
వికారాబాద్: కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కడప ప్రజలంతా టీడీపీకే ఓట్లు వేస్తారని భ్రమ పడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ఇద్దరే.. మహానాడును భ్రస్తుపట్టించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రజలకు ఏం చేయాలో చర్చించాల్సి పోయి.. జగన్‌ను తిట్టడానికే సరిపోయింది’’ అంటూ లక్ష్మీపార్వతీ దుయ్యబట్టారు.
‘‘టీడీపీ జెండాలు, కరపత్రాలు వాళ్లే తగలపెట్టుకున్నారు. సూపర్ సిక్స్ అన్నారు తండ్రి.. కొడుకు ఇంకోటి అంటున్నారు. నాడు-నేడు పేరుతో వైఎస్ జగన్ స్కూళ్లను అభివృద్ధి చేస్తే.. మేమే చేశామని చంద్రబాబు, లోకేష్ చెప్పుకుంటున్నారు. పనికిమాలిన రాజకీయానికి పరాకాష్ట ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ వీళ్లను పొగిడినట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్.. చంద్రబాబును తిట్టిన క్యాసెట్లు ఎన్నో ఉన్నాయి. లోకేష్ ఏ విధంగా ఎన్టీఆర్‌కి వారసుడు అవుతారు’’ అంటూ లక్షీపార్వతి ప్రశ్నించారు.
‘‘వైఎస్ జగన్ అన్ని రంగాల్లో పద్ధతి ప్రకారం ముందుకు తీసుకువెళ్లారు. కరోనాలో ప్రజలను ఆదుకున్న తీరు.. జగన్‌ను ప్రపంచమే మెచ్చుకుంది. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి పట్టిన పీడ. మహానాడు కాదు అది.. వెన్నుపోటు నాడు. మహానాడు అట్టర్ ఫ్లాప్. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పెద్ద పరిశ్రమలు అడ్రస్ లేకుండా చేశారు. జిందాల్ కంపెనీ రాకుండా చేశారు. అవకాశం కోసం చంద్రబాబు, లోకేష్ పని చేస్తారు. ఎన్టీఆర్ ఆశయాన్ని మహానాడులో చెప్పలేదు.. కేవలం జగన్‌ను తిట్టడానికి పెట్టారు. మద్యం ద్వారా ఏపీలో కుటుంబాలను సర్వ నాశనం చేస్తున్నారు.
..అవినీతి సొమ్మును వైట్ మనీగా మార్చడానికి మహానాడులో విరాళంగా తీసుకుంటున్నారు. స్కిల్ స్కాంలో ఇచ్చిన సొమ్ము పార్టీ ఫండ్‌గా తీసుకున్నారు. చంద్రబాబు చేసింది పెద్ద మోసం. చంద్రబాబు దగ్గరకు ఈడీ ఎందుకు రాదు?. ఎన్టీఆర్‌ను చంపింది చంద్రబాబు. ఎన్టీఆర్ పేరుతో మళ్లీ విరాళాలు వసూలు చేస్తున్నారు. రెండు ఎకరాల చంద్రబాబుకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా వచ్చింది?. ఎన్టీఆర్ ఆత్మను కూడా ఏఐ ద్వారా ఉపయోగించుకున్న తీరు బాధాకరం’’ అని లక్ష్మీపార్వతి అన్నారు.