తెలంగాణ లాభదాయక రాష్ట్రమే | Sakshi
Sakshi News home page

తెలంగాణ లాభదాయక రాష్ట్రమే

Published Thu, Dec 21 2023 4:14 AM

MIM Sabha leader Akbaruddin Owaisi at assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తక్కువ చేసి చూపుతూ తెలంగాణ పరువు తీసే ప్రయత్నం చేయొద్దని ఎంఐఎం సభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుల తడక లెక్కలు చూపించిందని విమర్శించారు. శ్వేతపత్రంపై బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణను అవమానించే విధంగా వ్యవహరించవద్దని హితవు చెప్పారు.

తెలంగాణ ముమ్మాటికీ లాభదాయక రాష్ట్రమేనని అన్నారు. ఈ సందర్భంగా   తెలంగాణ విభజన తరువాత బడ్జెట్‌కు సంబంధించి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయాలపై శ్వేతపత్రంలో చూపిన లెక్కల్లో తేడాలను ఉదహరించారు. శ్వేతపత్రంలో ఉన్న లెక్కలకు, ఆర్‌బీఐ, కాగ్‌ నివేదికల్లో పొందుపరిచిన లెక్కలకు పొంతనే లేదన్నారు. 

అలాగైతే కర్ణాటకలో కూడా పొంతనలేదు 
రాష్ట్ర బడ్జెట్‌ లెక్కలతో పాటు కర్ణాటక బడ్జెట్‌ లెక్కల్లో కూడా శ్వేతపత్రంలోని లెక్కలకు, కాగ్‌ నివేదిక లెక్కలకు కూడా పొంతన లేదని అక్బరుద్దీన్‌ విమర్శించారు. తెలంగాణ వచ్చాక విద్యుత్, సాగునీరు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు, ప్రజలకు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందాయని వివరించారు. అప్పులు పెరిగినా.. గణనీయంగా అభివృద్ధి జరిగిందన్నారు.

చివరికి ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లకు సంబంధించి కూడా శ్వేతపత్రానికి, కాగ్‌ నివేదికకు చాలా తేడా ఉందన్నారు. ఈ రెండింటితో పాటు ఆర్‌బీఐ నివేదికల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ప్రశ్నించారు. బ్యూరోక్రాట్లు అధికార పార్టీ మన్ననల కోసం తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, దీనిపై విచారణ జరిపి, అధికారులపై చర్యలు చేపట్టాలన్నారు. ఆడిట్‌ పూర్తయితేనే కాగ్‌ రిపోర్టులో సరైన లెక్కలు ఉంటాయని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పగా పదేళ్ల క్రితం నాటి ఆదాయ వ్యయాల ఆడిట్‌ కూడా పూర్తి కాలేదా అని అక్బరుద్దీన్‌ నిలదీశారు. 

కేంద్రం కూడా అప్పులు చేసిందన్న అక్బరుద్దీన్‌ 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పులు ఏకంగా 244 శాతం పెరిగాయని అక్బరుద్దీన్‌ వివ రించారు. పదేళ్ల క్రితం రూ. 44,25,347 కోట్లు ఉన్న అప్పులు రూ. 1,52, 53,915 కోట్లకు పెరిగాయని చెప్పారు. దీన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నారని, అలాంటి పరిస్థితు ల్లో కూడా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం ఆగలేదన్నారు. ఈ సందర్భంగా వార్షిక వృద్ధి రేటు ను, ఆర్థిక వృద్ధి రేటును వివరించారు.

Advertisement
Advertisement