‘లోక్‌సభ’ పోరులో ఆరుగురు మాజీ సీఎంలు.. ఎవరి ఆస్తి ఎంత? | Lok Sabha Elections 2024: Here's The Net Worth Details Of Six Former CMs From Different States - Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: ‘లోక్‌సభ’ పోరులో ఆరుగురు మాజీ సీఎంలు.. ఎవరి ఆస్తి ఎంత?

Published Sat, Mar 30 2024 11:45 AM | Last Updated on Sat, Mar 30 2024 2:47 PM

lok sabha election 2024 bjp ex cm net worth - Sakshi

రాబోయే లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి 400కు మించిన సీట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగింది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు బీజేపీ  తన అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించింది. ఈ క్రమంలోనే ఈసారి వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను లోక్‌సభ ఎన్నికల బరిలో నిలబెట్టింది. ఇప్పుడు అందరి దృష్టి ఈ మాజీ సీఎంలపైనే నిలిచింది. హర్యానా నుంచి మనోహర్‌లాల్‌, కర్ణాటక నుంచి బసవరాజ్‌ బొమ్మై, ఉత్తరాఖండ్‌ నుంచి త్రివేంద్రసింగ్‌ రావత్‌, త్రిపుర నుంచి బిప్లబ్‌ దేబ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కిరణ్‌ కుమార్‌ రెడ్డిలకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. వీరంతా మాజీ సీఎంలు. వారిలో ఎవరు అత్యంత ధనవంతులు ఎవరో తెలుసుకుందాం.

1. మనోహర్ లాల్
మనోహర్ లాల్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి. మైనెటైన్ఫో తెలిపిన వివరాల ప్రకారం మనోహర్ లాల్ ఆస్తుల విలువ రూ.ఒక కోటి 27 లక్షలకు పైగా ఉంది. 2019లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చిన అఫిడవిట్‌లో తన బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.2.5 లక్షలు  ఉన్నట్లు తెలిపారు. 2019లో తాను సుమారు రూ. 5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నట్లు కూడా పేర్కొన్నారు. స్థిరాస్తి విషయానికొస్తే రూ.50 లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమి ఆయన పేరిట ఉంది. దాదాపు రూ.3 లక్షల విలువైన ఇల్లు కూడా ఉంది.

2. బసవరాజ్ బొమ్మై
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన బసవరాజ్ బొమ్మై  అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం ఆయనకు రూ. 42.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇందులో హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన రూ. 19.2 కోట్లు ఉన్నాయి. 2022 మార్చి 26న ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ఆయన తరిహాల గ్రామంలో మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2023 నాటి ఈ అఫిడవిట్ ప్రకారం బొమ్మైతో పాటు అతనిపై ఆధారపడిన వారి మొత్తం ఆస్తుల విలువ రూ. 52.12 కోట్లు. 

3. శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్‌కు నాలుగుసార్లు సీఎం అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ 2023 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తులు రూ. 3.21 కోట్లు కాగా, ఆయన భార్య సాధనా సింగ్ మొత్తం ఆస్తులు రూ. 5.41 కోట్లు. ఐదేళ్ల క్రితం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆస్తులు రూ.3.26 కోట్లు. శివరాజ్ చరాస్తులు రూ.1,11,20,282 కాగా, స్థిరాస్తులు రూ.2.10 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అతని భార్య సాధనా సింగ్ చరాస్తులు రూ.1,09,14,644. సాధనా సింగ్ మొత్తం స్థిరాస్తులు రూ.4.32 కోట్లు.

4. కిరణ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా  వ్యవహరించిన కిరణ్ కుమార్‌ రెడ్డి ఆస్తుల విలువ దాదాపు రూ.19 కోట్లు. ఆయనకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దాదాపు రూ.9 కోట్ల విలువైన బంగ్లా ఉంది. కిరణ్ కుమార్‌ రెడ్డి దగ్గర మారుతి, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎక్స్‌యూవీ, ఫోక్స్‌వ్యాగన్ తదితర కార్లు ఉన్నాయి.

5. త్రివేంద్ర సింగ్ రావత్
ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఇటీవల సమర్పించిన అఫిడవిట్‌లో తన వద్ద రూ.56 వేలు, తన భార్య వద్ద రూ.32 వేల నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. అతని బ్యాంకు ఖాతాలో రూ.59 లక్షల 88 వేల 913, అతని భార్య బ్యాంకు ఖాతాలో రూ.94 లక్షల 80 వేల 261  ఉన్నట్లు పేర్కొన్నారు. 

త్రివేంద్ర సింగ్ రావత్ వద్ద 40 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ దాదాపు రూ.2 లక్షల 47 వేల 200. అతని భార్య వద్ద 110 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ సుమారు రూ.6 లక్షల 79 వేల 800. చరాస్తుల విషయానికి వస్తే త్రివేంద్ర సింగ్ రావత్‌కు రూ.62 లక్షల 92 వేల 113 విలువైన చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్యకు రూ. ఒక కోటి 1లక్ష 92వేల 61 విలువైన చరాస్తులు ఉన్నాయి. త్రివేంద్ర సింగ్ రావత్‌కు వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర, పూర్వీకుల ఆస్తులు కలిపి దాదాపు రూ. 4 కోట్ల ఒక లక్షా, 99 వేల 805 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్యకు రూ. ఒక కోటీ 8లక్షల 68వేల 60 విలువైన స్థిరాస్తి ఉంది. త్రివేంద్ర సింగ్ బ్యాంకు నుంచి రూ.75 లక్షల రుణం తీసుకున్నారు.

6. బిప్లబ్ కుమార్ దేబ్
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ఇటీవల తన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో తన వద్ద సుమారు రూ.52 వేల నగదు, తన భార్య వద్ద దాదాపు రూ.2400 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. బిప్లబ్ దేబ్‌కు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.92 లక్షల 78 వేల 838 ఉండగా, అతని భార్య  బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ. ఒక కోటి  ఏడు లక్షల 47 వేలు జమ అయ్యాయి. 

బిప్లబ్ దేబ్ వద్ద సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉండగా, ఆయన భార్య వద్ద దాదాపు రూ.9 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. బిప్లబ్ కుమార్ దేబ్ వద్ద నగలు, నగదు సహా రూ.95 లక్షల 78 వేల 838 విలువైన చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్యకు రూ. ఒక కోటి 16లక్షల 4వేల 729 విలువైన చరాస్తులు ఉన్నాయి. బిప్లబ్ కుమార్ దేబ్ అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం అతనికి సుమారు రూ. ఒక కోటి 89 లక్షల 17 వేల 755 విలువైన స్థిరాస్తి (వ్యవసాయ, వ్యవసాయేతర భూమి) ఉంది. అతని భార్యకు దాదాపు రూ.61 లక్షల విలువైన స్థిరాస్తి (వ్యవసాయ, వ్యవసాయేతర భూమి) ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement