రాజకీయ నిరుద్యోగి రాహుల్‌: కేటీఆర్‌  | Sakshi
Sakshi News home page

రాజకీయ నిరుద్యోగి రాహుల్‌: కేటీఆర్‌ 

Published Sun, Nov 26 2023 4:50 AM

KTR Comments On Rahul Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ నిరుద్యోగంతో బాధ పడుతున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ యువతను రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని చూస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. ఉద్యోగాల కల్పన విషయంలో తాము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము రాహుల్‌కి ఉందా అని సవాల్‌ చేశారు. ఈ మేరకు శనివారం కేటీ రామారావు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో గడిచిన పదేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉంటే చూపించాలని డిమాండ్‌ చేశారు.

తొమ్మిదిన్నరేండ్లలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, 1.60లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని, కాంగ్రెస్‌ పాలనలో 2004 –14 నడుమ తెలంగాణలో భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 10,116 మాత్రమేనని పేర్కొన్నారు. జీవితంలో ఏనాడూ ఉద్యమాలు, ఉద్యోగాలు చేయని రాహుల్‌ గాం«దీకి యువత ఆకాంక్షలు తెలియవని, ఉద్యోగార్థుల ఇబ్బందులు ఆయనకు అర్దం కావని నిందించారు.

95శాతం ఉద్యోగాలు స్థానికులకేనంటూ కొత్త జోనల్‌ వ్యవస్థను తాము నిబద్ధతతో తెచ్చామని, 1972లో ముల్కీ నిబంధనలను రద్దు చేసి స్థానికతకు సమాధి కట్టింది కాంగ్రెస్‌ పార్టియేనని విమర్శించారు. ఆరు సూత్రాల పథకం, 610 జీవో, గిర్‌గ్లానీ నివేదికలు తుంగలో తొక్కి హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించి యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను కొల్లగొట్టి తీరని అన్యాయం చేశారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. 

సోనియాను రేవంత్‌ బలిదేవత అన్నారు 
1952, 1969లో తెలంగాణ కోసం ఉద్యమించిన వారిని కాంగ్రెస్‌ పార్టీ తుపాకీ కాల్పులతో బలితీసుకుందని, మలిదశ ఉద్యమంలో పదేండ్లు కాలయాపన చేసి యువతీ యువకుల ఆత్మబలిదానాలకు కారణమైన సోనియాగాందీని అప్పట్లో రేవంత్‌ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్‌ గుర్తు చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్‌ ఆరు నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రకటించిన జాబ్‌ కేలండర్‌ పచ్చి మోసమని, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండే 2024 మార్చి, ఏప్రిల్, మే నెలలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎలా సాధ్యమని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement