‘ఊరు మారినా ఉనికి మారునా’ అని ఓ సినీకవి అన్నాడు కానీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని.. ‘పేరు మారినా ఖ్యాతి పోవునా’ అని పాడుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను, ప్రజాసేవకు ఏర్పాటు చేసిన విస్తృత వ్యవస్థల పేర్లు మార్చి సంబరపడుతోంది టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం. ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయంతో వాటిని కొనసాగిస్తున్నప్పటికీ ఎక్కడ జగన్ పేరు జన హృదయాల్లో నిలిచిపోతుందో అన్న భయంతో పథకాల పేర్లు మార్చేసి కూటమి ప్రభుత్వం ఆత్మ వంచన చేసుకుంటోంది.
తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను విజన్ యూనిట్లుగా మార్చాలని చంద్రబాబు ప్రతిపాదించారు. ముందుగా స్వర్ణాంధ్ర కేంద్రాలుగా నామకరణం చేయాలని అనుకున్నప్పటికీ ఎందువల్లో విజన్ యూనిట్ పేరుకు పరిమితమయ్యారు. ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్ రూపొందిస్తామని, సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలని చంద్రబాబు అధికారుల సమావేశంలో తెలిపారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పించాలని కూడా ఆయన అన్నారు. విజన్ పేరుతో ప్రజలను భ్రమల్లో ఉంచడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఒకప్పుడు విజన్ 2020. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒకటి. అంతే తేడా!
ఈ మధ్య ఒక రోజు మంత్రి లోకేశ్ టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళితే అక్కడ నాలుగువేల మంది క్యూ కనిపించిందట. కొన్ని గంటల వ్యవధిలోనే లోకేశ్ వారి నుంచి వినతిపత్రాలు తీసుకున్నారట. ప్రభుత్వం ప్రజల వద్దకు వెళుతుంటే, వారి సమస్యలు తీరుతుంటే ఈ స్థాయిలో జనం పార్టీ ఆఫీస్‌కు వెళ్లి వినతులు సమర్పించుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది?. ఎల్లో మీడియా లోకేశ్‌కు ఎలివేషన్ ఇచ్చే క్రమంలో ఈ వార్తను రాసింది. కానీ, అది తిరగబడినట్లు వ్యంగ్యంగా వ్యాఖ్యలు వచ్చాయి. నిజానికి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ సేవలు ప్రజల ఇళ్ల వద్ద అందించడం కోసం వలంటీర్ల వ్యవస్థను తెచ్చారు. ఈ వ్యవస్థ పనితీరుపై సర్వత్రా ప్రశంసలూ వ్యక్తమయ్యాయి. కానీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఆది నుంచి ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగానే మాట్లాడారు. వలంటీర్లను మూటలు మోసేవారని, మగవారు ఇళ్లల్లో లేనప్పుడు తలుపులు కొట్టే వారని చంద్రబాబు నానా మాటలూ అన్నారు. పవన్ కూడా వలంటీర్లను మహిళలను కిడ్నాప్ చేసే వారితో పోల్చడం తెలిసిందే.
అయితే.. ప్రజల్లో వలంటీర్ వ్యవస్థపై ఉన్న భరోసా, నమ్మకాలను గమనించిన తరువాత ఎన్నికల సమయంలో తామూ ఈ వ్యవస్థలను కొనసాగిస్తామని నమ్మబలికారు. అంతటితో ఆగకుండా.. వలంటీర్ల గౌరవ వేతనాలను రెట్టింపు చేస్తామని హామీలు గుప్పించారు కానీ అధికారం వచ్చిన తరువాత మాత్రం తూచ్ అనేశారు! రైతు భరోసా కేంద్రాల పేర్లను కూడా రైతు సేవా కేంద్రాలుగా మార్చిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై గతంలో తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు. అంతమంది ఉద్యోగుల నియామకం ఏమిటని ధ్వజమెత్తారు. కానీ, ఇవి ప్రజా సేవలకు అత్యంత కీలకంగా మారిపోవడం, రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయం మాదిరిగా గ్రామాలకు, వార్డులకు ఇవి అని ప్రజలు గుర్తించారు.
సచివాలయాలన్నిటికి జగన్ శాశ్వత భవనాలు ఏర్పాటు చేశారు. వివిధ శాఖలకు చెందిన సుమారు 1.30 లక్షల మంది ఉద్యోగులను ఏకకాలంలో నియమించి రికార్డు సృష్టించారు. తుపాన్ల వంటి విపత్కర పరిస్థితుల్లో ఈ వ్యవస్థలు సహాయ కార్యక్రమాల అమల్లో చురుకుగా పాల్గొని ప్రజల ప్రశంసలు పొందాయి కూడా. ఈ నేపథ్యంలో వీటిని ఎత్తి వేయలేమన్న అభిప్రాయానికి వచ్చిన చంద్రబాబు సర్కార్ క్రెడిట్ జగన్‌కు దక్కరాదన్న అక్కసుతో కొత్త పేరు పెట్టే ప్రయత్నం చేస్తోంది. తద్వారా క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్నారన్నమాట. అయితే ఈ విజన్ యూనిట్లకు వేరే బాధ్యతలు అప్పగిస్తారో, లేక జగన్ టైమ్‌లో మాదిరి సేవలు అందించేలా చూస్తారో చెప్పలేం.
స్కీముల కాపీలో టీడీపీకు ఘనమైన ట్రాక్ రికార్డే ఉంది. 2019 ఎన్నికల సమయంలో జగన్ రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ.13,500 ఇస్తామని ప్రకటించి విజయవంతంగా అమలు చేయగా చంద్రబాబు అండ్ కో 2024లో దీన్నే ‘అన్నదాతా సుఖీభవ’ అని నామకరణం చేసింది. ఎక్కువ మొత్తానికి హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చిన తరువాత ఎగవేశారన్నది వేరే సంగతి. ఇంటికో విద్యార్థికి రూ.15 వేల ఆర్థిక సాయాన్ని జగన్ ‘అమ్మ ఒడి’ ద్వారా అందిస్తే.. ఇంట్లో ఉన్న విద్యార్థులందరికీ ‘తల్లికి వందనం’ పేరుతో తామూ ఇస్తామని కూటమి ప్రకటించింది. తొలి ఏడాది ఎగవేసి రెండో ఏట అరకొరగా అమలు చేసి మమ అనిపించింది. అలాగే జగన్ రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల (31 లక్షల పేదలకు ఇళ్లస్థలాలివ్వడమే కాకుండా.. నిర్మాణమూ చేపట్టిన భారీ కార్యక్రమం) పేరును కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ నగర్‌లుగా మార్చింది. ‘జగనన్న గోరుముద్ద’ కాస్తా ఇప్పుడు మధ్యాహ్న భోజనమైంది. విద్యా కానుక విద్యార్థి మిత్రగా మారితే పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేసేందుకు జగన్ చేపట్టిన ‘నాడు-నేడు’ ఇప్పుడు ఏస్థితిలో ఉందో ఎవరికీ తెలియదు. పేరును మాత్రం ‘మనబడి -మన భవిష్యత్తు’ అని పెట్టేశారు. వాహనమిత్రను ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అని, ‘మత్యకార భరోసా’ని ‘మత్స్యకారుల సేవలో’ అని మార్చేశారు.
మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం దిశ యాప్‌ను తీసుకువస్తే దానిని శక్తి యాప్‌గా మార్చారు. వైఎస్ఆర్ పేరుతో ఉన్న ఆరోగ్యశ్రీ స్కీమ్‌ను ఎన్టీఆర్ వైద్యసేవగా ఛేంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలలో అమలు చేసిన మహిళల ఉచిత బస్ స్కీమ్‌ను కూటమి తన ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. ఆడబిడ్డ నిధి కూడా కాపీ స్కీమే. అయినా అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మాదిరే ఏపీలో కూడా చంద్రబాబు సర్కార్ అమలు చేయలేకపోయింది. చంద్రబాబు తన ఇన్నేళ్ల పదవీ కాలంలో ఎందుకు ఇలాంటివి తీసుకు రాలేకపోయారంటే సమాధానం ఉండదు. ఒకప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇస్తే, అలా చేస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరవేసుకోవల్సిందేనని చంద్రబాబు అనేవారు. తదుపరి ప్రభుత్వంలోకి వచ్చిన వైఎస్ఆర్ ఉచిత విద్యుత్తును అమలు చేసి చూపించారు. దాంతో అదంతా తమ సంస్కరణల వల్లే సాధ్యమైందని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు.
గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వేని తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నేతలు, తమ ప్రభుత్వంలో దానినే కొనసాగిస్తుండడం విశేషం. జగన్ తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తామే తెచ్చామన్నట్లుగా పిక్చర్ ఇవ్వడం, వాటిని ప్రైవేటు వారికి అప్పగించడం ద్వారా జగన్‌కు క్రెడిట్ రాకుండా చేయాలని చూడడం, విశాఖలో అదాని డేటా సెంటర్ కు జగన్ అంకురార్పణ చేస్తే, దానిని మర్చిపోవడం కోసం వ్యూహం అమలు చేయడం వంటివి కూడా చెప్పుకోదగినవే. ఏది ఏమైనా చంద్రబాబు తనకు ఇష్టం లేకపోయినా, సచివాలయాలను కొనసాగిస్తుండడం ద్వారా జగన్ తెచ్చింది మంచి వ్యవస్థ అని, జగన్‌కే విజన్ ఉందని ఒప్పుకున్నట్టు అయ్యింది. వారు భావిస్తున్నట్లుగా సచివాలయాల పేరు మార్చినా, జగన్ ప్రభుత్వం నిర్మించిన భవనాలు జనానికి కనిపించవా? జగన్ పేరు గుర్తుకు రాకుండా ఉంటుందా?.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


