Telangana Congress: అప్పుడే మొదలైన కుర్చీలాట.. కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం ఎవరు?

Kommineni Article On CM Candidate Fight In Telangana Congress Leaders - Sakshi

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే కుర్చీ ఆట మొదలైంది. కచ్చితంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకమో, లేక ఎమ్మెల్యేగా గెలవడానికి ఆ కుర్చినీ చూపిస్తున్నారో కాని మొత్తం మీద ముఖ్యమంత్రి పదవి తనదంటే తనదని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కొన్ని సర్వేలలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉందన్ని సమాచారంతో సీఎం పదవి కుర్చీపై కూడా కొందరు ఖర్చీఫ్ వేసుకుంటున్నట్లుగా ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కొడంగల్ శాసనసభ స్థానానికి నామినేషన్ వేసిన సందర్భంగా కుర్చీ పేరుతో చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకర్షించాయి. పార్టీలో కొందరికి కాస్త అసహనం కూడా ఏర్పడింది.

నాకే సీఎం పదవి: రేవంత్‌
రేవంత్ చాలా స్పష్టంగా తనకే ముఖ్యమంత్రి పదవి వస్తుందని కొడంగల్ ప్రజలకు చెప్పడం ద్వారా ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. ఇందులో రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి తానే ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నానని పార్టీలో పోటీ పడేవారికి సంకేతం ఇవ్వడం, తాను ముఖ్యమంత్రి అవుతాను కనుక తనను మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం. నిజానికి ఇది ఒకరకంగా సాహసం అని చెప్పాలి. వర్గాలతో నిండి ఉండే కాంగ్రెస్‌లో ఇలా చెప్పడం అంటే సమస్యలను కొని తెచ్చుకోవడమే. అయినా ఆ పని చేయడానికే ముందుకు వెళ్లారు. దానికి కారణం సెంటిమెంట్‌ను ప్రయోగించడమే.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌నుంచి ఒక్కరే
ఈ సందర్భంగా గతంలో బూర్గుల రామకృష్ణారావు ఒక్కరే ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు తనకు అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. మరో విషయం చెప్పాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆఆర్ పోటీ చేసే కామారెడ్డి నుంచి కూడా నామినేషన్ వేశారు. అక్కడ గెలిచే అవకాశం సహజంగానే తక్కువ. ఒకవేళ అక్కడ గెలిస్తే, కాంగ్రెస్ అధికారంలో వచ్చే పక్షంలో ఆయనే సీఎం అవుతారని చెప్పవచ్చు. మరో పాయింట్ ఏమిటంటే రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు కోట్లు కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లారు. అది నెగిటివ్ మార్క్ అయినా, ఆ విషయం తెలిసి కూడా పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు కనుక అది పెద్ద అభ్యంతరం కాకపోవచ్చు.  

కాంగ్రెస్‌లో అతి వేగంగా పీసీసీ అధ్యక్షుడిగా
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అయ్యే అర్హత బాగానే ఉంటుంది. అందులోను రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి అతి వేగంగా పీసీసీ అధ్యక్ష స్థాయికి చేరారు. కాని అన్నిసార్లు అలా జరగాలని లేదు. గతంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగా, ఆయన ఆ రెండుసార్లు సీఎం కూడా అయ్యారు. కాని రెండేళ్లలోపే పదవిని వదలుకోవల్సి వచ్చిన సంగతి కూడా గుర్తుచుకోవాలి. కానీ ఆ తర్వాత కాలంలో అలాంటి అవకాశంఎవరికి రాలేదు. ఉదాహరణకు డి.శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ, వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వానికి జనామోదం ఉండడంతో ఆయనను ముఖ్యమంత్రిని చేశారు.

లైన్‌లో కోమటిరెడ్డి కూడా..
తాజాగా కర్నాటకలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కాదని, సిద్దరామయ్యను సీఎంగా చేశారు. సిద్దరామయ్య అంతకు ముందు కూడా సీఎంగా పనిచేసిన అనుభవం ఉపయోగపడింది. వీరిద్దరి పోటీ అక్కడ వర్గ కలహాలకు ప్రాతిపదికగా మారింది. కాంగ్రెస్ రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పలువురు తామూ సీఎం అభ్యర్దులమేనని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకటించుకున్నారు. రేవంత్ రెడ్డి సభలో ఆయన అభిమానులు సీఎం, సీఎం అని నినాదాలు చేసి ఉత్సహాపడ్డారో, అదే మాదిరి మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ ఘట్టం సందర్భంగా జరిగిన సభలో కూడా ఆయనను సీఎం, సీఎం అని అనుచరులు నినాదాలు చేశారు. దానిపై ఆయన స్పందించారు.

తాను కూడా సీఎం రేసులో ఉన్నానని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ లో తనకు సీనియారిటీ ఉందన్నది ఆయన భావన. ఆయనతో పాటు నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా తనకు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించవచ్చు. అందరికన్నా సీనియర్ అయిన మాజీ మంత్రి జానారెడ్డి ఈసారి పోటీ చేయకపోయినా, ఆయా ప్రచార సభలలో తనకు సీఎం అయ్యే అర్హత ఉందని చెప్పి మనసులో మాట బయటపెట్టారు. మరో నేత జగ్గారెడ్డి ఎప్పటికైనా సీఎం అవుతానని అంటున్నారు. పైగా సీఎం పదవిని అధిష్టానం నిర్ణయిస్తుందని పరోక్షంగా రేవంత్ రెడ్డికి ఆయన జవాబు ఇచ్చారు.

భట్టికి చాన్‌?
మరో నేత మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు. దళితవర్గానికి చెందినవారికి సీఎం పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే ఆయనకు చాన్స్ రావచ్చు. మరోవైపు బీజేపీ బీసీ కార్డు ప్రయోగిస్తున్నందున, ఆ వర్గాలకు చెందినవారు కూడా తాము రేసులో ఉంటామని ప్రకటించవచ్చు. బీజేపీ గెలిస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని, ప్రధాని మోదీ ఈ మేరకు హామీ ఇచ్చారని ఈటెల రాజేందర్ కూడా ప్రచారం ఆరంభించారు. ఆయన లక్ష్యం కూడా ఆ సెంటిమెంట్ ద్వారా తొలుత శాసనసభ్యుడిగా ఎన్నికవడమే అన్న సంగతి తెలుస్తూనే ఉంది.

ఇదంతా ఎన్నికల ముందు జరుగుతున్న చర్చ. అసలు ఎన్నికలలో గెలవడం ముఖ్యం.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు వీరంతా పోటీ పడే అవకాశం ఉంటుంది. ఈలోగా ఎవరికి వారు తొలుత ఎమ్మెల్యే అవడం కోసం వ్యూహాత్మకంగా సీఎంపదవిని ఒక ఆకర్షణగా తమ నియోజకవర్గాలలో ప్రచారం చేసుకుంటున్నారని అనుకోవచ్చు. ఇంతకీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటారా?


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top