సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధిపై తనతో చర్చకు రావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీ, సచివాలయం, గాంధీ భవన్ ఎక్కడైనా సరే.. రేవంత్‌తో చర్చకు రెడీ అన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి నిరాశ, నిస్పృహతో ఉన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని రేవంత్‌కు అర్థమైంది. అందుకే నాపై రేవంత్ వ్యక్తిగత దూషణకు దిగాడు’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
‘‘ఓటమి తప్పదని భావించి.. రేవంత్ మాట్లాడుతున్నారు. ఆయన కంటే గట్టిగా మాట్లాడగలను. రేవంత్‌కు సమాధానం చెప్పే సత్తా ఉంది. కానీ కేసీఆర్ సూచనతోనే రేవంత్‌పై వ్యక్తిగత దూషణకు దిగటం లేదు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులను ప్రజలకు చెప్పమని కేసీఆర్ నాకు చెప్పారు. నన్ను వ్యక్తిగతంగా తిట్టిగా.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి రేవంత్‌ను గౌరవిస్తున్నా.. హైదరాబాద్, జూబ్లీహిల్స్ అభివృద్ధిపై రేవంత్ తో చర్చకు రెడీ. హోంశాఖను చూస్తున్న రేవంత్‌రెడ్డి హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయి. హైదరాబాద్‌లో గన్, డ్రగ్ కల్చర్ పెరిగింది.
..కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్.. చెత్త సిటీ, క్రైం సిటీగా మారింది.అండర్ పాస్‌లు, ప్లైఓవర్లు కేసీఆర్ హాయాంలోనే నిర్మించాం. కాంగ్రెస్ వచ్చాక ఎన్ని ఫ్లైఓవర్లు కట్టారో చెప్పాలి. పదేళ్లల్లో వంద లింకు రోడ్లు నిర్మించాం. కాంగ్రెస్ వచ్చాక ఒక గుంత కూడా పూడ్చలేదు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ మాదిరి రేవంత్ వ్యవహరిస్తున్నారు. సిటీలో మళ్లీ మంచి నీటి కష్టాలు తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. చెత్త సమస్య పరిష్కారానికి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. మెట్రో నిర్మించిన ఎల్‌అండ్‌టీని రేవంత్‌రెడ్డి.. బెదిరించి పంపించారు’’ అని కేటీఆర్ ఆరోపించారు.


