
ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పనికిరాని సర్వే చేసిందని ఆరోపించారు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. 75 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ ఏనాడు బీసీ జనగణన చేయలేదు. బీసీలను కాంగ్రెస్ మభ్యపెడుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీసీని ప్రధానిని చేసిన ఘటన బీజేపీది అంటూ చెప్పుకొచ్చారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘దేశానికి అత్యధిక కాలం పని చేసిన రెండో ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. బీసీలను కాంగ్రెస్ మభ్య పెడుతోంది. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం అమలు చేయడంలో ఫెయిల్ అయ్యింది. బీసీల్లో ముస్లింలను కలపడం వల్ల బీసీ వర్గాలకి అన్యాయం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీసీ సీట్లలో ముస్లింలకు పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన 42 శాతం రిజర్వేషన్లలో పది శాతం ముస్లింలకు ఇవ్వడం వల్ల నిజమైన బీసీలకు నష్టం జరుగుతుంది. 75 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ ఏనాడు బీసీ జనగణన చేయలేదు. కాంగ్రెస్ పనికిరాని సర్వే చేసింది.
బీసీలలో ముస్లింలను కలిపేలా కేంద్రం కుల గణన ఉండదు. బీసీలకు న్యాయం చేసేలా కుల గణన ఉంటుంది. కాంగ్రెస్ ఏనాడు బీసీ సీఎం, బీసీని ప్రధానిని చేయలేదు. బీసీని ప్రధానిని చేసిన చరిత్ర బీజేపీది. మోదీ కన్వర్టెడ్ బీసీ ఎలా అవుతారు?. కాంగ్రెస్ హయంలోనే మండల కమిషన్ ద్వారా మోదీ కులాన్ని బీసీల్లో చేర్చాలి. బీసీల్లో చేర్చినపుడు కనీసం మోదీ ఎమ్మెల్యే కూడా కాదు. రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక కులాలు బీసీల్లో కలిశాయి. లంబాడాలను కూడా కన్వర్టెడ్ ఎస్టీ అంటారా?.
తెలంగాణలో ఎన్నికలొస్తే కాంగ్రెస్ ఓటమి ఖాయం. కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా వారి ఓటమి ఖాయం. రాహుల్ గాంధీది ఏ సామాజిక వర్గమో చెప్పాలి. ఎన్నికైన ప్రధాని మోదీపై అవాకులూ చెవాకులూ పేలడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. 42శాతం రిజర్వేషన్లు బీసీలకు మాత్రమే ఇవ్వాలి. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టేందుకు మాకు అభ్యంతరం లేదు కానీ చట్టానికి లోబడి ఉండాలి. మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తాం. మెట్రో విషయంలో రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తాను. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పిల్లి మొగ్గలు వేస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.