CBN: ఆర్థిక అరాచకం.. స్వయంకృతాపరాధం | Kommineni Srinivasa Rao Comments On Amaravati CAG Report Link Jagan Govt Arguments - Sakshi
Sakshi News home page

చంద్రబాబు స్వయంకృతాపరాధం.. ఆర్ధిక అరాచకంతో అమరావతి

Sep 28 2023 10:16 AM | Updated on Sep 28 2023 5:59 PM

Kommineni Comment ON Amaravati CAG Report Link Jagan Govt Arguments  - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి సంబంధించి కాగ్ ( కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ) ఇచ్చిన నివేదిక వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  సృష్టించిన ఆర్ధిక అరాచకమే అమరావతి అని అర్దం అవుతుంది. లక్షల కోట్ల రూపాయలు ఒకే చోట గుమ్మరించడంపై రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లోనే  వ్యతిరేకత వచ్చింది. దాని ఫలితమే 2019 శాసనసభ ఎన్నికలలో టీడీపీ ఘోర ఓటమి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన  ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం..  ఈ పరిస్థితిని మొత్తం సమీక్షించుకుని, జరిగిన అక్రమాలను గమనంలోకి తీసుకుని ఇక్కడే  లక్షల కోట్లు వ్యయం చేసి, మిగిలిన ప్రాంతానికి అన్యాయం చేయలేమని భావించింది. ఇదే పాయింట్‌ను కాగ్ కూడా వెల్లడిస్తూ.. గత ప్రభుత్వంలో  రాజధాని పేరుతో ఆర్ధిక అగాధాన్ని సృష్టించుకుంటున్నారని వ్యాఖ్యానించడం విశేషం.

అందుకే మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రస్తుత ప్రభుత్వం  తెరమీదకు తెచ్చింది. కానీ, దానిని ముందుకు సాగనివ్వకుండా ప్రతిపక్ష టీడీపీ న్యాయ వ్యవస్థ ద్వారా అడుగడుగునా అడ్డుపడింది. అయినా జగన్ పట్టు వీడక విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు దిశగా సాగుతున్నారు. అదే సమయంలో అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని తలపెట్టారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయంపై స్పష్టతతో ఉన్నప్పటికీ.. ఇంకా పలు అవరోధాలు అధిగమనించవలసి ఉంటుంది. జగన్ విశాఖను పాలన రాజధానిగా చేయాలని తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ కు కనీసం లక్ష కోట్ల రూపాయల ఆదా అయినట్లు లెక్కవేసుకోవచ్చు. అదెలాగంటే.. 

✍️టీడీపీ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం అయితే అమరావతి ప్రాంతంలో వివిధ మౌలిక సదుపాయాలకు లక్ష తొమ్మిదివేల కోట్లు అవసరమవుతాయి. ఇది తొలిదశకు మాత్రమే. ఆ మేరకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని  ఆనాటి సీఎం చంద్రబాబు లేఖ కూడా రాశారు.  కేంద్రం ఆ లేఖను పక్కన పెట్టేసింది.అప్పటికే  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,500 కోట్ల రూపాయల  డబ్బు ఎలా ఖర్చు పెట్టారో కూడా టీడీపీ ప్రభుత్వం వివరించలేదు. అప్పులు తెచ్చి తాత్కాలిక భవనాలు నిర్మించింది. బాండ్లు విడుదల చేసి వేల కోట్ల రూపాయలను వెచ్చించడానికి సన్నద్దమై సుమారు 33 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లు పిలిచింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో అప్పట్లో నిరసన వచ్చింది. కేవలం ఒక వర్గం ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇలా చేస్తున్నారని మెజార్టీ ప్రజలు భావించారు.ప్రజాభిప్రాయానికి తగినట్లే ఇప్పుడు కాగ్ నివేదికలోని అంశాలు ఉన్నాయని  అనిపిస్తుంది.

✍️అమరావతి రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వంపై  తీవ్రమైన ఆర్దిక భారం మోపుతుందని కాగ్ పేర్కొంది. రెండు దశాబ్దాల క్రితం దేశంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. అవి  జార్ఖండ్, చత్తీస్ గడ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు. వీటిలో ఎక్కడా ఈ రకంగా 55 వేల ఎకరాలలో రాజధాని ప్రతిపాదించలేదు. రైతుల నుంచి 33 వేల ఎకరాలను తీసుకోలేదు.కేవలం రాజధానికి అవసరమైన రెండువేలు లేదా మూడు వేల ఎకరాలలో మాత్రమే నిర్మాణాలు చేసుకున్నారు. మంచి నగరాన్ని ఎంపిక చేసుకుని పాలన సాగించారు తప్ప ఇలా కొత్త రాజధాని నగర నిర్మాణమే చేస్తామంటూ ఎవరూ ఎచ్చులకు పోలేదు. ఛత్తీస్‌గడ్ రాజధాని రాయపూర్ వద్ద నయారాయయపూర్ పేరిట తీసుకున్న భూమిలోనే పూర్తి స్థాయి నిర్మాణాలు జరగలేదట. అలాంటిది ఇక్కడ అమరావతిలో ఇన్నివేల ఎకరాల భూమిని తీసుకుని మొత్తం ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి చేసి, ధరలను హైప్ చేసి, ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడి, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లను తమకు కావల్సిన విధంగా మార్చుకుని ఓ భారీ స్కామ్ గా మార్చారు.

జగన్ వచ్చాక ఈ ప్రాంతంలో ఏదైనా కార్యక్రమం చేపడదామన్నా ఏదో రకంగా అడ్డుపుల్ల వేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఆందోళనలు, నిరసనల పేరుతో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగేలా టిడిపి వ్యవహరించింది.  సింగపూర్ కు చెందిన కొన్ని కంపెనీలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం  1600 ఎకరాలు కట్టబెట్టిన తీరు, ప్రభుత్వ వ్యయంతో వారి వెంచర్ కు రోడ్లు ,తదితర మౌలిక సదుపాయాల నిమిత్తం ఐదువేల కోట్లు వ్యయం చేయడానికి  చంద్రబాబు సిద్దపడ్డారు. సింగపూర్ లో మంత్రిగా పనిచేసిన ఈశ్వరన్ తో చంద్రబాబుకు ఉన్న సంబంధాలు ఏమిటో కాని, ఆయన ద్వారానే పలు లావాదేవీలు నడిపించే యత్నం చేశారు. తీరా చూస్తే ఈశ్వరన్ తాజాగా సింగపూర్ లో అవినీతి కేసులో చిక్కి అరెస్టు కావల్సి వచ్చింది.ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి. సింగపూర్ కంపెనీల పేరుతో సాగే ఇలాంటి కార్యకలాపాలన్ని ఆయా దేశాలకు నష్టదాయకమని కొన్ని అనుభవాలు చెబుతున్నాయి.

✍️ఉదాహరణకు చైనాలో షెంజెన్ అనే ప్రాంతంలో సింగపూర్ కంపెనీలు నిర్మించిన పారిశ్రామికవాడ పెద్ద వివాదంగా మారి,చివరికి చైనా ప్రభుత్వం వారిని అక్కడ నుంచి పంపించవలసి వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. రాధాని విషయంలో  కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సిఫారస్ లను గత టిడిపి ప్రభుత్వం పట్టించుకోని విషయాన్ని కూడా కాగ్ నివేదిక ప్రస్తావించింది.నిజానికి పలువురు నిపుణులు విజయవాడ,గుంటూరు మద్య పంట పొలాలలో రాజదాని నిర్మాణం చేయవద్దని స్పష్టంగా చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. తనకు కావల్సిన వ్యాపారవేత్తలతో,రాజకీయనేతలతో  ఒక కమిటీని వేసుకుని తాను అనుకున్నదే జరిగేలా ప్రయత్నించారు. ఇక్కడ భూమి భారీ నిర్మాణాలకు అనువైనది కాదని తెలిసినా, కేవలం పునాదులకే వందల కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు వచ్చినా, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నిర్ణయాలు చేయడం ఏపీకి శాపంగా మారింది. అమరావతి రైతులు త్యాగాలు చేశారంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. నిజానికి వారికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వడం అంటే అదే పెద్ద లాభం. దానికి తోడు ఎకరాకు ఏబై వేల రూపాయల చొప్పున కౌలు చెల్లిస్తున్నారు. మరి ఇందులో వీరు చేసిన త్యాగం ఏమిటో తెలియదు. శుభ్రంగా పొలం పనులు చేసుకునేవారిని చెడగొట్టి వారికి ఉత్తపుణ్యానికి కౌలు చెల్లించవలసిరావడం సరైనదేనా అన్న చర్చ ఉంది.పైగా అవసరానికి మించి ఉన్న భూములను వెనక్కి ఇవ్వడానికి వీలు లేకుండా ఆనాటి ప్రభుత్వం పొలం గట్టన్నిటిని  దున్నేసింది.

✍️ఇలా అనేక రకాలుగా తప్పులు చేసిన ఫలితంగా అమరావతి రాజధాని అన్నది ఒక భ్రమగానే మిగిలింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిదీ ఊహాజనిత ఫోటోలతో బాహుబలి సెట్టింగ్ ల గ్రాఫిక్  వీడియోలతో జనాన్ని మాయ చేయాలని  విఫల యత్నం చేసింది. చివరికి స్కాముల రాజధానిగా అమరావతి మారడం దురదృష్టం. షాపూర్ పల్లోంజి సంస్థ ఆద్వర్యంలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం వంటి భవనాలలో జరిగిన అవినీతి బహిర్గతమైంది. చివరికి కేంద్ర ఆదాయపన్ను శాఖే చంద్రబాబునాయుడుకు నోటీసులు పంపించి రూ. 118 కోట్ల నల్లధనానికి లెక్కలు అడిగింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ను   వెలికితీసి చంద్రబాబు తన కంపెనీ హెరిటేజ్ కొన్న భూములకు, లింగమనేని రమేష్  కు ఉన్న 350 ఎకరాల భూమికి లబ్ది చేకూర్చేలా రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారన్న అభియోగంపై కేసు పెట్టింది. అందులో కూడా  చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్ లు నిందితులుగా ఉన్నారు.అస్సైన్ మెంట్ లాండ్ కేసు కూడా వీరికి చుట్టుకుంటోంది.

జగన్ ప్రభుత్వం చేసిన వాదనలను ఒకరకంగా కాగ్ కూడా బలపరిచిందని అనుకోవచ్చు.  ఏది ఏమైనా అలివికాని పనులు చేస్తామంటూ బీరాలు పోవడం, దానిని కుంభకోణాల మయం చేయడం ,చివరికి అవినీతి  కేసులలో చిక్కుకోవడం.. ఇదంతా చంద్రబాబు స్వయంకృతాపరాధం. 2014లో  చేతికి వచ్చిన మహదవకాశాన్ని చంద్రబాబు ఇలా కాలదన్నుకుని ఇప్పుడు జైలుపాలయ్యారు.


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement