సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఎక్కడకు వెళ్ళినా జగన్ నామస్మరణే చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దావోస్ వెళ్లినా చంద్రబాబు జగన్ భజనే చేస్తున్నారన్నారు. బాబు ప్రభుత్వంలో ల్యాండ్, మైనింగ్ మాఫియాలు పెరిగిపోయాయని.. సంక్రాంతి వేడుకల్లో లిక్కర్ మాఫియా రెచ్చి పోయిందని కొరుముట్ల మండిపడ్డారు.
‘‘ప్రభుత్వం పది రూపాయలు పెంచగా, లిక్కర్ మాఫియా మరో రూ.60 పెంచి దోపిడీ చేశారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి లిక్కర్ అమ్మకాలు చేశారు. మందా సాల్మన్ హత్యతో దేశమే ఉలిక్కి పడింది. వైఎస్ జగన్‌కు ఓటేశారని పిన్నెల్లి గ్రామం నుంచి 15 వందల కుటుంబాలను బహిష్కరించారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి ఏం చేస్తున్నారు?. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వం విఫలమైంది. గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. చంద్రబాబు తన బినామీలకు వేల కోట్ల విలువైన భూములను దోచి పెడుతున్నారు’’ అని కోరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు.


