
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల కష్టం చూస్తే జాలేస్తుంది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ప్రమోషన్ కోసం వారు చాలా కష్టపడుతున్నారు. ఇంకోలా చెప్పాలంటే సినిమా చూడాలని ప్రేక్షకులను బతిమలాడుతున్నట్లు ఉంది. కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక షోలు నిర్వహించి జనాన్ని తరలించే యత్నాలు చేయడం, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సినిమా సక్సెస్ చేయాలని కోరడం పవన్ కల్యాణ్‌కు సహజంగానే అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. సినిమాపై ప్రేక్షకుల ఆదరణ విషయంలో సందేహాలు కలిగాయి. మొత్తం పరిణామ క్రమం అంతా పార్టీని డ్యామేజీ చేశాయనిపిస్తోంది.
సినిమా బాగుందా? లేదా? అనేదానితో ఇక్కడ నిమిత్తం లేదు. మొదటి వారం కలెక్షన్లు ఎలా ఉన్నాయా? అనేది చర్చనీయాంశం కాదు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఈ సినిమా కోసం అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. బాగా బిజీగా ఉండే పంచాయతీ రాజ్ శాఖకు మంత్రి అయినప్పటికీ, ఆ విధులను పక్కనబెట్టి సినిమా షూటింగ్‌లలో పాల్గొనడాన్ని ప్రజలు గమనించారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ కుమార్ వంటివారు చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ ఏ రకంగా పవన్ తన పదవిని ఈ సినిమా గురించి వాడుకున్నారో తెలియచేస్తూ వీడియోలు విడుదల చేశారు. పవన్ తాను గతంలో ఎప్పుడూ సినిమా విడుదల సందర్భంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొనలేదని చెప్పారు. కాని హరిహర వీరమల్లు కోసం నాలుగు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. దీన్ని బట్టి ఈ సినిమా సక్సెస్ కోసం పవన్‌తోపాటు పార్టీ నేతలంతా కష్టపడాలని నిర్ణయించుకున్నారు అన్నమాట. అయినా..
సినిమా ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదని అంటున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫంక్షన్ కోసం విశాఖలో యూనివర్శిటీ హాల్‌ను వాడుకోవడం కూడా చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో సినిమాల్లో నటించవచ్చా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నటించకూడదన్న చట్టం ఏమీ లేదు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఒకట్రెండు సినిమాలలో నటించారు. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నటించిన సినిమా ఫెయిల్ అయితే, విపక్షంలో ఉన్నప్పుడు నటించిన సినిమా సఫలమైంది. ఎన్టీఆర్ సినిమాలలో నటించడంపై ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసేది. టీడీపీ కూడా ఏదో సమాధానం చెప్పేది. అంతే తప్ప ఏ పార్టీ అదేదో వ్యక్తిగత వివాదంగా తీసుకోలేదు. కానీ..
పవన్ కల్యాణ్ ఎప్పుడైతే తన సినిమా గొడవలోకి వైఎస్సార్‌సీపీని లాగి విమర్శలు చేశారో, అప్పుడు ఇది రాజకీయ రగడగా మారింది. సినిమాను బాయ్‌కాట్ చేసుకోండని ఒకసారి, ఎవరూ దీనిపై గొడవ పడవద్దని ఇంకోసారి, అవసరమైతే దాడి చేయండని మరోసారి ఇలా రకరకాల ప్రకటనలు చేశారు. తణుకు వంటి కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు రౌడీల మాదిరి అల్లరి చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు చెందిన వాహనం బాయినెట్ పై ఎక్కి గంతులు వేశారు. వీటిపై అసంతృప్తి చెందిన వైసీపీ అనుకూల సోషల్ మీడియా సీరియస్‌గా తీసుకున్నారు. కొందరు బాయ్‌కాట్ అంటూ ప్రచారం చేశారు. అయినా సినిమా బాగుంటే ఇలాంటివి పెద్దగా పనిచేయవని అంతా భావించారు.
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పవన్ కళ్యాణ్ మరీ రెచ్చగొట్టడం విస్మయం కలిగిస్తుంది. బహుశా వైసీపీ వారు ఎటూ చూడరులే అన్న భావనతో జనసేన, టీడీపీ క్యాడర్‌ను బాగా యాక్టివ్ చేసేందుకు ఈ వ్యూహం అనుసరించారో, ఇంకే కారణమో తెలియదు కాని ఒక రాజకీయ పార్టీ క్యాడర్‌ను తన సినిమాకు తానే దూరం చేసుకున్నట్లయింది. సినిమా పరంగా తనను అభిమానించే వారు ఇతర పార్టీల్లోనూ ఉంటారన్న సాధారణ స్పృహ లేకుండా ఆయన మాట్లాడారు. ఇప్పుడే కాదు.
గతంలో కొన్ని సినిమాల విడుదల సందర్భంగా జరిగిన ఫంక్షన్లలో పవన్ కల్యాణ్ అతడి వర్గీయులు కొందరు సినీ ప్రముఖులు అనవసర రాజకీయ వ్యాఖ్యలు చేశారు.. ఉదాహరణకు రిపబ్లిక్, మట్కా, లైలా, భైరవం వంటి సినిమా ఫంక్షన్లలో పవన్ కల్యాణ్.. ఆయన మనుషులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేశారు. ఆ ప్రభావం సినిమాలపై పడి నిర్మాతలు నష్టపోయే పరిస్థితి వచ్చిందని చెబుతారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ నాయకత్వం ముందుగానే ఈ పరిణామాలను ఊహించి కార్యకర్తలతో సినిమా చూడాలని కోరుతూ ర్యాలీలు తీయించింది. ఇలాంటివి గతంలో జరగలేదనే చెప్పాలి.
జనసేన మంత్రులు టెలికాన్ఫరెన్స్ పెట్టి సినిమాకు జనాన్ని ఎలా తరలించాలో చెప్పడం, సంబంధిత ఆడియో లీక్ అవడంతో పార్టీ పరువు పోవడమే కాకుండా, సినిమాపై కూడా నెగిటివ్ టాక్‌కు అవకాశం ఏర్పడింది. సినిమా బాగుంటే ఇలా ఎందుకు చేస్తారన్న ప్రశ్న వచ్చింది. దానికి తగినట్లే సినిమా రివ్యూలు కూడా ఆశాజనకంగా రాలేదు. సినిమా మొదటి సగం కాస్త ఫర్వాలేదు కాని, రెండో హాఫ్ ఏవో ఒకటి, రెండు చోట్ల తప్ప, అసలు బాగోలేదని టాక్ వచ్చింది. అంతేకాక ఒకసారి ఇది చరిత్ర అని, మరోసారి ఇది కల్పిత పాత్ర అని ప్రచారం చేశారు. కోహినూర్ వజ్రం పేరుతో సినిమా తీసినా, ఇందులో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సన్నివేశాలు పెట్టడంపై పలువురు ఆక్షేపించారు.
ఒకవైపు సినిమా కథ అంతంత మాత్రంగా ఉండడం, ప్రేక్షకులకు గ్రాఫిక్స్ నచ్చకపోవడం, రాజకీయ దుమారం సృష్టించుకోవడం వంటి కారణాలతో హరిహర వీరమల్లు సినిమా అంతగా సక్సెస్ కాలేదన్న భావన ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించి వైసీపీ అభిమానులలో ఒక స్పష్టత ఉండగా, టీడీపీ అభిమానులు మాత్రం దాగుడుమూతలు అడినట్లు అనిపిస్తుంది. నిజంగా టీడీపీ క్యాడర్ అంతా సినిమా చూసి ఉంటే ఈ సినిమా ఇలా ఫెయిల్ అయ్యేది కాదన్న అభిప్రాయం లేకపోలేదు. పైకి శుభాకాంక్షలు చెబుతూ, లోపల మాత్రం సినిమా ఇలా దెబ్బతినడంపై సంతోషం ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి.
జనసేన ర్యాలీలలో టీడీపీ వారు పెద్దగా పాల్గొన్నట్లు కనిపించలేదు. పవన్ సినిమా సక్సెస్ కాకపోతేనే ఆయన టీడీపీని ధిక్కరించకుండా ఉంటారని ఆ పార్టీ వారు భావించి ఉండవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రకంగా అటు వైసీపీని దూరం చేసుకుని, ఇటు టీడీపీ నుంచి సరైన ఆదరణ పొందలేకపోవడంతో పాటు స్వయంకృతాపరాధాల కారణంగా ఈ సినిమా నష్టపోయి ఉండవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇకనైనా రాజకీయాలు వేరు..సినిమాలు వేరు అనే సూత్రాన్ని వపన్ చిత్తశుద్దితో పాటిస్తే మంచిదేమో!.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత