పవన్ కళ్యాణ్‌కు ఆ రూల్ వర్తించదా?! | KSR's Comments On Pawan Kalyan's Social Media Task Force | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్‌కు ఆ రూల్ వర్తించదా?!

Jul 6 2026 11:13 AM | Updated on Jul 6 2026 11:38 AM

KSR's Comments On Pawan Kalyan's Social Media Task Force

ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం వాక్ స్వాతంత్రం గురించి, పరిమితుల గురించి మంచి ప్రసంగమే చేశారు. అది ఆహ్వానించదగిందే. కాకపోతే అదే సమయంలో పవర్‌లో ఉన్నవారికి కూడా అపరిమితమైన అధికారాలు ఏమీ ఉండవు అన్న సంగతి కూడా చెప్పి ఉంటే ఆయన చేసిన వ్యాఖ్యలకు ఒక అర్థం, పరమార్థం కలిగేది. సోషల్ మీడియాలోనే కాదు.. ఏ మీడియాలో అయినా అసభ్యతకు తావు లేదు. అలాగే రాజకీయ నేతల ప్రకటనలలో కూడా అసత్యాలు, అభ్యంతరకర పదజాలం ఉండకూడదు. ఎవరైనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఇది ఏపీ ప్రజలను, ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిని బెదిరించినట్లు కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. చెప్పేటందుకే నీతులు అన్నట్లు నేతలు వ్యవహరించరాదు. పవన్ కళ్యాణ్ తనకు లేని అధికారాలను తీసుకుని సోషల్ మీడియాపై దాడి చేయబోతున్న సంకేతాలు ఇవ్వడం కూడా ప్రజాస్వామ్యబద్దం కాదు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై ఒక ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆయన అంటున్నారు. ఆధారసహితంగా ఫిర్యాదులు చేయవచ్చని ఆయన సూచించారు. ఇది ప్రభుత్వపరంగా చేస్తున్నారా? లేక పార్టీపరంగా చేస్తున్నారా? ఒక్క పవన్ కళ్యాణ్‌కే ఈ పవర్ ఉంటుందా.

మిగిలిన మంత్రులకు కూడా ఉంటుందా? మరి హోం మంత్రి బాధ్యత ఏమిటి? ముఖ్యమంత్రి ఏమి చేస్తారు? ఇలాంటివి ఏ మంత్రి అయినా ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం ఒక జీఓ ఇవ్వవలసిన అవసరం లేదా! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు అనుమతించారా? ఇప్పటికే ఇలాంటి విభాగాలు పోలీసు శాఖలో ఉన్నాయి. సైబర్ క్రైమ్‌కు ప్రత్యేక శాఖ ఉంది. అయినా ఫర్వాలేదు. పవన్ కళ్యాణ్ చిత్తశుద్దితో ఈ ప్రయత్నం చేస్తే స్వాగతించవచ్చు. కాని ఆయన చెబుతున్నదానికి, ఆచరిస్తున్నదానికి చాలా తేడా ఉంటున్నది. కేవలం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలనో, సోషల్ మీడియావారినో భయపెట్టే యత్నంగా కాకుండా, జనసేన, టీడీపీలతో సహా ఏ పార్టీవారు, లేదా ఏ యూట్యూబర్ అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పగలిగి ఉంటే దానికి ఒక విశ్వసనీయత వచ్చేది.

పవన్ కళ్యాణ్ ఇచ్చిన వీడియో ప్రసంగం చూశాక ఒక మాట అనిపిపిస్తుంది. నిజంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అనుభవించినంత స్వేచ్ఛ మరెవరికి దక్కలేదేమో అన్న భావన ఎవరికైనా కలగవచ్చు. పవన్ ఇప్పుడు చెబుతున్న సూక్తి ముక్కావళిని పరిగణనలోకి తీసుకుంటే, ఆ రోజుల్లో ఆయన చేసిన విన్యాసాలన్నిటిని ప్రజలు గుర్తు చేసుకుని, అధికారంలోకి వస్తే మాత్రం ఇలా ప్రశ్నించేవారిని భయపెట్టాలని చూస్తారా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను ప్రస్తావించి ప్రశ్నించే హక్కు ఉందని ఆయన స్పష్టం చేయడం మంచిదే. తమ నిర్ణయాలతో విబేదించే హక్కు కూడా ఉందని ఆయన గుర్తించడం బాగానే ఉంది. కాని ఒకరిని తిట్టడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను అవమానించడం, హింసను ప్రేరేపించడం స్వేచ్ఛ కిందకు రావని ఆయన అన్నారు. దీనిని ఎవరైనా అంగీకరిస్తారు. ఇదే సందర్భంలో పవన్‌కు పౌరులు పలు ప్రశ్నలు సందిస్తున్నారు. ఓ వారం, పది రోజుల క్రితమే కదా! వైఎస్సార్‌సీపీ వారిని ఉద్దేశించి గూండాలు, రౌడీలు అంటూ, తొక్కి నార తీస్తా అని పవన్ అన్నారు! మరి అవి వాక్ స్వాతంత్రం పరిధిలోకి వస్తాయా? రావా? అన్నదానిపై వివరణ ఇచ్చి ఉండాల్సింది కదా అని అడుగుతున్నారు.

తిరుమల లడ్డూలో జంతు కొవ్వు అంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు చంద్రబాబుకాని, పవన్‌ కాని ఎన్నడైనా చింతిస్తున్నట్లు ప్రకటన చేశారా? మరి అది వాక్ స్వాతంత్రం కిందే వస్తుందా? అధికారంలో ఉంటే ఏమి మాట్లాడినా, ఏమి చేసినా చెల్లుతుందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజి ఒక ఫ్రొఫెసర్‌ను ఉద్దేశించి ఎంత నీచమైన భాషను వాడినప్పుడు పవన్ కళ్యాణ్ మందలించి ఉండాల్సిందే. ఈ మద్యనే జగన్‌ను కూడా దూషించితే, పవన్ పరోక్షంగా సమర్థించినట్లు మాట్లాడారే. మహిళలను ఎవరైనా గౌరవించవలసిందే. అందులో రాజీ లేదు. కాని అదేదో ఒక పార్టీకి సంబంధించినంతవరకే కాదు కదా! మాజీ సీఎం జగన్ కుటుంబాన్ని, అలాగే వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు పలువురిని దూషిస్తూ టీడీపీ, జనసేనలకు చెందిన వారు పోస్టులు పెడుతుంటే పవన్ వారించి ఉంటే, ఇప్పుడు ఏ వ్యాఖ్య చేసినా ఆయనకు నైతికంగా మద్దతు వచ్చేది.

ఫ్రొఫెసర్ నాగేశ్వర్ ఎలాంటి అభ్యంతరకర భాషణ చేయకపోయినా ఆయనపైన, మరికొందరిపైన కేసు పెట్టిన జనసేన కార్యకర్తలను మందలించి ఉంటే పవన్ చెప్పే మాటలకు విలువ ఉండేది. విపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ఎన్నిరకాల దూషణలు చేసింది సోషల్ మీడియాలో వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి కదా! వాటిని గుర్తు చేస్తున్న యూట్యూబర్లను అరెస్టు చేస్తున్నారే. వారిపై జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారే! కక్ష కట్టి పోలీస్ స్టేషన్‌ల చుట్టూ రోజుల తరబడి తిప్పుతున్నారే! చంద్రబాబు పదే, పదే వైఎస్సార్‌సీపీని గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయడాన్ని పవన్ సమర్థిస్తారా?

హింసకు తావు లేదని అన్నారు. అది నిజమే. కాని వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపైన టీడీపీ కార్యకర్తలు దాడులు చేసినప్పుడు, అమరావతికి వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లరాదని చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నేతలు అంటున్నప్పుడు, టీడీపీ గూండాలు దాడి చేసి విధ్వంసానికి పాల్పడినప్పుడు అది రాజ్యాంగ విరుద్దం అని పవన్ కళ్యాణ్ మాట మాత్రం అనలేకపోయారే! విపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్టులో జనసేనకు చెందిన కొందరు అప్పటి మంత్రి రోజాపై పూలకుండీలతో దాడులు చేశారు. అప్పుడు ఎవరి పక్షాన పవన్ నిలబడింది అందరికి తెలిసిందే కదా! రోజాపై తీవ్రమైన అసభ్య భాష వాడిన టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిని అభినందించకుండా, మందలించి ఉంటే పవన్ నిబద్దతగా ఉన్నారని అంతా ఒప్పుకునే వారు కదా! జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాదితురాలికి కనీస సానుభూతి తెలిపి ఉంటే మహిళలకు  పవన్‌పై ఒక నమ్మకం ఏర్పడేది కదా! జనసేన నేత ఒకరు నడిరోడ్డుపై  పోలీసుల లాఠీ తీసుకుని ఆ మహిళను కొట్టినప్పుడు అది అరాచకం అని ఖండించి, చర్య తీసుకుని ఉంటే పవన్ ఇప్పుడు ఏమి చెప్పినా జనం అంతా అర్థం చేసుకునేవారు కదా! సుగాలి ప్రీతి తల్లిని జనసేన కార్యకర్తలు దూషిస్తున్న తీరుపై చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయంపై పవన్ స్పందించాలి కదా.

30వేల మంది మహిళలు మిస్ అయ్యారని అంటూ వలంటీర్లపై ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు చూపి ఉండాల్సిందే! రాష్ట్ర అప్పులపై పది నుంచి 14 లక్షల కోట్ల అప్పు అంటూ చేసిన అసత్య ప్రచారం గురించి ఏమంటారు? ఇలాంటివి ఎన్నో ఉన్నాయే! అయినా  అప్పట్లో ఆయనపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టలేదు. ఆ రకంగా స్వేచ్ఛగా ఏది పడితే అది టీడీపీ, జనసేన నేతలు మాట్లాడేవారు.

నేరాలకు కులం లేదని చెబుతున్నప్పుడు అదే సూత్రం పోలీసు అధికారులు చేసే నేరాలకు కూడా వర్తిస్తుందన్న సంగతి మర్చిపోకూడదు. వారు చేసే అకృత్యాలకు మద్దతు ఇచ్చేలా అధికారంలో ఉన్నవారు మాట్లాడడం ఏ రకంగా రాజ్యాంగబద్దమో తెలియదు. రాజ్యాంగంలోని అధికరణాలతో పాటు తాను గత పదేళ్లుగా ఎలా పాటిస్తున్నది, ఇకపై ఎలా ఉండబోతున్నది చెప్పి ఉంటే సరైన పద్దతి అనిపించేదేమో! పోనీ ఇంతవరకు జరిగిన వాటిలో పొరపాట్లు ఉంటే చింతిస్తున్నానని చెబుతూ, ఇకపై తన వైపు నుంచి ఎలాంటి తప్పులు జరగవని, అధికారాన్ని దుర్వినియోగం చేయనని, తప్పుడు కేసులు ప్రభుత్వం పెట్టినా ఒప్పుకోనని చెప్పి ఉంటే పవన్‌ను గ్రేట్ అని అంతా అని ఉండేవారు కదా!

ఒక వైపు కీలక మంత్రి లోకేష్ రెడ్ బుక్ పేరుతో అరాచాకాలు సాగుతుంటే, వాటి గురించి ఒక్క మాట చెప్పడం లేదు. మరోవైపు ఆయనకు పోటీగా సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్ పెడతానని పవన్ బెదిరిస్తున్నారు. స్థూలంగా చూస్తే పవన్ కళ్యాణ్ పౌరుల హక్కులను రక్షిస్తానని చెబుతున్నారా? లేక ఏదో సాకుతో వారిని భయపెడుతున్నారా?


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement