మిత్ర ధర్మాన్ని విస్మరించిన రాజకీయాలివి! | Kommneni Srinivasa Rao Comments On Political Alliances In Telugu States, Details Inside - Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో.. మిత్ర ధర్మాన్ని విస్మరించిన రాజకీయాలివి!

Nov 15 2023 4:41 PM | Updated on Nov 15 2023 5:25 PM

kommneni Comments On Political Alliances In Telugu States  - Sakshi

దాసరి, మోహన్ బాబుల సినిమా క్లైమాక్స్‌లో  ఎవరికి ఏమవుతారో అర్థంకానీ.. 

తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీల మధ్య అక్రమ సంబంధాలనండి.. ప్రత్యక్ష,పరోక్ష పొత్తులు అనండి.. వాటన్నింటిని చూస్తుంటే రాజకీయాలలో కూడా వావి వరసలు లేకుండా ఇలాంటివి జరుగుతాయా? అనే అనుమానం సహజంగానే వస్తుంది. ఈ విషయంలో తెలుగుదేశం, జనసేనలది ప్రత్యేకమైన రికార్డు అని చెప్పాలి.

కేంద్రంలోని ఎన్టీయే కూటమిలో భాగస్వామి అయిన జనసేన.. ఏపీలో బీజేపీతో కాపురం చేయనని చెప్పి టీడీపీ గూటికి వెళ్లిపోయింది. అయినా బీజేపీ పెద్దగా పీల్ కాదు. అదే జనసేన తెలంగాణలో టీడీపీతో కాకుండా బీజేపీతో స్నేహంలో ఉంది. మరి టీడీపీనేమో తెలంగాణలో తన మిత్ర పక్షమైన జనసేనకు మద్దతు ఇవ్వకుండా.. కాంగ్రెస్‌కు పరోక్ష సహకారం ఇస్తోంది. ఆ పార్టీవారు కాంగ్రెస్ ర్యాలీలలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ వాళ్లు టీడీపీ కండువాలు కప్పుకుని తిరుగుతున్నారు. ఏపీలో వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్.. అన్నీ కలిసి ఏదో రకంగా పనిచేస్తుంటాయి.

తెలంగాణలో కాంగ్రెస్,బీజేపీలు ప్రత్యర్ధులు. తమకు టీడీపీ తెలంగాణలో మద్దతు ఇవ్వకపోయినా.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు టీడీపీకి సపోర్టుగా ప్రకటనలు చేస్తుంటారు. సీపీఐ తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తులో ఉంది. అంతకుముందు బీఆర్‌ఎస్‌తో స్నేహం చేసి.. ‘బీజేపీని ఎదిరించే మొనగాడు కేసీఆర్‌’ అని ప్రకటించింది. కాని ఇప్పుడు కాంగ్రెస్తో కలవగానే.. కేసీఆర్‌ బీజేపీకి లొంగిపోయారని అంటోంది.

✍️ఇక చంద్రబాబు  అవినీతి కేసులో అరెస్టు అయి జైలుకు వెళితే.. పై పార్టీలన్నీ ఆయనకు మద్దతు ప్రకటించి.. అవినీతి కొమ్ము కాయడానికి వెనుకాడడం లేదు. అంతా ఓట్ల మహిమ. ఇందులో బీఆర్‌ఎస్‌కు  కూడా మినహాయింపు కాదు. బీజేపీతో తెలుగుదేశం పార్టీకి మైత్రి లేదు. కొంతకాలం క్రితం ఆ పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ అటు ఎన్డీయేకి, ఇటు ఇండియా కూటమికి సమదూరం అని అన్నారు. కాని అదే సమయంలో ఏపీలో బీజేపీ ప్రాపకం సంపాదించడానికి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ను రాయబారిగా పెట్టుకుని కథ నడుపుతున్నారు.

✍️మరో వైపు బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించడంతో, దగ్గుబాటి కుటుంబంతో చంద్రబాబు రాజీపడి.. ఆమె ద్వారా కూడా పావులు కదుపుతున్నారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు లోకేష్ను స్వయంగా వెంటబెట్టుకుని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలవడం, అంతకుముందు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ జరిగినప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో సహా దగ్గుబాటి కుటుంబం అంతా చంద్రబాబుతో కలసి కూర్చోవడం వంటివి జరిగాయి. అక్కడితో ఆగకుండా,ఈ మధ్యకాలంలో పురందేశ్వరి ఏపీలో భారతీయ జనతా పార్టీ ప్రయోజనాల కన్నా టీడీపీకే రాజకీయంగా మేలు చేయడానికే తంటాలు పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీ వాళ్లు మీడియా సమావేశాలలో చెప్పినవాటిని తిరిగి ఆమె ద్వారా పలికిస్తున్నారు. లేఖలు రాయిస్తున్నారు. దీంతో చంద్రబాబు, పవన్లతో పురందేశ్వరి రాజకీయంగా జట్టు కట్టాలన్న అభిలాషతో ఉన్నారన్న భావన కలుగుతోంది.

✍️అది ఏమవుతుందో కాని.. ఈలోగా తెలంగాణ శాసనసభ ఎన్నికలు రావడం వారికి కొంత సమస్యగా మారినట్లు కనబడుతోంది. తెలంగాణలో తన శిష్యుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండడంతో ఆ పార్టీకి  మద్దతు ఇవ్వడం కోసం చంద్రబాబు ఏకంగా పార్టీ పోటీ చేయబోవడం లేదని ప్రకటించేశారు.అదే సమయంలో నేరుగా కాంగ్రెస్ ను సపోర్టు చేస్తున్నట్లు చెప్పకుండా కాస్త జాగ్రత్తపడ్డారు. పరోక్షంగా కాంగ్రెస్కు అనుకూలంగా సంకేతాలు పంపించారు. దానికి అనుగుణంగా కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ ర్యాలీలో టీడీపీ కార్యకర్తలు ,నేతలు కొందరు పచ్చ జెండాలతో పాల్గొన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి చేరినప్పటికీ టీడీపీ కండువా వేసుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాను చంద్రబాబుతో సంబంధ బాంధవ్యాలు వదలుకో లేదని అంటున్నారు. ఇవన్నీ మీడియాలో ప్రముఖంగానే వచ్చాయి. అయినా ఆశ్చర్యంగా బిజెపివాళ్లు కాని, జనసేనవాళ్లు కాని టీడీపీ అధినేత చంద్రబాబును దీనిపై నిలదీయడం లేదు. పైగా పురందేశ్వరి వంటివారు టీడీపీని భుజాన వేసుకుని మోస్తున్నారు. 

✍️జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అసలు దీనిగురించే పట్టనట్లు ఉంటున్నారు. తెలంగాణలో  బీజేపీతో సీట్ల సర్దుబాటు కుదరడానికి ఒకటి,రెండు రోజుల ముందు చంద్రబాబుతో భేటీ అయిన పవన్, తెలంగాణలో కనీసం తాము పోటీచేస్తున్న సీట్లలో అయినా మద్దతు ఇవ్వాలని ఆయనను కోరినట్లు కనిపించలేదు. ఆ మేరకు ఎలాంటి ప్రకటన రాలేదు.  బీజేపీ సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో పొత్తు ఉన్నందున తెలంగాణలో తమకు టీడీపీ మద్దతు ఇస్తుందిలే అనుకున్న జనసేన అభ్యర్ధులకు నిరాశే మిగిలింది. చంద్రబాబును ఎందుకు పవన్ కల్యాణ్‌ ఈ విషయంలో అడగలేదు?. ఇప్పటికే జనసేనను టీడీపీకి సరెండర్ చేశారన్న విమర్శలు ఎదుర్కుంటున్న పవన్, తెలంగాణలో ఒకరకంగా, ఏపీలో మరో రకంగా వ్యవహరించడం వల్ల రాజకీయ అక్రమ సంబంధం మరింతగా బహిర్గతమైనట్లయింది.

టీడీపీ తెలంగాణలో జనసేనకు మద్దతు ఇవ్వకపోతే.. అది మిత్రపక్షం ఎలా అవుతుందన్న ప్రశ్న వస్తుంది. పైగా కాంగ్రెస్ పార్టీకోసం ఎన్నికల గోదా నుంచి వైదొలగడం ద్వారా బీజేపీకి శత్రుపక్షంగా టీడీపీ ఉన్నప్పుడు జనసేన అలా చూస్తుందా? లేదా?.  తెలంగాణలో కేవలం ఎనిమిది చోట్ల మద్దతు ఇవ్వని టీడీపీ.. ఆంధ్రప్రదేశ్ లో జనసేనను కరివేపాకు మాదిరి వాడుకుని వదలివేయదని.. సీట్ల విషయంలో ఇబ్బంది పెట్టదని గ్యారంటీ ఏమి ఉంటుందన్న అనుమానం ఆ పార్టీ వర్గాలలో వస్తోంది.

✍️ఈ మధ్య ఒక చర్చా కార్యక్రమంలో జనసేన నేత ఒకరు మాట్లాడుతూ టీడీపీకి  గత ఎన్నికల్లో కూకట్‌పల్లిలో డెబ్బైవేల ఓట్లు వచ్చాయని, అలాగే అక్కడ కాపు సామాజికవర్గం ఓట్లు కూడ అరవైవేల వరకు ఉంటాయని.. కాబట్టి రెండు పార్టీలు కలిస్తే జనసేన తప్పనిసరిగా గెలుస్తుందని అంచనా వేశారు. అక్కడ టీడీపీ మద్దతు ఇవ్వకుంటే అది జనసేనను మోసం చేయడమే అవుతుందని.. అలాగే జనసేన పోటీచేస్తున్న నియోజకవర్గాలలో గణనీయంగా ఓట్లు రాకపోయినా టీడీపీ క్యాడర్ తమను చులకనగా చూడడమే అవుతుందని ఆయన అన్నారు. దాని ప్రభావం ఏపీ పొత్తు పై ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు.ఇక్కడ మరో విషయం చెబుతున్నారు. టీడీపీ ఎప్పుడైతే జాతీయ స్థాయిలో రెండు కూటములకు తాము సమదూరం అని చెప్పిందో.. అప్పుడే బిజెపికి ఒక క్లారిటీ వచ్చిందని!. ఆ నేపధ్యంలోనే జనసేనను తెలంగాణలో బరిలోకి తీసుకు వచ్చి బుక్ చేసిందని కొందరు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేనలు సమన్వయ కమిటీలు  ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్నప్పటికీ.. ఎన్నికల సమయానికి సమస్య ఎదురు కావచ్చని అంటున్నారు. ఎన్డీయేలో ఉంటూ తమను  కాదని టీడీపీ వైపు జనసేన  ఎలా వెళుతుంది? అని బీజేపీ  నేతలు సహజంగానే ప్రశ్నిస్తారు. కాకపోతే పురందేశ్వరి ఈ కూటమిపై ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా బీజేపీ పరువు తీస్తున్నారన్న భావన ఉన్నప్పటికీ.. రాష్ట్ర బిజెపి నేతలు ఏమి జరుగుతుందో చూద్దామనుకుని వేచి ఉన్నారని అంటున్నారు. ఒకవేళ అనూహ్యంగా ఆత్మ గౌరవాన్ని పక్కనబెట్టి  టీడీపీ, జనసేనలతో ఏపీలో బిజెపి కలిస్తే చెప్పలేం. కాని.. అలా కలవకపోతే ఆ కూటమి చిక్కుల్లో పడవచ్చని భావిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండవచ్చని వారు అనుకుంటున్నారు.

✍️మొత్తం మీద టీడీపీ తెలంగాణలో శత్రుకూటమికి పరోక్షంగా.. కొన్ని చోట్ల ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నా జనసేన ఆ పార్టీని  మిత్రపక్షంగానే పరిగణిస్తే పవన్ కల్యాణ్ దైన్య పరిస్థితి అర్ధం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వీటన్నింటిని పరిశీలిస్తే ఒక సినిమా గుర్తుకు వస్తుంది. ఎప్పుడో  దాసరి నారాయణరావు, మోహన్ బాబులు నటించిన తూర్పు -పడమర  సినిమాలో తండ్రీకొడుకులు, తల్లీకూతుళ్ల ప్రేమ వ్యవహారాలతో  ఎవరు, ఎవరికి ఏమవుతారో అర్ధం కాక తలపట్టుకోవడంతో సినిమా ముగుస్తుంది. ప్రస్తుతం రాజకీయ పక్షాల తీరు కూడా అలాగే ఉందంటారా!


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement