టీడీపీ గేమ్‌ ప్లాన్‌.. పవన్‌ కళ్యాణ్‌ కొత్త వేషం | Kommineni Comments On Chandrababu Nara Lokesh And Pawan | Sakshi
Sakshi News home page

టీడీపీ గేమ్‌ ప్లాన్‌.. పవన్‌ కళ్యాణ్‌ కొత్త వేషం

Jun 11 2026 4:22 PM | Updated on Jun 11 2026 4:41 PM

Kommineni Comments On Chandrababu Nara Lokesh And Pawan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త దళాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా ఉంది. జెన్‌-జీ ఆశయాలకు అనుగుణంగా గొంతు వినిపింంచేదుకు సేనా గళంను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం ఒక కమిటీని కూడా వేస్తున్నట్లు తెలిపారు. ఆయన చిత్తశుద్ధితో ఈ ప్రకటన చేసి ఉంటే స్వాగతించవలసిందే. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్‌లు కూడా జెన్‌-జీ అంటూ మాట్లాడి వారి ఆశయాలకంటే ఎక్కువే పనిచేస్తున్నామని తమకు తామే   సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు.

ఒక వైపు ఏపీలో ప్రశ్నించే గొంతుకలే లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ, మరో వైపు జెన్‌-జీలో కలిసిపోయే వ్యూహంలోకి టీడీపీ, జనసేన నేతలు వెళుతున్నట్లు అనిపిస్తుంది. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దేశంలో సంచలనం సృష్టించిన క్రాకోచ్ జనతా పార్టీ పరిణామాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆయనకు తెలిసి అన్నారో, తెలియక అన్నారో కాని, తదుపరి చంద్రబాబు దాని జోలికి వెళ్లలేదు. కాని వ్యూహాత్మకంగా జెన్-జీ భాషను వినియోగించుకోవడం ఆరంభించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో వెళుతున్నారా? లేక చిత్తశుద్దితో చేస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.

నేపాల్‌లో కొంతకాలం క్రితం జెన్‌-జీ పేరుతో పెద్ద విప్లవమే వచ్చింది. యువత వీధులలోకి వచ్చి పెద్ద ఎత్తున  గళం విప్పారు. దానిని అణచివేయడానికి ఆనాటి ప్రభుత్వం కాల్పులవరకు వెళ్లింది. దాని ఫలితంగా పలువురు యువకులు మరణించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో పాలక పార్టీ పూర్తిగా తుడుచుకుపోయి కొత్త తరం నేతలు, కొత్త పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చేశారు. అనంతరం కాల్పులకు కారణమైన ఆనాటి నేపాల్‌ ప్రధాన మంత్రి, మంత్రులను జైళ్లకు పంపారు. ప్రభుత్వ అవినీతిపై పోరాడడానికి సోషల్ మీడియాను నేపాల్ యువత ఒక ఆయుధంగా మార్చుకుంది. దానిని తట్టుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫారంలను ప్రభుత్వం నిషేధించడంతో అది తీవ్ర నిరసనగా మారి ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది.

అప్పటి నుంచే  జెన్‌-జీ అన్నది బాగా పాపులర్ అయింది. గతంలో ఆయా వయసులను బట్టి తరాలు అనేవారు. కాని ఇప్పుడుమారిన సాంకేతిక యుగంలో, డిజిటల్ కాలంలో జన్ జడ్, జెన్ ఆల్ఫా, బీటా ఇలా పేర్లు పెడుతున్నారు. వాటన్నిటి లక్ష్యం ఒకటే. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సమాజంలోనూ, పాలన వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావడమే. ప్రధానంగా యువత సోషల్ మీడియాను వాడుతున్న తీరు, సెల్‌ఫోన్, టాబ్ వంటి సాంకేతిక పరికరాలపై గడుపుతున్న టైమ్ మొదలైనవాటిని పరిశీలించి ఈ పేర్లు  పెడుతున్నారు.

స్థూలంగా చెప్పాలంటే కొత్త తరం ఆకాంక్షలకు అనుగుణంగా  ప్రభుత్వాలు పనిచేయాలన్న సంకల్పం అన్నమాట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెన్‌-జీ ఆశయాల కోసం సేవాగళం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం వినడానికి అయితే బాగుంది. కాని ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నదేమిటి? ప్రశ్నించే గళాలను అణచివేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు అమలు చేస్తున్న రెడ్ బుక్ పర్వంపై పవన్ కళ్యాణ్ కాని, ఆయన పార్టీ వారు కాని ప్రశ్నించి ఉంటే కచ్చితంగా ఇలాంటి సేనా గళం ఏర్పాటుకు అర్హులు అవుతారు.

ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపైన దాడులే కాదు. తన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపై సాగుతున్న దాడులను పవన్ ప్రశ్నించలేకపోతున్నారు. అధికారానికి అలవాటు పడి, జనసేన వారు  సైతం అలాంటి దాడులను భరించాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులో ఒక తెలివి ఉంది. అది దేశంలో లేదా, ఏదైనా విదేశంలో కొత్త మార్పు వస్తుంటే అది తనకు ప్రచారానికి ఉపయోగపడుతుందనుకుంటే వెంటనే అందులోకి వెళ్లి పోతుంటారు.

ఉదాహరణకు 2012 ప్రాంతంలో దేశంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఆధ్వర్యంలో ఒక ఉద్యమం వచ్చింది. అప్పట్లో దేశ వ్యాప్తంగా దానికి మద్దతు వచ్చింది. అంతే! చంద్రబాబు తెలివిగా తానూ అన్నాహజారేకి మద్దతు ఇస్తున్నానని చెప్పి హైదరాబాద్‌లోని తన పార్టీ ఆఫీస్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికే చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా ఆయన  ధైర్యంగా ఆ ర్యాలీ తీశారు.

దానిపై చంద్రబాబును ఎద్దేవా చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా పాపులర్ అయ్యాయి. ఏదైనా వ్యతిరేకత వచ్చే విషయం జరిగితే వెంటనే దానిని తన రాజకీయ ప్రత్యర్ధికి అంటగట్టేయడం కూడా చేస్తుంటారు. ఉదాహరణకు 2022 ప్రాంతంలో శ్రీలంకలో ప్రజలు తిరగబడి అధ్యక్ష భవనంలోకి కూడా దూసుకువెళ్లారు. ఆ దేశం అప్పుల కారణంగా దివాళా తీసినంత పనైంది. అంతే! చంద్రబాబు ఆ పరిస్థితిని అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వానికి రుద్దేశారు. ఏపీ శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేశారు. ఏపీ 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని అబద్దాన్ని సృష్టించారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా తబాలా వాయించేవి.

పవన్ కళ్యాణ్‌తో పాటు, బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి కూడా అదే దుష్ప్రచారం చేశారు. చిత్రమేమిటంటే ఉమ్మడి ఏపీకి తానే అత్యధిక కాలం సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత విభజిత ఏపీకి కూడా తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన టైమ్‌లో చేసిన అప్పుల్ని కూడా జగన్ ప్రభుత్వానికి అంటగట్టి పచ్చి అబద్దాన్ని జనంలోకి తీసుకువెళ్లే యత్నం చేశారు. ఇలా ఉంటుంది ఆయన ధోరణి. తన కుమారుడు లోకేష్‌కు కూడా అలాంటి ట్రైనింగే ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. 

ఈ నేపథ్యం ఏపీలో జెన్‌-జీ ఉద్యమం వస్తే అది ఎవరికి  వస్తుంది? కూటమి ప్రభుత్వంపైనే కదా! ఈ రెండేళ్లలో ఏపీలో జరిగినన్ని అరాచకాలు మరే  రాష్ట్రంలో జరగలేదు కదా! సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి పోలీసులను ప్రయోగిస్తున్నది కూటమి సర్కారే కదా! నేపాల్‌లో కూడా అలా చేయబట్టే  ప్రజలలో తిరుగుబాటు వచ్చింది. బహుశా ఆ భయంతోనే తెలివిగా తాము కూడా జెన్‌-జీ అంటూ మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్‌కు చిత్తశుద్ది ఉంటే, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించాలి.

ఉదాహరణకు డీఎస్సీకి సంబంధించి వచ్చిన అనేక వార్తలపై స్పందించి ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా! రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ హత్యల గురించి, టీడీపీ గూండాల దాడి గురించి మాట్లాడాలి కదా! జనసేన నేత ఇంటినే మచిలీపట్నంలో కూల్చితేనే కనీసం స్పందించలేదే! ఒక మహిళా నేత ప్రైవేటు వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రిని నిలదీయలేదే! అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తెచ్చి, దానిని దుర్వినియోగం చేస్తున్నారన్న  ఆరోపణపై పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసే సేనాగళం మాట్లాడుతుందా?

కేవలం పవన్ కళ్యాణ్ పై వచ్చే రాజకీయ విమర్శలకు మాత్రమే బదులు ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేస్తున్నారా? ఫ్రొఫెసర్‌ నాగేశ్వర్ చేసిన ఒక రాజకీయ విశ్లేషణపైనే కేసు  పెట్టిన జనసేన జెన్‌-జీ గురించి, సేనా గళం గురించి చెబుతుంటే విడ్డూరంగానే కనిపిస్తుంది. తెలంగాణలో పవన్ కొనుగోలు చేసినట్లు చెబుతున్న చెరువు భూమిపై వివరణ ఇచ్చి ఉండాల్సింది కదా! చంద్రబాబు, లోకేష్‌లు ఏదైనా మంచి పని చేస్తే పవన్  కీర్తించవచ్చు. కాని ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని మానేశారని కదా ఆ పార్టీవారు వాపోతున్నది.

కనుక ముందుగా పవన్ కళ్యాణ్ తన గురించి తానే ప్రశ్నించుకుని ఆ తర్వాత సేనాగళానికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగిస్తే సముచితంగా ఉంటుందేమో! లేకుంటే ఇది కూడా టీడీపీ గేమ్‌ ప్లాన్‌లో భాగమేనేమో అన్న అనుమానం వస్తుంది. ఏపీలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించేవారిని అణచివేయడానికి కొత్త వేషంలో వస్తున్నారేమో అన్న అభిప్రాయం కలగకుండా పవన్ సేనాగళం పనిచేస్తుందా!


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement