
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, ఆ పార్టీ నేతృత్వంలోని కూటమితో దేశ సమగ్రతకు ముప్పువాటిల్లుతోందనీ దేశ ప్రజ లు ఈ విషయంపై ఆలోచించాలని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ‘ఇండియా కూటమి’అహంకారాన్ని ఆదిలో నే అడ్డుకుని సరైన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుతూ బుధవారం ఆయన బహిరంగ ప్రకటన చేశారు. సనాతన ధర్మానికి, హిందుత్వానికి, హిందీ మాట్లాడే ప్రజలకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ పనికిరాని కూటమి రోజురోజుకూ ప్రమాదంగా మారుతోందని ధ్వజమెత్తారు.
మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహ రి స్తోందని నిందించారు. ఇటీవలే కాంగ్రెస్ కూటమిలోని డీఎంకే నాయకుడు.. యూపీ, బిహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడే వాళ్లు, తమిళనాడుకు టాయిలెట్లు కడిగేందుకు వస్తారని చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపా యని గుర్తు చేశారు.
ఆయా ప్రాంతాలకు చెందిన కార్మికులు.. శ్రమనే నమ్ముకుని జీవనోపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని ఇంత నీచంగా అవమానించాల్సిన అవసరం ఉందా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. శ్రమజీవులను అవమానించడం, కష్టపడి పనిచేసేవారిని అవహేళన చేయడం కాంగ్రె స్‌కు, వారితో అంటకాగుతున్న వారికి మొదట్నుంచీ అలవాటేనని ఆరోపించారు.
అధికారంలోకి వస్తే హిందువులను నిర్మూలించాలనే వారి ఆలోచన
ఇటీవలే పార్లమెంటులో చర్చ సందర్భంగా.. రాజకీయ స్వార్థంతో కడుపునిండా ద్వేషాన్ని నింపుకుని ఓ ఎంపీ మాట్లాడారని కిషన్‌రెడ్డి నిందించారు. గోమూత్రాన్ని తాగే రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందన్న ఆ ఎంపీ అహంకార పూరితమైన మాటలను యావత్ సమాజం తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు.
డీఎంకే పార్టీ సనాతన ధర్మాన్ని కేన్సర్, డెంగ్యూ, మలేరియాతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. కొంతమంది కుహనా లౌకికవాదులు అహంకారపూరితంగా నోటికొచ్చినట్లు మాట్లాడటమే మేధావితనమని, గొప్పతనమని అనుకుంటున్నారని విమ ర్శించారు.
ప్రతిసారీ హిందుత్వం, పేద ప్రజలపై తమ అక్కసును వెళ్లగక్కడం ద్వారా.. 2024 ఎన్నికలకు తమ ఎజెండాను ఈ కూటమి స్పష్టం చేసిందని తెలిపారు. అధి కారంలోకి వస్తే హిందుత్వాన్ని, హిందువులను నిర్మూలించడమే ఆ కూటమి ఆలోచన అని అర్ధమవుతోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.