక్ క్యారెక్టర్ కాదు. అందులో నా పేరును పెద్ద అక్షరాలతో ప్రస్తావించారు. రాధాకృష్ణ పలుకులతో నాకు జరిగే నష్టమేమీ లేదు. ఏ మాత్రం జ్ఞానం లేకుందా ఇలాంటి వార్తలు రాయడం ఏంటి?’ అని ప్రశ్నించారు.



