సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ.. ఏమన్నారంటే? | Minister Kishan Reddy Wrote Letter To CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ.. ఏమన్నారంటే?

Jul 17 2025 12:47 PM | Updated on Jul 17 2025 2:00 PM

Minister Kishan Reddy Wrote Letter To CM Revanth Reddy

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతిపాదించిన పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వ సహకారం కోరుతూ లేఖలో పేర్కొన్నారు.  

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (CPSUలు), ముఖ్యంగా కోల్ ఇండియా లిమిటెడ్ (CIL), నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NLCIL).. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుని, సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు (PSP), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) వంటి కీలకమైన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని కిషన్‌రెడ్డి లేఖలో తెలిపారు. 
ఈ ప్రాజెక్టులు వచ్చే మూడేళ్లలో దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్శించనున్నాయి.

లేఖలో కీలక ప్రతిపాదనలు:

  • తెలంగాణలోని అధిక సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గల జోన్‌లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను అభివృద్ధి చేయడం.

  • గ్రిడ్ స్టెబిలిటీ, ఎనర్జీ రిలయబిలిటీలను మరింత పెంచేలా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)ను అభివృద్ధి చేయడం.

  • క్రిటికల్ బ్యాలెన్సింగ్ కెపాసిటీని అందించేందుకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల అధ్యయనం, అమలు.

  • ప్రాజెక్టు అమలును వేగవంతం చేయడానికి, స్థానిక ఆర్థిక ప్రయోజనాలను పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో లేదా బొగ్గు కంపెనీలు స్వతంత్ర ప్రాతిపదికన జాయింట్ వెంచర్ మోడల్స్ ఏర్పాటు చేయడం.

  • ఈ ప్రతిపాదనలు, ప్రాజెక్టులకు భూసేకరణ, భూకేటాయింపు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు అవసరం.

ఈ ప్రాజెక్టులు కర్బన ఉద్గారాలను తగ్గించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం, సహజ వనరుల నిర్వహణ తదితర విషయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఇంధన భద్రతతోపాటుగా, అవసరమైనంత మేర విద్యుత్ ను అందుబాటులోకి తీసుకురావడం, సమ్మిళిత అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచడం వంటి సామాజిక-ఆర్థిక ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. ఈ ప్రాజెక్టులు విజయవంతంగా అమలుకావడానికి రాష్ట్ర ప్రభుత్వం, CPSUల మధ్య నిర్మాణాత్మక భాగస్వామ్యం, సరైన సమన్వయం అత్యంత అవసరం. ఇందుకోసం మీరు ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని కోరుతున్నాను. మీ జోక్యంతోనే ఈ ప్రాజెక్టులు వేగంగా, సమర్థవంతంగా అమలు అవుతాయని విశ్వసిస్తున్నాను.

పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో తెలంగాణ సామర్థ్యాన్ని గుర్తిస్తూ.. రాష్ట్రంలో హరితాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైన చిత్తశుద్ధితో సహకారం అందిస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతదేశ సుస్థిర విద్యుత్ వ్యవస్థలో తెలంగాణ పాత్ర కీలకం కానున్న సందర్భంలో.. ఈ ప్రాజెక్టుల ప్రాధాన్యత మరింత పెరగనుంది. తెలంగాణకు ఉన్న పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం, హరితాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మరో మెట్టు ముందుకు తీసుకెళ్తాయి. దీంతోపాటుగా భారతదేశం సుస్థిర ఇంధన పరివర్తన దిశగా చేస్తున్న కృషిలో తెలంగాణ కీలక పాత్ర పోషించడానికి ఇదొక చక్కటి అవకాశం. భారతదేశపు దీర్ఘకాల ప్రణాళికలైన ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణను సాకారం చేసుకోవడంలో భాగంగా ఆర్థిక పురోగతిని, అభివృద్ధి అవకాశాలను సమతుల్యం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  సమన్వయం అత్యంత కీలకం.

పర్యావరణ పరిరక్షణతో పాటుగా ఆత్మ నిర్భరతతో కూడిన భవిష్యత్‌ను ఏర్పరచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్మాణాత్మక సహకారంలో మీ చొరవ కీలకం. తెలంగాణలో రానున్న ఈ సానుకూల మార్పుకు మీ సహకారాన్ని కోరుతూ.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, మా శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలనుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement