సాక్షి, హైదరాబాద్: హరీష్‌రావుకు సిట్ నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఓ లొట్టపీసు కేసు అంటూ వ్యాఖ్యానించారు. విచారణ, కమీషన్ల పేరుతో మా పార్టీని నేతలను వేధిస్తున్నారని.. రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు నోటీసులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మీరు ఎన్ని విచారణలైనా చేసుకోండి.. మేం భయపడం. ఈ లొట్టపీసు కేసులో కేసీఆర్‌కు కూడా నోటీసులు ఇస్తారంట.. ఇచ్చుకోండి’’ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టేశాయి. అయినా ఎంక్వైరీలు చేయిస్తున్నారు. డెవర్షన్ పాలిటిక్స్ రేవంత్‌కు వెన్నతో పెట్టిన విద్య. రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డికి కోల్ టెండర్లు దక్కేలా ప్రయత్నాలు జరిగాయి. సింగరేణిలో స్కామ్‌ను నేను ఆధారాలతో సహా బయటపెడతా.. సింగరేణిలో రేవంత్ బావమరిదిని కింగ్‌పిన్ చేసి ఆయన రింగ్ తిప్పేలా చేశారు’’ అని కేటీఆర్ ఆరోపించారు.
‘‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణి దోపిడీ మొదలైంది. సింగరేణి టెండర్లపై హరీష్ చేసిన కామెంట్స్‌పై ప్రభుత్వం ఎందుకు స్పందించదు. బీఆర్‌ఎస్ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం లేదు. నైని కోల్ బ్లాక్ రద్దు వెనుక వాటాల పంచాయితీ ఉంది. నైని కోల్ బ్లాక్ కుంభకోణంపై హరీష్ మాట్లాడారనే అక్కసుతో నోటీసులు. అసెంబ్లీలో మంత్రులను హరీష్ ఫుట్‌బాల్ ఆడుకున్నారు’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.



